అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు దిగ్గజం గుడ్‌బై
234 మ్యాచ్‌లలో 146 గోల్స్
క్లబ్ స్థాయిలో కొనసాగనున్న స్టార్
లిస్బన్: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో ఒక అద్భుత ఆటగాడి శకం ముగిసింది. 23 ఏళ్ల పాటు పోర్చుగల్ టీమ్ తరఫున అలరించిన స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఇకపై జాతీయ జట్టు తరఫున ఆడనంటూ రిటైర్మెంట్ ప్రకటించాడు. 18 ఏళ్ల వయసులో 2003లో పోర్చుగల్ తరఫున తొలిసారి బరిలోకి దిగిన రొనాల్డో 234 మ్యాచ్‌లు ఆడి 146 గోల్స్ కొట్టాడు. నిజానికి ప్రపంచకప్ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో ఓడిన వెంటనే రొనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి తప్పుకోవాలని భావించినా... పోర్చుగల్ ఫెడరేషన్ (ఎఫ్‌పీఎఫ్) అధ్యక్షుడు పెడ్రో పొన్‌కా విజ్ఞప్తితో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. అయితే టీమ్ కోచ్ జోర్గ్ జీసస్‌తో విభేదాలు తీవ్రమయ్యాయి.
గత సెప్టెంబర్ లో నేషన్స్ లీగ్‌లో భాగంగా వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను పోర్చుగల్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. నార్వేతో జరిగిన తర్వాతి మ్యాచ్ నుంచి కోచ్ పూర్తిగా తప్పించడంతో రొనాల్డో చెప్పాపెట్టకుండా క్యాంప్ నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రాజీ కుదిరినా అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఎఫ్‌పీఎఫ్ 30 రోజుల నిషేధాన్ని, జరిమానాను విధించింది. ఈ స్థితిలో మున్ముందు టీమ్‌లోకి వచ్చే అవకాశం లేకపోవడంతో రొనాల్డో ఆటకు గుడ్‌బై చెప్పాడు. 41 ఏళ్ల రొనాల్డో క్లబ్ ఫుట్‌బాల్‌లో మరికొంత కాలం కొనసాగనున్నాడు. ప్రస్తుతం అతను సౌదీ అరేబియాకు చెందిన అల్–నాసర్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఘనమైన రికార్డు...
తన సమకాలీకుడు, మరో దిగ్గజం లయోనల్ మెస్సీతో పోలిస్తే ‘ఫిఫా’ వరల్డ్ కప్ గెలవకపోవడమే రొనాల్డో సుదీర్ఘ కెరీర్‌లో లోటుగా ఉండిపోయింది. ఇది మినహా 23 ఏళ్ల పాటు జాతీయ జట్టు ఆటగాడిగా అతని విలువ అమూల్యం. రెండు దశాబ్దాలకు పైగా అతను పోర్చుగల్ టీమ్‌కు కర్త, కర్మ, క్రియలా నిలిచాడు. యూరోప్‌లోని ఇతర జట్లతో పోలిస్తే అతనొక్కడి వల్లే పోర్చుగల్‌కు ప్రత్యేక ఆకర్షణ వచ్చిందనడంలో సందేహం లేదు.
రొనాల్డో రాకముందు వరకు ఒక్క మేజర్ ట్రోఫీ కూడా గెలవని టీమ్ 2016లో తొలిసారి ప్రతిష్టాత్మక ‘యూరో కప్’ను సొంతం చేసుకుంది. 2019, 2025లలో అతని ప్రదర్శన వల్లే ‘యూరో నేషన్స్ లీగ్’ టోర్నీని గెలుచుకుంది. రొనాల్డో రాకముందు వరకు కేవలం 3 సార్లు మాత్రమే ‘ఫిఫా’ వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయిన పోర్చుగల్... అతను వచ్చిన తర్వాత 2006 నుంచి 2026 వరకు వరుసగా ఆరు వరల్డ్ కప్‌లకు అర్హత సాధించడం విశేషం.
234 అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా రికార్డు
146 అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా రికార్డు
6 వరుసగా ఆరు వరల్డ్ కప్‌లలో (2006, 2010, 2014, 2018, 2022, 2026) గోల్స్ కొట్టిన ఏకైక ఆటగాడు. మొత్తం 27 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడిన రొనాల్డో 11 గోల్స్ కొట్టాడు.

‘జెర్సీ నంబర్ 7ను పోర్చుగీస్ ప్రజలకు తిరిగి అప్పగించాల్సిన సమయం వచ్చేసింది. 23 ఏళ్ల పాటు ఇది నా ఒక్కడిదే కాదు. ఎంతో బాధ్యతతో కూడిన గౌరవంతో ప్రపంచవ్యాప్తంగా దీనిని నేను ధరించాను. కొన్ని నిర్ణయాలు కేవలం మన ఆలోచనతో తీసుకునేవి కాదు. అవి హృదయంతో తీసుకోవాల్సినవి. అందుకే ఇది అంత సులువైన నిర్ణయం కాదు. 2003 ఆగస్టులో మొదలై నా జీవితాన్ని మార్చేసిన ప్రయాణం ముగిసింది. దేశం తరఫున ప్రతీసారి నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాను. ప్రతీసారి గెలవాలనే శ్రమించాను.
మనం ఇంకా ముందుకు వెళ్లగలమని నమ్మాను. చరిత్ర సృష్టించాలని ఆశించాను. ఇన్నేళ్లలో ఎన్నో గొప్ప అనుభూతులు ఉన్నాయి. బాధపెట్టిన కొన్ని పరాజయాలూ ఉన్నాయి. కొన్ని తప్పుల వల్ల నేనూ బాధపడ్డాను. పోర్చుగీస్ ప్రజలు ఎంతో కోరుకున్న విజయాన్ని మాత్రం అందించలేకపోయాను. కానీ నేను చివరి వరకు పోరాటం ఆపలేదు. పోర్చుగల్‌కు ప్రాతినిధ్యం వహించడం ప్రతీసారి గర్వకారణంగా భావించాను. 23 ఏళ్ల పాటు నాకు అండగా నిలిచిన, నాపై నమ్మకం ఉంచిన వారందరికీ కృతజ్ఞతలు. ఫుట్‌బాల్ వెంట పరుగెత్తడమే పనిగా ఆడుకున్న ఒక చిన్నారి కలను నిజం చేసినవారందరికీ ధన్యవాదాలు. –క్రిస్టియానో రొనాల్డో


