అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు మరోసారి అదే కనిపించింది. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని వరుస పోస్టులతో విరుచుకుపడుతున్న ఆయన.. తాజాగా ఏకంగా ఇరాన్ మ్యాప్‌పై తన ముఖాన్ని పెట్టారు. అక్కడితో ఆగారా అంటే అదీ లేదు.. ‘ఇరాన్ ఓ విఫల దేశం’ అంటూ సందేశం ఇచ్చారు. ఆదివారం ట్రూత్ సోషల్‌లో గంట వ్యవధిలో ఇరాన్‌కు సంబంధించిన ఏడు పోస్టులు పెట్టిన ట్రంప్.. ఆ దేశంపై అమెరికా ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో చూపించేందుకు మ్యాప్‌లు, గ్రాఫిక్స్‌ను ఉపయోగించారు.
తాజా పోస్టుల్లో ఒకదానిలో ఇరాన్ మ్యాప్ కనిపించగా.. దానిపై ట్రంప్ ముఖాన్ని ఉంచారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని చెప్పేందుకు ఈ చిత్రాన్ని ఉపయోగించారు. మరో పోస్టులో ఇరాన్ చమురు ఎగుమతులు భారీగా పడిపోయాయని పేర్కొన్నారు. ఇరాన్‌కు కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని క్షిపణులతో పేల్చేసినట్లు ఓ పోస్ట్ చేశారు. అలాగే హర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా మళ్లీ పెరిగిందంటూ మరో గ్రాఫిక్‌ను పోస్ట్ చేశారు.
హర్ముజ్‌కూ ‘ట్రంప్’ ముద్ర?
ట్రంప్ ఇంతటితో ఆగలేదు. వ్యూహాత్మకంగా కీలకమైన హర్ముజ్ జలసంధికి ‘ట్రంప్ స్ట్రెయిట్’ అని పేరు మార్చాలని గతంలో వ్యాఖ్యానించారు. ఆ వెంటనే వైట్‌హౌజ్ వర్గాలు అదే పేరుతో ఓ మ్యాప్‌ను రిలీజ్ చేశారు. ఇక ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ జలమార్గం ప్రస్తుతం అమెరికా-ఇరాన్ ఘర్షణకు ప్రధాన కేంద్రంగా మారింది. అమెరికా ఆంక్షలు, నౌకా దిగ్బంధంతో ఇరాన్ చమురు ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని అమెరికా చెబుతుండగా.. హర్ముజ్‌పై తన ప్రభావాన్ని కొనసాగిస్తామని టెహ్రాన్ స్పష్టం చేస్తోంది.
ట్రంప్‌తో మాములుగా ఉండదు
ట్రంప్‌కు ఇలాంటి పనులు కొత్తేం కాదు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘గల్ఫ్ ఆఫ్ మెక్సికో’ పేరును ‘గల్ఫ్ ఆఫ్ అమెరికా’గా, అలాస్కాలోని ‘డెనాలి’ పేరును ‘మౌంట్ మెకిన్లీ’గా మార్చేందుకు ఏకంగా కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ వినియోగంలో ఈ పేర్లు అధికారికంగా అమల్లోకి వచ్చాయి.
ఇటీవల మరో అడుగు ముందుకేసి కెనడా లేక్ ఒంటారియోను ‘లేక్ అమెరికా’గా పేరు మార్చాలంటూ యాపిల్ మ్యాప్స్‌కు ట్రంప్ సూచించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. గూగుల్ ఇప్పటికే అమెరికా వినియోగదారుల కోసం ఆ పేరును చూపించడం ప్రారంభించింది.
ట్రంప్ రాజకీయ అస్త్రం
ట్రంప్ తాజా ఇరాన్ పోస్టులను గమనిస్తే.. మ్యాప్‌లు కేవలం భౌగోళిక వివరాల కోసం కాకుండా రాజకీయ సందేశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే సాధనంగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ మ్యాప్‌పై తన ముఖం, ‘ఫెయిలింగ్ నేషన్’ అనే వ్యాఖ్య.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై చమురు ఎగుమతులు, కరెన్సీ పతనం, హర్ముజ్ సంక్షోభాన్ని కలిపి చూపించే గ్రాఫిక్స్.. ఇవన్నీ ఒకే సందేశాన్ని బలపరిచేలా ఉన్నాయి.
ఇరాన్‌పై ఆర్థిక, సైనిక ఒత్తిడిని పెంచుతున్న సమయంలో ట్రంప్ సోషల్ మీడియా పోస్టులు కూడా అదే దూకుడును ప్రతిబింబిస్తున్నాయి. అయితే టెహ్రాన్ మాత్రం అమెరికా ఒత్తిడికి తలొగ్గేది లేదని చెబుతోంది. దీంతో ట్రంప్ తాజా ‘మ్యాప్ పోస్టు’ కూడా అమెరికా-ఇరాన్ ఘర్షణలో మరో రాజకీయ సందేశంగా మారింది.
ఇదీ చదవండి: అంతులేని వెతుకులాట!


