తిరువూరులోని శావల దేవదత్ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న సిబ్బంది
తిరువూరులో టీడీపీ నేత ఆస్పత్రి ఎదుట సిబ్బంది ధర్నా
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీనేత, రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ చైర్మన్ శావల దేవదత్ నిర్వహిస్తున్న అమరావతి ఆస్పత్రి ఎదుట ఆస్పత్రి సిబ్బంది సోమవారం ధర్నా చేశారు. తమకు నెలల తరబడి పెండింగులో ఉన్న జీతాలు చెల్లించాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆరు నెలలుగా 30 మందికి జీతాలు చెల్లించకుండా ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి సుమారు రూ.60 వేల వరకు జీతం బకాయిలు రావాలని వివరించారు.
వేతనాలు లేక కుటుంబ పోషణ భారమైందని, పిల్లల ఫీజులు కట్టలేక, కుటుంబం గడవక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆక్రోశించారు. ఈ విషయమై తాము కలెక్టరుకు, లేబర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఇప్పటికి పలుమార్లు చర్చలు జరిపినా, ఆస్పత్రి యాజమాన్యం వేతనాల చెల్లింపునకు ముందుకు రానందున 1936 వేతనాల చెల్లింపు చట్టం ప్రకారం ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవాలని కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ ధనలక్ష్మి ఇటీవల సూచించారని, తమకు ఎవరు న్యాయం చేస్తారని ఆస్పత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, వేతనాల కోసం శావల దేవదత్ వద్దకు వెళ్లిన సిబ్బందిని ఆయన స్పందించిన తీరు తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ‘మీడియాకు ఎక్కి పరువు తీస్తే జీతాలు ఇస్తారా? మీరు ఎమ్మెల్యేకి, ఎంపీకి, మంత్రి లోకేశ్‌కి చెప్పుకున్నా నాకేమీ ఇబ్బంది లేదు’ అని దేవదత్ సిబ్బందితో బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.
ఇంటికి వెళ్లి కొలికపూడిని కొడతా: దేవదత్
తాను ఎన్నికల్లో టికెట్ కోసం ఎంపీ చిన్నికి డబ్బులిచ్చానని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఆయన అనుచరులు చేస్తున్న ప్రచారాన్ని దేవదత్ ఖండించారు. తన ఆస్పత్రి సిబ్బంది ఆందోళన చేయడానికి తెరవెనుక ప్రోత్సహించే వారెవరో తెలుసని, ఇటువంటి చర్యలకు పాల్పడే వారిని వదలబోనని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును హెచ్చరించారు. ఇలాంటివి ఆపకపోతే ఆయన ఇంటికి వెళ్లి కొడతానని దేవదత్ హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్‌షాపులే..!
ఇక్కడే ఉన్నట్టు చెప్పడానికి నువ్వెవడివి?
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై ధ్వజమెత్తిన టీడీపీనేత దేవదత్
‘రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బెల్టు షాపులు ఉన్నాయి.. ఒక్క తిరువూరు నియోజకవర్గంలో ‘బెల్టు షాపులు ఉన్నట్టు చెప్పడానికి నువ్వెవడివయ్యా?.. నీకేంటి నొప్పి’ అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ నేత, రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ చైర్మన్ శావల దేవదత్ విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో బెల్టు దుకాణాలు అధికంగా ఉండడంతో ప్రజలు మద్యానికి బానిసై ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నారని ఎమ్మెల్యే కొలికపూడి చేసిన ఫిర్యాదుపై టీడీపీ నేత శావల దేవదత్ తీవ్రంగా స్పందించారు.
ఆదివారం రాత్రి తిరువూరులో విడుదల చేసిన వీడియోలో ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు. ‘నీ చేతకాని తనంతో పార్టీపై ఆరోపణలు చేయద్దు.. నీ వల్ల ఏమైనా అవుతుందా? పల్లె కన్నీరు కారుస్తోందంటున్నావు. నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు’ అంటూ ఎమ్మెల్యేపై దేవదత్ ధ్వజమెత్తారు. కూర్చుని సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదంటూ దేవదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


