భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లు.. ప్రపంచంలో ఏమూల దాగున్నా అజ్ఞాత వ్యక్తులు వారిని మట్టుబెడుతున్న ఘటనలను మనం చూస్తూనే ఉన్నాం..! ఇంకా చెప్పాలంటే.. భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు విదేశాల్లో తలదాచుకుంటున్నా.. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అయితే.. భారత్‌కు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న అండర్ వరల్డ్ డాన్.. దావూద్ ఇబ్రహీం విషయంలో ప్రభుత్వం ఎందుకు సఫలం కావడం లేదు? చిక్కడు.. దొరకడు అన్నట్లుగా తప్పించుకు తిరుగుతున్న దావూద్‌ను లేపేయడానికి రెండు దశాబ్దాల క్రితమే భారత్ స్కెచ్ వేసినా.. ఇలాంటి ఆపరేషన్లలో అత్యంత దురంధరుడిగా ఉన్న అజిత్ దోబాల్ వ్యూహం పన్నినా.. ముంబై పోలీసులు చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా.. ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యిందంటే మీరు నమ్ముతారా?
భారత గూఢచర్య సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్.. క్లుప్తంగా రా ఎన్నెన్నో ఆపరేషన్లు చేపట్టింది. అయితే.. దావూద్ ఇబ్రహీంను మాత్రం ఓ అదృశ్య శక్తి కాపాడిందని చెబుతుంటారు. రా ఆపరేషన్లలో దురంధరుడిగా పేరు తెచ్చుకున్న డైనమిక్ ఆఫీసర్ అజిత్ దోబాల్ 2005లో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయనే ‘ఆపరేషన్ దావూద్’కి స్కెచ్ వేశారు. ఈ పని చేసింది మాత్రం రా కాదు.. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అప్పటికే ఐక్య రాజ్య సమితి కూడా దావూద్‌ను డిసిగ్నేటెడ్ టెర్రరిస్టుగా గుర్తించింది. దాంతో.. పాక్‌లో ఉన్నంత కాలం దావూద్‌పై దాడులకు చాన్సే ఉండదు. అప్పుడే.. దావూద్ కూతురు మహరూఖ్ పెళ్లి విషయం దోబాల్‌కు తెలిసింది. క్రికెటర్ జావేద్ మియాందాద్ కుమారుడు జునైద్‌తో అదే ఏడాది జూలై 9న మక్కాలో నిఖా.. జూలై 13న దుబాయ్‌లోని గ్రాండ్ హయాత్ హోటల్‌లో రిసెప్షన్ అనే సమాచారం భారత్‌కు అందింది. దాన్ని చక్కటి అవకాశంగా మలచుకోవాలని దోబాల్ భావించారు.
దావూద్‌ను మట్టుబెట్టడానికి భారత్ ముందు ఓ అడ్డంకి కనిపించింది. అయితే.. దుబాయ్‌లో ఆ ఆపరేషన్‌ను అధికారికంగా చేపట్టడం వల్ల సమస్యలను కొని తెచ్చుకోవడం తప్పదని దోబాల్ భావించారు. దీంతో.. అధికారిక ఆపరేషన్ మాదిరిగా కమాండోలను కాకుండా.. సంఘ విద్రోహక శక్తులనే పావులుగా వాడుకోవాలని నిర్ణయించారు. అప్పటికే దావూద్‌కు, అండర్ వరల్డ్ ప్రపంచాన్ని శాసించాలని ఉవ్విళ్లూరుతున్న ఛోటారాజన్‌కు మధ్య వివాదం ముదిరి పాకాన పడుతోంది. ఛోటారాజన్‌ను లేపేసేందుకు స్కెచ్‌లు కూడా వేశాడు. ఈ వైరాన్ని అనుకూలంగా మలచుకోవాలనుకున్న దోబాల్.. కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చారనేలా ఛోటారాజన్ సాయంతో పనికానివ్వాలని పక్కా ప్లాన్ వేశారు. ఛోటారాజన్ అనుచరులు, షార్ప్ షూటర్లుగా పేరున్న విక్కీ మల్హోత్రా, ఫరీద్ తనాషాకు ఆ బాధ్యతలను అప్పగించారు.
అనుకున్నదే తడవుగా విక్కీ, ఫరీద్‌లను దోబాల్ ఢిల్లీకి పిలిపించుకున్నారు. మూడు వారాలపాటు ఓ రహస్య ప్రదేశంలో ప్రత్యేక శిక్షణనిప్పించారు. ప్లాన్ ఎగ్జిక్యూషన్‌కు వారు సిద్ధమయ్యారనుకున్నాక.. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో వాళ్లకు దోబాల్ బ్రీఫింగ్ ఇచ్చారు. వారిద్దరికీ సూడాన్ పాస్‌పోర్టులు ఇచ్చి.. విమానంలో బిజినెస్ క్లాస్ ప్రయాణానికి టికెట్లు అందజేశారు.
తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచిందన్నట్లు అజిత్ దోబాల్ స్కెచ్‌కు పెద్ద అడ్డంకి ఏర్పడింది. అదికూడా ముంబై పోలీసుల కారణంగా..! మరో ఐదు రోజుల్లో విక్కీ, ఫరీద్‌లను దుబాయ్ పంపించే ముందు.. ఆ ఫైవ్ స్టార్ హోటల్‌లో దోబాల్ వారిద్దరికీ తన స్కెచ్ గురించి చెబుతుండగా.. ‘టక్.. టక్.. టక్’ అంటూ హోటల్ గది తలుపులను బయటి నుంచి కొందరు వ్యక్తులు బాదారు. తలుపులు తెరిచిన దోబాల్ ఎదుట.. ముంబై డీసీపీ ధనుంజయ్ కమలాకర్, అతని టీమ్ కనిపించింది. వారు దోబాల్‌కు అరెస్టు వారెంట్‌ను చూపించి.. విక్కీ, ఫరీద్‌లను బెదిరింపు కేసుల్లో అరెస్టు చేయడానికి వచ్చినట్లు వివరించారు. దోబాల్ ఎంత నచ్చజెప్పినా.. కమలాకర్ వినలేదు. అది రహస్య ఆపరేషన్ కావడంతో.. దోబాల్ మరోమాట మాట్లడలేదు. ఫలితంగా.. వారిద్దరినీ అరెస్టు చేసి, తీసుకెళ్తున్నా.. మిన్నకుండిపోయారు.
అయితే.. దావూద్‌ను కాపాడిన ఆ అదృశ్య శక్తి ఎవరనేది ఇప్పటికీ వెలుగులోకి రాలేదు. విక్కీ, ఫరీద్‌లను అరెస్టు చేసిన టీమ్‌లో ఉన్న మీరా చద్దా బోర్వంకర్ వంటివారు ఆ తర్వాతి కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మాత్రం.. ‘‘ఇది రెండు సంస్థల మధ్య సమన్వయ లోపంతో జరిగిన తప్పిదం. ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. దావూద్‌ను రక్షించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. ఐబీ చీఫ్ మాకు కనీస సమాచారం ఇవ్వకపోవడం వల్లే.. ఈ గందరగోళం జరిగింది’’ అని పేర్కొనడం గమనార్హం..! దీనికి మీరేమంటారు..? దావూద్‌ను నిజంగానే అదృశ్య శక్తి కాపాడిందా?? కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనా.. ఓ అండర్ వరల్డ్ డాన్‌ను తుదముట్టించేందుకు భారత్‌కు వచ్చిన ఓ అద్భుతమైన అవకాశం మాత్రం కొద్దిలో చేజారింది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ మీ ముందుకు వస్తాను.


