పోలీసులు రాజకీయ నాయకుల సేవకులేం కాదు | Bombay High Court: Police Are Not Servants of Political Leaders | Sakshi
Sakshi News home page

పోలీసులు రాజకీయ నాయకుల సేవకులేం కాదు

Jul 3 2026 10:36 AM | Updated on Jul 3 2026 10:46 AM

Bombay High Court: Police Are Not Servants of Political Leaders

ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ప్రతీ పౌరుడికీ ఉంటుందని చెబుతూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అలాగే.. పోలీసులు రాజకీయ నాయకులకు సేవకులు కాదని.. ప్రజా సేవకులని స్పష్టం చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రన చర్యలు తీసుకోవడం సరికాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

ముంబై పోలీసులు ఒక రాజకీయ కార్యకర్తపై విధించిన నగర బహిష్కరణ (externment) ఆదేశాన్ని తాజాగా ముంబై హైకోర్టు రద్దు చేసింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ జందార్ పోలీసులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పౌరులు ప్రభుత్వానికి బానిసలు కారు. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే హక్కు కూడా ఉంది. పోలీసులు ప్రజల సేవకులు.. అంతేకానీ రాజకీయ నాయకుల సేవకులు కారు’’ అని వ్యాఖ్యానించారు.

సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) ప్రధాన కార్యదర్శి సయ్యద్ వహీద్ చౌదరిపై ముంబై పోలీసులు నగర బహిష్కరణ విధించారు. ఆయన 2019 నుంచి 2024 మధ్య వివిధ నిరసనల్లో పాల్గొన్నారని ఆరోపిస్తూ పోలీసులు పలు FIRలు నమోదు చేశారు. అందులో సీఏఏ, ఎన్‌ఆర్‌సీతోపాటు బాబ్రీ మసీదు–జ్ఞానవాపి వివాదాలు, ఇంధన ధరల పెరుగుదల వ్యతిరేక నిరసనల్లాంటివి ఉన్నాయి. 

ఈ కేసుల ఆధారంగా కొంకణ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ 2025 డిసెంబర్‌లో చౌదరిని ముంబై నగరం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒక సంవత్సరం పాటు బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలను డివిజనల్ కమిషనర్ కూడా సమర్థించారు. ఈ బహిష్కరణ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, వాటిని పూర్తిగా కొట్టివేసింది. పోలీసులు తీసుకున్న చర్యలు చట్టబద్ధంగా నిలబడవని స్పష్టం చేసింది.

కోర్టు ప్రధాన పరిశీలనలు
కేవలం నిరసనల్లో పాల్గొన్నందుకే నగర బహిష్కరణ విధించడం సరైనదికాదు. ఇది పౌరుల భావప్రకటన స్వేచ్ఛ (Article 19), జీవించే హక్కు (Article 21)ను ఉల్లంఘిస్తుందని తేల్చింది. అలాగే, ఆ ఆరోపణలు ప్రజా భద్రతకు తీవ్రమైన ముప్పుగా పోలీసులు నిరూపించలేకపోయారు అని బాంబే హైకోర్టు పేర్కొంది. దీంతో ముంబై పోలీసులు జారీ చేసిన నగర బహిష్కరణ ఆదేశాన్ని, అలాగే అప్పీల్ స్థాయిలో ఇచ్చిన ఆమోదాన్ని కూడా హైకోర్టు రద్దు చేసింది. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన హక్కు మూలాధారం అని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం నేరం కాదని ఈ తీర్పు ద్వారా న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement