కొత్త కార్యవర్గంతో.. బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌ | bjp appoints deepak mhaske as social media convener | Sakshi
Sakshi News home page

కొత్త కార్యవర్గంతో.. బీజేపీ మాస్టర్‌ ప్లాన్‌

Aug 17 2026 8:17 PM | Updated on Aug 17 2026 8:36 PM

bjp appoints deepak mhaske as social media convener

ఢిల్లీ: ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల దేశంలో జరిగిన జెన్‌జీ ఉద్యమం నుంచి తమిళనాడులో విజయ్‌ వరకూ సోషల్‌ మీడియా ఆదారంగానే తమ ప్రచారాన్ని సాగించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. గత 11 ఏళ్లుగా సోషల్‌ మీడియా కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అమిత్ మాల్వీయా స్థానంలో దీపక్ మాస్కేకు బాధ్యతలు అప్పగించింది. త్వరలో కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్‌ ఈ రోజు కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ బృందంలో భారీ మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా విభాగానికి దీపక్ మాస్కేను కన్వీనర్‌గా నియమించింది. ఆయనకు పృతి గాంధీ, శివానంద్ ద్వివేది, అలోక్ భట్, అరుణ్ యాదవ్‌లు సోషల్ మీడియా కో-కన్వీనర్లుగా నియమించింది. రానున్న ఎన్నికల్లో సోషల్‌ మీడియానే కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దీపక్ మాస్కే నేపథ్యం

దీపక్ మాస్కే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందినవారు. ఇటీవల జరిగిన  బీహార్, ఛత్తీస్‌గఢ్,  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ రాష్ట్రాల్లో పార్టీ అద్భుత విజయాలు సాధించడంలో ఆయన వ్యూహాలు తోడ్పడ్డాయి. ఎన్నికల డేటాను సేకరించడం, విశ్లేషించడంలో ఆయనకు మంచి పట్టు ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటాను విశ్లేషించి, పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి నివేదికలు రూపొందించారు.

కమ్యూనికేషన్ వ్యూహానికి అనిల్ బలూనీ

పార్టీ కమ్యూనికేషన్ విభాగంలో సైతం కీలక మార్పులు చేసింది. మీడియా కోఆర్డినేటర్‌గా అనిల్ బలూనీని నియమించింది. ఆయనకు జాయింట్ కోఆర్డినేటర్లుగా ఆశిష్ ఉషా అగర్వాల్, ప్రదీప్ భండారీ, సిద్ధార్థ్ యాదవ్‌లను నియమంచింది.రాజకీయ పార్టీలు ఓటర్లు, పార్టీ కార్యకర్తలను నేరుగా చేరుకోవడానికి డిజిటల్ వేదికలపై మరింతగా ఆధారపడుతున్న సమయంలో ఈ నియామకాలు జరిగాయి. తాజా బృందంలో అనుభవజ్ఞులైన నాయకులతో పాటు సంస్థాగత, క్షేత్రస్థాయి అనుభవం ఉన్న నేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో కొత్త తరం నాయకులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు.

మోదీ అభినందనలు

నూతనంగా ఏర్పాటైన కార్యవర్గ బృందానికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.“కొత్తగా నియమితులైన ఈ బృందంలో సంస్థాగత అనుభవం, శక్తి, క్షేత్రస్థాయి అనుసంధానం కలిసివున్నాయి. పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజాసేవపై దృష్టి సారించడంలో వారు తమ వంతు కృషి చేస్తారని నమ్ముతున్నాను. వారికి నా శుభాకాంక్షలు” అని మోదీ పేర్కొన్నారు.

మరోవైపు ఇప్పటివరకు బీజేపీ ఐటీ విభాగానికి సుదీర్ఘకాలంగా సేవలంధించిన అమిత్ మాలవీయ కొత్త బృందానికి అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా విభాగం అధిపతిగా తన స్థానంలో దీపక్ మాస్కే బాధ్యతలు స్వీకరించనున్నారని పేర్కొన్నారు.

“దీపక్ మాస్కే జీకి ప్రత్యేకంగా అభినందనలు. ఆయన ఇకపై బీజేపీ సోషల్ మీడియా విభాగానికి నాయకత్వం వహించనున్నారు. అలాగే కో-కన్వీనర్లుగా నియమితులైన పృతి గాంధీ, శివానంద్ ద్వివేది, అలోక్ భట్, అరుణ్ యాదవ్‌లకు శుభాకాంక్షలు” అని అమిత్ మాలవీయ తెలిపారు.

బీజేపీ నయా టీమ్‌లో పలువురు సీనియర్ నేతలకు ప్రాధాన్యమైన బాధ్యతలు దక్కాయి. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, రామ్ మాధవ్, పీయూష్ గోయల్, బైజయంత్ జయ్ పాండా తదితరులకు కీలక బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బీఎల్ సంతోష్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించారు. ఆయనకు సహాయంగా శివప్రకాశ్, సౌదాన్ సింగ్‌లను జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement