‘‘నేను కిడ్నాప్‌ అయ్యాను.. రూ.5 లక్షలు పంపండీ’’ | Crying video Rs 5 lakh ransom demand Then a twist in Pune man kidnapping | Sakshi
Sakshi News home page

‘‘నేను కిడ్నాప్‌ అయ్యాను.. రూ.5 లక్షలు పంపండీ’’

Aug 17 2026 7:29 PM | Updated on Aug 17 2026 7:57 PM

Crying video Rs 5 lakh ransom demand Then a twist in Pune man kidnapping

పుణేలో 19 ఏళ్ల ఓ యువకుడు తాను కిడ్నాప్‌ అయినట్లు నాటకం ఆడాడు. తాను ఏడుస్తున్న వీడియోలను కుటుంబ సభ్యులకు పంపించి, తనను విడిచిపెట్టేందుకు కిడ్నాపర్లు రూ.5 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని చెప్పాడు. అయితే పోలీసులు అతడిని ఓ లాడ్జిలో గుర్తించారు.

ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన ఓం ప్రకాశ్‌ గౌరీశంకర్‌ ఉద్యోగం కోసం పుణేకు వచ్చాడు. నెలల తరబడి ఉద్యోగం లేకపోవడంతో అతడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

దీంతో కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకునేందుకు అతడు ఓ పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. గౌరీశంకర్‌ తన బంధువులు, అన్నయ్యకు తాను కిడ్నాప్‌కు గురయ్యానని చెప్పాడు. తనను విడిచిపెట్టేందుకు కిడ్నాపర్లు రూ.5 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని తెలిపాడు.

తన మాటలు నిజమని నమ్మించేందుకు తాను ఏడుస్తున్న వీడియోలను వారికి పంపించాడు. కిడ్నాప్‌ విషయం తెలిసి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్‌ పోలీసులను ఆశ్రయించారు. వారు పుణే పోలీసులకు సమాచారం అందించారు.

ఆగస్టు 16 అర్ధరాత్రి పుణే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పలు పోలీస్‌ స్టేషన్లకు చెందిన బృందాలు, రాత్రి గస్తీ బృందాలు, ఇతర సిబ్బంది ఈ గాలింపులో పాల్గొన్నారు. గౌరీశంకర్‌ ఉపయోగిస్తున్న మొబైల్‌ నంబర్‌ను పోలీసులు ట్రాక్‌ చేయగా, ఓ హోటల్‌ సమీపంలో ఆ ఫోన్‌ పనిచేస్తున్నట్లు గుర్తించారు.

దీంతో ఓ పోలీసు బృందం, రాత్రి గస్తీ సిబ్బంది, మార్షల్స్‌తో కలిసి ఖడ్కీలోని క్రౌన్‌ ప్లాజా లాడ్జింగ్‌కు చేరుకుంది. అక్కడ గౌరీశంకర్‌ కనిపించాడు. ప్రాథమిక దర్యాప్తులో ఎలాంటి కిడ్నాప్‌ జరగలేదని తేలింది. కుటుంబం నుంచి డబ్బు పొందేందుకు యువకుడు మొత్తం ఘటనను కల్పించినట్లు పోలీసులు గుర్తించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement