పశ్చిమ బెంగాల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బీర్భూమ్ జిల్లా తారాపీఠ్‌లోని ఓ లాడ్జిలో భారీగా మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. మంటల్లో మరికొందరు చిక్కుకుని ఉండడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. వీళ్లంతా అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులుగా తెలుస్తోంది.
తారాపీఠ్(Tarapith) ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రంగా పేరొందింది. ఇక్కడి తారా దేవి ఆలయాన్ని శక్తి ఆరాధనకు సంబంధించిన ముఖ్యమైన పీఠాల్లో ఒకటిగా భక్తులు భావిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తారాపీఠ్‌కు దర్శనం కోసం వస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసం, ప్రత్యేక పూజల సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆలయానికి వచ్చే భక్తుల కోసం పరిసర ప్రాంతాల్లో అనేక హోటళ్లు, లాడ్జీలు అందుబాటులో ఉంటాయి.
సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో లాడ్జిలో ఒక్కసారిగా మంటలు(Tarapith Fire Accident) చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. హోటల్‌లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆరుగురి మృతదేహాలను వెలికి తీశారు.
తారాపీఠ్‌కు పోటెత్తిన భక్తులు..
శ్రావణ మాసం సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తారాపీఠ్‌కు చేరుకున్నారు. వీరిలో పలువురు సమీపంలోని హోటళ్లలో బస చేశారు. ఇదే క్రమంలో అగ్నిప్రమాదానికి గురైన హోటల్‌లో కూడా భక్తులు ఉన్నట్లు సమాచారం. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో కొందరు బయటకు వచ్చే అవకాశం లేక సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. ఘటనాస్థలంలో పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదానికి కారణం..?
హోటల్‌లో మంటలు ఎలా చెలరేగాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. షార్ట్ సర్క్యూట్ లేదంటే ఇతర కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, మృతుల పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.


