న్యూఢిల్లీ: యూజీసీ-నెట్‌లో ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నపత్రాల్లో లోపాలు ఉన్నట్లు గుర్తించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. వాటిని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వైఫల్యాల భారాన్ని విద్యార్థులపై మోపుతున్నారని ఆరోపించారు. ‘‘మీ ఎన్‌టీఏ ఏం చేసిందో చూడండి’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.
‘‘ఏళ్ల తరబడి చదివిన వేలాది మంది అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి వచ్చింది. దరఖాస్తులు, ఫీజులు, దూర ప్రాంతాలకు ప్రయాణాలు.. అన్నీ మరోసారి చేయాల్సి వస్తోంది. తప్పు చేసింది ఎన్‌టీఏ.. కానీ శిక్ష అనుభవించేది మాత్రం విద్యార్థులు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. జూన్ 22 నుంచి 30 వరకు జరిగిన యూజీసీ-నెట్ పరీక్షలను దాదాపు రెండు నెలల తర్వాత రద్దు చేయడంపై ఆయన ప్రశ్నించారు. పరీక్షలకు ముందే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయా? అనే అసలు ప్రశ్నకు NTA సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు.
Modi ji, look at what your NTA has just done.
UGC-NET exams for Sociology, English and Commerce were held between 22 and 30 June. Nearly two months later, NTA has cancelled all three because it set faulty papers and repeated old questions.
Thousands of candidates who prepared… https://t.co/TUMhhMhjvL— Rahul Gandhi (@RahulGandhi) August 17, 2026
‘విద్యా వ్యవస్థ కాదు.. వసూళ్ల యంత్రం’
దేశంలోని ప్రస్తుత విద్యా వ్యవస్థపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇది ఇక విద్యా వ్యవస్థ కాదు.. ఒక ఎక్స్‌ట్రాక్షన్ మెషీన్‌గా మారింది. ఇది విద్యార్థుల డబ్బు, సమయం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసాన్ని తీసుకుంటోంది. కానీ తిరిగి ఉద్యోగం కూడా ఇవ్వడం లేదు’’ అని విమర్శించారు. పేపర్ లీక్ వ్యవహారాలపై బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం తొలి అడుగు మాత్రమేనని.. NTA నాయకత్వంపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
సెప్టెంబర్‌లో రీటెస్ట్
NTA ప్రకారం.. ఇంగ్లిష్, కామర్స్ అభ్యర్థులకు సెప్టెంబర్ 9న, సోషియాలజీ పరీక్షకు సెప్టెంబర్ 10న రీటెస్ట్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు అదనపు ఫీజు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. మిగిలిన 84 సబ్జెక్టుల ఫలితాలు షెడ్యూల్ ప్రకారమే విడుదల చేస్తామని తెలిపింది. నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న NTAపై తాజాగా యూజీసీ-నెట్ రీటెస్ట్ నిర్ణయం మరింత ఒత్తిడి పెంచింది.


