డీఎస్సీ అక్రమాలు.. లోకేష్‌ ప్రకటనతో ఇరుకున పడ్డ ప్రభుత్వం! | Nara Lokesh DSC Statement Big Trouble For Kutami | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలు.. లోకేష్‌ ప్రకటనతో ఇరుకున పడ్డ ప్రభుత్వం!

Aug 17 2026 1:07 PM | Updated on Aug 17 2026 1:16 PM

Nara Lokesh DSC Statement Big Trouble For Kutami

సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాల విషయంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా బుక్కైంది. ఎలాంటి అవకతవకలు జరగలేదని నిన్నటిదాకా బుకాయిస్తూ వస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌.. ఇప్పుడు, ఇవాళ అసెంబ్లీ వేదికగా అన్ని తప్పులనూ అంగీకరించారు!. అంతేకాదు.. స్పోర్ట్స్‌ కోటా జీవోను మళ్లీ రద్దు చేసిన ప్రభుత్వం.. రిటెన్‌ టెస్ట్‌ పెడుతూ జీవో నెంబర్‌ 56ను రిలీజ్‌ చేయడం గమనార్హం.  

డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చిన లోకేష్‌.. గతంలో క్రీడాకారిణి పీవీ సింధుకు రాత పరీక్ష లేకుండా ఉద్యోగం ఇచ్చిన విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అదే విధానంలో స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులకు కూడా రాత పరీక్ష లేకుండా నియామకాలు చేపట్టినట్లు వివరించారు. అయితే పీవీ సింధు వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణి, సాధారణ క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఒకటేనా? అనేనా ప్రశ్న మొదలైంది.

జీవోల్లో మార్పులు.. 
స్పోర్ట్స్‌ కోటా నియామకాలపై వివాదం నేపథ్యంలో ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 47ను రద్దు చేసి.. కొత్తగా జీవో 56ను తీసుకొచ్చింది. తాజా నిబంధనల్లో రాత పరీక్షను తప్పనిసరి చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మార్పు కూడా డీఎస్సీ ప్రక్రియలో గందరగోళానికి దారితీసినట్లైంది. తద్వారా అవకతవకలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని స్పష్టమవుతోంది.

నవీన్‌ వ్యవహారంపైనా ప్రశ్నలు
ఎస్‌ఈఆర్‌టీ ఉద్యోగి నవీన్‌కు టాప్‌ ర్యాంక్‌ రావడం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై కూడా అసెంబ్లీలో చర్చ జరిగింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కాలేదని, అందుకే ఉద్యోగం ఇవ్వలేదని గతంలో ప్రభుత్వం కోర్టుకు వివరించింది. అయితే ఇవాళ శాసన సభలో లోకేష్‌ మాట్లాడుతూ.. కోర్టులో ప్రభుత్వం ఇచ్చిన వివరణకు విరుద్ధంగా ప్రకటన చేశారు. అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగి కావడంతో ఎన్‌ఓసీ తీసుకోలేదని లోకేశ్‌ పేర్కొన్నారు. ఎన్‌వోసీ అంశంపై తాము రిజక్ట్ చేయలేదని సెక్రటరీ కోన శశిధర్ గతంలో చెప్పారు. అలా.. ఈ రెండు ప్రకటనల నడుమ మధ్య బోలెడు వ్యత్యాసం ఉంది. 

ఒకరికే అవకాశం ఇచ్చారా?
ఇక ఎస్‌ఈఆర్‌టీ, డీఎస్సీ కన్వీనర్‌ ఒకే వ్యక్తికి ఇచ్చిన అంశాన్ని కూడా లోకేష్‌ ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం తరఫున లోకేశ్‌ వివరణ ఇస్తూ.. అలా ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడా లేదని సమర్థించుకున్నారు. దీంతో నియామక ప్రక్రియలో పారదర్శకతపై అనుమానాలు ఉన్నాయి.

అవును.. అక్రమాలు జరిగాయ్‌
స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై వచ్చిన ఆడియో లీక్‌ అంశాన్ని కూడా లోకేష్‌ సభలో ప్రస్తావించారు. దీనిపై శాప్‌ ఫిర్యాదు చేసిందని, సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.

అయితే ఈ పరిణామాలన్నీ డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో లోపాలను బయటపెడుతున్నాయి. మెరిట్‌ అభ్యర్తుల్ని పట్టించుకోకుండా తమకు నచ్చినవాళ్లకే స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాలిచ్చారని వైఎస్సార్‌సీపీ తొలి నుంచి చెబుతోంది. డీఎస్సీ అక్రమాలపై దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేస్తూ శాసన మండలిలో ఇవాళ గట్టిగా గళం వినిపిస్తోంది. ఈ తరుణంలో.. వైఎస్సార్‌సీపీ గైర్హాజరు అయిన శాసనసభలో లోకేశ్‌ ప్రకటన చేయడం, అవకతవకలు జరగలేదంటూనే తప్పులు అంగీకరించడంతో సెల్ఫ్‌ గోల్‌ వేసుకున్నట్లైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement