ఐపీఎల్‌పై దావూద్‌ కన్ను పడింది! | Lalit Modi has made a sensational comments on ipl | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌పై దావూద్‌ కన్ను పడింది!

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 5:30 AM

Lalit Modi has made a sensational comments on ipl

నియంత్రించాలని ప్రయత్నించాడు

మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీ వెల్లడి  

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను ఒకదశలో అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కూడా శాసించేందుకు ప్రయత్నించాడు. తన బెట్టింగ్‌ నెట్‌వర్క్‌ కోసం లీగ్‌ను నియంత్రించేందుకు అతను పట్టుదల కనబర్చాడు. ఈ క్రమంలో నాటి లీగ్‌ కమిషనర్‌ లలిత్‌ మోదీని అతను చంపేస్తానని కూడా బెదిరించాడు. ఈ విషయాలను స్వయంగా లలిత్‌ మోదీ వెల్లడించాడు. 

ఐపీఎల్‌కు రూపకల్పన చేసి తొలి మూడు సీజన్లు అన్నీ తానై నడిపించిన మోదీపై ఆ తర్వాత బీసీసీఐ చర్య తీసుకుంది. ఆర్థిక లావాదేవీల్లో అవినీతి ఆరోపణలు తదితర కారణాలతో 2010 సీజన్‌ తర్వాత భారత్‌ను విడిచి వెళ్లిన మోదీ లండన్‌లో స్థిరపడ్డాడు. క్రికెట్‌ పరిపాలన నుంచి తాను పూర్తిగా తప్పుకునేందుకు దావూద్‌ బెదిరింపులు కూడా కారణమని అతను చెప్పాడు. 

‘ఎన్నికల కారణంగా నేను 2009 ఐపీఎల్‌ను దక్షిణాఫ్రికాకు తరలించడం వారికి నచ్చలేదు. టోర్నీ రద్దవుతుందని వారు భారీ మొత్తాల్లో పందెం కాశారు. ఈ పరిణామంతో పెద్ద ఎత్తున నష్టపోయారు. వారు లీగ్‌ను చేతుల్లోకి తీసుకోవాలని భావించారు. టోర్నీ ఆరంభం నుంచి కూడా నేను కఠినంగా వ్యవహరించి ఫిక్సింగ్‌ను అరికట్టాను. స్టేడియాల్లో ఎలాంటి తప్పుడు పనులు జరగనివ్వలేదు. ఇవన్నీ దావూద్‌ బృందానికి ఆగ్రహం కలిగించాయి. 

ముంబై, జొహన్నెస్‌బర్గ్, క్రొయేషియా సరిహదుల్లో మూడు సార్లు నాపై హత్యకు కుట్ర పన్నారు. లండన్‌లో నా కొడుకును కిడ్నాప్‌ చేసేందుకు కూడా ప్రయత్నించారు. 2012లో ఒక మధ్యవర్తి నాకు దావూద్‌తో ఫోన్‌ చేయించాడు. ఈ రోజుతో నీ పని ముగిసింది అని ఒకే ఒక మాట చెప్పి అతను ఫోన్‌ పెట్టేశాడు. నేను చాలా భయపడిపోయాను. ఆ తర్వాత క్రికెట్‌ పరిపాలనకు పూర్తిగా దూరమయ్యాను’ అని లలిత్‌ మోదీ వివరించాడు. 

Advertisement
 
Advertisement
Advertisement