‘‘మీరంతా సల్లబడేటట్టు చేస్తా.. జాగ్రత్త’’ | Gorakhpur cop threatens DDU protesting students | Sakshi
Sakshi News home page

‘‘మీరంతా సల్లబడేటట్టు చేస్తా.. జాగ్రత్త’’

Sep 9 2026 7:22 PM | Updated on Sep 9 2026 8:23 PM

Gorakhpur cop threatens DDU protesting students

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌, దీనదయాళ్ ఉపాధ్యాయ గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 2 వారాలుగా పలు సమస్యలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో ఓ పోలీసు అధికారి నిరసన చేస్తున్న విద్యార్థులను తీవ్రంగా హెచ్చరిస్తూ కనిపించారు. క్యాంపస్‌లో అదనపు పోలీసు బలగాలను మోహరిస్తానని ఆయన హెచ్చరించారు.

“ఇంకా బలగాన్ని రప్పిస్తాను.. మీరంతా సల్లబడేటట్టు చేస్తా. మేము గోరఖ్‌పూర్ పోలీసులమని గుర్తుంచుకోండి” అని పోలీసు అధికారి హెచ్చరించినట్లు వీడియోలో వినిపిస్తోంది. వీడియోలో పోలీసు అధికారి చేయి పైకెత్తి పిడికిలి బిగిస్తూ ఆగ్రహంగా మాట్లాడటం కనిపించింది. విద్యార్థులతో ఆయన వాగ్వాదానికి దిగిన సమయంలో కొన్ని అసభ్య పదాలు కూడా వినిపించాయి.

ఈ ఘటనపై గోరఖ్‌పూర్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. బహిష్కరణకు గురైన కొందరు విద్యార్థులు విశ్వవిద్యాలయ ప్రాక్టర్‌తో సమావేశమైన సమయంలో పరిస్థితి అదుపు తప్పిందని పోలీసులు తెలిపారు. కొంతమంది విద్యార్థులు ఆగ్రహానికి గురై ప్రాక్టర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు పేర్కొన్నారు.

అక్కడ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని ప్రాక్టర్‌ను సురక్షితంగా బయటకు తీసుకెళ్లారని తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని గోరఖ్‌పూర్ పోలీసులు తెలిపారు.

పోలీసు అధికారి వ్యవహారంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. నిరసన చేస్తున్న వారు విద్యార్థులని, నేరస్థులు కాదని గుర్తుంచుకుని సంయమనం పాటించాలని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు.

విద్యార్థుల నిరసనలు ఎందుకు?
విశ్వవిద్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలతో విద్యార్థుల ఆందోళన తీవ్రతరమైంది. ఆగస్టు 25 నుంచి విద్యార్థులు క్యాంపస్‌లో నిరసన చేస్తున్నారు. 4 రోజుల క్రితం వారు నిరాహార దీక్ష కూడా ప్రారంభించారు. విశ్వవిద్యాలయ పరీక్షల నిర్వహణ సంస్థకు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. డిగ్రీలు, మార్కుల పట్టాలు తీసుకునేందుకు కూడా విద్యార్థుల నుంచి రుసుములు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. 

విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించకపోయినా విద్యార్థుల నుంచి విద్యార్థి సంఘం రుసుము వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో మెరుగైన భోజనం, ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రధానమంత్రి ఉషా పథకం కింద విశ్వవిద్యాలయంలో చేపడుతున్న పనుల కేటాయింపులో పారదర్శకత ఉండాలని వారు డిమాండ్ చేశారు. బహిష్కరించిన విద్యార్థులను తిరిగి చేర్చుకోవాలని కూడా కోరుతున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement