4 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన జడ్జి.. ఇప్పుడేమంటున్నారంటే? | What Judge Says Behind 23 Death Sentences In 4 Months? | Sakshi
Sakshi News home page

4 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన జడ్జి.. ఇప్పుడేమంటున్నారంటే?

Sep 9 2026 5:22 PM | Updated on Sep 9 2026 5:30 PM

What Judge Says Behind 23 Death Sentences In 4 Months?

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్ గత 4 నెలల్లో 23 మందికి మరణశిక్ష విధించారు. తాజా తీర్పులో వరకట్నం డిమాండ్‌ కారణంగా భార్యను సజీవ దహనం చేసిన నదీమ్‌కు మరణశిక్ష విధించారు. ఈ కేసులో నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 302, 504 కింద దోషిగా నిర్ధారించి రూ.లక్ష జరిమానా విధించారు.

షాజహాన్‌పూర్ పట్టణంలో 2018 జూలై 23న నదీమ్ తన భార్య షెహజాదీని వరకట్నం డిమాండ్‌ కారణంగా నిప్పంటించి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర గాయాలతో ఆమెను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. మరణానికి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో నదీమ్ తనకు నిప్పంటించినట్లు షెహజాదీ చెప్పినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.

విచారణ సమయంలో అభియోగపక్షానికి చెందిన మొత్తం 11 మంది సాక్షులు తమ వాంగ్మూలాలను మార్చుకున్నారు. అయినప్పటికీ షెహజాదీ మరణ వాంగ్మూలం ఆధారంగా కోర్టు నదీమ్‌ను దోషిగా తేల్చింది. ఈ హత్య అత్యంత క్రూరమైనదిగా, అనాగరికమైనదిగా పేర్కొన్న కోర్టు దీనిని అత్యంత అరుదైన కేసుల్లో అరుదైనదిగా పరిగణించి మరణశిక్ష విధించింది.

ఈ తీర్పుతో దివాకర్ కోర్టు గత 4 నెలల్లో 11 కేసుల్లో 23 మందికి మరణశిక్ష విధించింది. అయితే మరణశిక్షకు సంబంధించిన కేసుల్లో తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. నిందితులకు పైకోర్టుల్లో అప్పీల్ చేసుకునే హక్కు ఉంటుంది.

చనిపోవడానికే సిద్ధం: జడ్జి
‘‘నన్ను పిరికి న్యాయమూర్తి అని పిలిపించుకోవడం కంటే చనిపోవడానికే సిద్ధం’’ అని దివాకర్ అన్నారు. తన సూత్రాలను పాటిస్తూ విధులు నిర్వహించగలిగినంతకాలం పదవిలో కొనసాగుతానని, అలా చేయలేని పరిస్థితి వస్తే రాజీనామా చేస్తానని తెలిపారు. తాను న్యాయమూర్తి స్థానంలో ఉన్నంతకాలం నిర్ణయాలు తీసుకునే అధికారం తనదేనని ఆయన తీర్పులో పేర్కొన్నారు. న్యాయమూర్తి తనపై మాఫియా, నేరస్థుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. మాఫియా, నేరస్థులకు ప్రయోజనం చేకూర్చేలా తన కోర్టు నుంచి సుమారు 100 తీవ్రమైన కేసులను తొలగించారని ఆరోపించారు.

ఆగస్టులో దివాకర్ ముందు పెండింగ్‌లో ఉన్న సుమారు 100 హత్య కేసులను పరిపాలనా ఉత్తర్వుల ద్వారా జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి వీరేంద్ర కుమార్ సింగ్ కోర్టుకు బదిలీ చేశారు. ఫాస్ట్‌ట‍్రాక్‌ కోర్టు మరణశిక్షలు విధించే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ కేసుల బదిలీ జరిగిందని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ త్యాగి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement