సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హౌరా- చెన్నై కారిడార్‌లో భాగంగా విశాఖ, విజయవాడ మీదుగా నాలుగు లేన్ల నిర్మాణానికి అంగీకారం తెలిపింది. ముంబై- చెన్నై కారిడార్‌లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా నాలుగు లేన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపింది. అదే విధంగా దేశంలో 7 హై డెన్సిటీ రైల్వే కారిడార్ల అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు భారతీయ రైల్వేల భారీ ప్రణాళికలో భాగంగా ఢిల్లీ–హౌరా, ఢిల్లీ–ముంబై కారిడార్లకు ప్రాధాన్యం ప్రకటించింది. ఢిల్లీ–చెన్నై మార్గంలో విజయవాడ కీలక స్టేషన్‌గా అదేవిధంగా హౌరా–చెన్నై కారిడార్‌లో విశాఖపట్నం స్టేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ముంబై–చెన్నై మార్గంలో రేణిగుంట, గుంతకల్ అభివృద్ధి కి ఊతం ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఈ అంశమై రైల్వేశాఖ మంత్రి మాట్లాడుతూ పలు మార్గాల్లో నాలుగో లైన్ పనులు చేపట్టడంతో పాటు మరికొన్ని కారిడార్లు డీపీఆర్, ఆమోద దశలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర నిర్ణయాలతో సరుకు రవాణా, ప్రయాణికుల సేవల సామర్థ్యం పెరగనుందని రైళ్ల సమయపాలన మెరుగుపడుతుందని కేంద్రమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.


