పొలిటికల్ హీట్.. స్టాలిన్‌పై బాడీ షేమింగ్‌ ఆరోపణలు | tamilnadu cm vijays clarification over accusations of body shaming | Sakshi
Sakshi News home page

పొలిటికల్ హీట్.. స్టాలిన్‌పై బాడీ షేమింగ్‌ ఆరోపణలు

Sep 8 2026 7:28 PM | Updated on Sep 8 2026 8:30 PM

tamilnadu cm vijays clarification over accusations of body shaming

చెన్నై: డీఎంకే అధినేత ‍స్టాలిన్‌పై తమిళనాడు సీఎం విజయ్‌ బాడీషేమింగ్‌ చేసారన్న ఆరోపణలపై తాజాగా ఆయన స్పందించారు. అసెంబ్లీలో మాట్లాడుతుండగా తాను చేసిన  హావభావం అనుకోకుండా జరిగిందని, అది  ఏ విధంగానూ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా ఎవరినైనా బాధపెట్టాలనే ఉద్దేశంతో తాను ఆ చర్య చేయలేదని తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు.

ఈ విషయమై తన వివరణను ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ...  “2026 సెప్టెంబర్ 7న శాసనసభలో పోలీసు శాఖ గ్రాంట్‌పై నా సమాధాన ప్రసంగం సందర్భంగా, మధ్యలో అనుకోకుండా కనిపించిన నా బాడీ లాంగ్వేజ్ ఏ విధంగానూ ఉద్దేశపూర్వకమైనది కాదు. అందువల్ల, ఎవరి వ్యక్తిగత భావాలను బాధపెట్టే ఉద్దేశంతో చేసిన చర్యగా దాన్ని అర్థం చేసుకోవద్దని కోరుతున్నాను” అని పేర్కొన్నారు.

కాగా విజయ్ ప్రసంగం అనంతరం  డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఛాంబర్‌ వెలుపల నిరసనకు దిగారు. విజయ్ చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మార్షల్స్ జోక్యం చేసుకుని డీఎంకే ఎమ్మెల్యేలను అక్కడి నుంచి బలవంతంగా తొలగించారు.

అదే సమయంలో సీపీఐ(ఎం) నేత పి. షణ్ముగం కూడా విజయ్‌పై తీవ్రంగా స్పందించారు. విజయ్ తన హావభావం ద్వారా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై వ్యక్తిగత దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా, స్టాలిన్ గతంలో మీసా నిర్బంధ సమయంలో ఎదుర్కొన్న దాడి కారణంగా దెబ్బతిన్న దవడను విజయ్ అనుకరించినట్లుగా కనిపించిందని షణ్ముగం పేర్కొన్నారు.

ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయని, అదే సమయంలో తీవ్ర అణచివేత, అకృత్యాలు చోటుచేసుకున్నాయని షణ్ముగం తన ఎక్స్ పోస్టులో గుర్తుచేశారు. ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను పోలీసులు దారుణంగా కొట్టడంతో ఆయన దవడ విరిగిందని తెలిపారు. ఎవరైనా ఒకరి శారీరక రూపాన్ని ఎగతాళి చేయడం ఖండించదగిన విషయం. ముఖ్యమంత్రి స్వయంగా అలా చేయడం బాధ్యతారాహిత్యమైన చర్యని షణ్ముగం విమర్శించారు.

వివాదం ఎందుకు?
ఈ వివాదానికి కారణమైన ఘటన  నిన్న సోమవారం తమిళనాడు అసెంబ్లీలో విజయ్ చేసిన ప్రసంగంలో చోటు చేసుకుంది. అధికారంలో ఉన్న డీఎంకేపై విజయ్ తీవ్ర విమర్శలు చేశారు. తన ప్రసంగంలో మీసా కాలం గురించి ప్రస్తావిస్తున్న సమయంలో విజయ్ దవడను చూపించారు. ఈ హావభావాన్ని చాలామంది స్టాలిన్‌కు గతంలో జరిగిన దాడి, దాని కారణంగా ఆయన దవడ విరిగిన ఘటనకు సూచనగా భావించారు. దీంతో విజయ్ ఉద్దేశపూర్వకంగా స్టాలిన్ శారీరక పరిస్థితిని ఎగతాళి చేశారనే ఆరోపణలు వచ్చాయి.

అయితే ఇప్పుడు విజయ్ ఇచ్చిన వివరణ ప్రకారం, ఆ హావభావం అనుకోకుండా జరిగినదే తప్ప, ఎవరినైనా వ్యక్తిగతంగా అవమానించాలన్న లేదా బాధపెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement