అప్పుల ట్రాప్‌లో భారత్!? | Is India in a Debt Trap Anand Ranganathan Rs 280 Lakh Cr Debt Debate Explained | Sakshi
Sakshi News home page

అప్పుల ట్రాప్‌లో భారత్!?

Sep 22 2026 1:06 PM | Updated on Sep 22 2026 1:39 PM

Is India in a Debt Trap Anand Ranganathan Rs 280 Lakh Cr Debt Debate Explained

దేశ ఆర్థిక సార్వభౌమాధికారం, భవిష్యత్తు ప్రగతిపై ప్రముఖ విశ్లేషకులు ఆనంద్ రంగనాథన్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో ఆర్థిక, రాజకీయ చర్చకు తెరలేపాయి. భారతదేశం సమష్టి ప్రభుత్వ రుణం (కేంద్ర, రాష్ట్రాల అప్పులు) రూ.280 లక్షల కోట్లకు పైగా దాటిందని వ్యాఖ్యానించడం ఇప్పుడు ఆర్థిక వేత్తల్లోనూ, సాధారణ పౌరుల్లోనూ కలవరాన్ని కలిగిస్తోంది. ఓ ఇంటర్వ్యూలో రంగనాథన్‌ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

అసలు అప్పుల భారం ఎంత?

అధికారిక రికార్డులు పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వ సర్దుబాటు చేసిన నికర రుణం 2026 మార్చి నాటికి దాదాపు రూ.200.53 లక్షల కోట్లుగా ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ఇది రూ.218.63 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో అంతర్గత రుణాలు రూ.207.70 లక్షల కోట్లు కాగా, విదేశీ రుణాలు రూ.7.11 లక్షల కోట్లుగా ఉన్నాయి. కేంద్రంతో పాటు రాష్ట్రాల అప్పులను కలిపితే మొత్తం ప్రభుత్వ రుణం రూ.270-రూ.280 లక్షల కోట్లకు చేరుకుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎఫ్ఆర్బీఎమ్ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ రుణం జీడీపీలో 40 శాతంగానూ, ఉమ్మడి రుణం 60 శాతంగానూ ఉండాలి. కానీ ప్రస్తుతం ఈ పరిమితిని దాటి అప్పులు పెరిగిపోవడం ఆర్థిక క్రమశిక్షణపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ప్రభుత్వ నికర అప్పుల అంచనా (రూ.లక్షల కోట్లలో)

2025-26 మార్చి 31 నాటికి: రూ.200.53

2026-27 మార్చి 31 నాటికి: రూ.218.63

సవాళ్లు.. భిన్న దృక్పథాలు

ఈ రుణ భారంపై ప్రధానంగా రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి.

వడ్డీల భారం - అనుత్పాదక వ్యయం: ఆనంద్ రంగనాథన్ హెచ్చరించినట్లుగా 2026-27 బడ్జెట్‌లో వడ్డీ చెల్లింపులకే రూ.14 లక్షల కోట్లకు పైగా కేటాయించాల్సి వస్తోంది. ప్రభుత్వ పన్ను ఆదాయంలో ప్రతి రూపాయిలో దాదాపు 40 పైసలు కేవలం వడ్డీలకే పోతుండడం గమనార్హం. ఇది భవిష్యత్తులో విద్య, వైద్యం, సంక్షేమం వంటి రంగాలకు చేసే వ్యయాన్ని తీవ్రంగా తగ్గిస్తుంది.

మూలధన వ్యయం - వృద్ధి వ్యూహం: భాజపా ప్రతినిధి ప్రదీప్ భండారీ వంటి నాయకులు దీన్ని సమర్థిస్తున్నారు. మౌలిక వసతులు, రహదారులు, ప్రాజెక్టుల నిర్మాణానికి (మూలధన వ్యయం) చేసే అప్పులు దేశ భవిష్యత్తు ఆర్థిక వృద్ధికి ఆస్తులను సృష్టిస్తాయని, భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కావడం వల్ల ఈ రుణం ప్రమాదకరం కాదని వారి వాదన.

సామాన్యుడిపై ప్రభావం ఏమిటి?

వృద్ధి రేటు మెరుగ్గా ఉన్నంత కాలం డెట్-టు-జీడీపీ నిష్పత్తి అదుపులోనే ఉన్నట్లు అనిపించినా ఏ కారణంచేతనైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తే అసలు సమస్య మొదలవుతుంది. పెరుగుతున్న వడ్డీల భారం వల్ల పన్నుల భారాన్ని పెంచడమో లేదా ప్రజా ఉపయోగకర పథకాలకు నిధుల కోత విధించడమో జరుగుతుంది. ఆస్తుల సృష్టికి చేసే అప్పు స్వాగతించదగినదే అయినప్పటికీ ఉచితాలు, అనుత్పాదక వ్యయాల కోసం చేసే అప్పులు రాబోయే తరాల భవిష్యత్తును అంధకారం చేస్తాయి. ప్రజాధనం వడ్డీలకు జమ కాకుండా దేశ ప్రగతికి వినియోగపడేలా కఠిన ఆర్థిక నియంత్రణ అవసరమని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: బంగారం కొనాలా? ఆగాలా?.. ఈరోజు కొత్త రేట్లు ఇవే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement