ప్రపంచ విత్తన వాణిజ్యంలో భారత్‌ వాటా పెంపే లక్ష్యం | India Aims To Boost Global Seed Market Share To 10% by 2035, Focus On Innovation And Self-Reliance | Sakshi
Sakshi News home page

ప్రపంచ విత్తన వాణిజ్యంలో భారత్‌ వాటా పెంపే లక్ష్యం

Sep 25 2026 8:50 AM | Updated on Sep 25 2026 10:05 AM

India Sets Sights on a Bigger Share of the Global Seed Market

ప్రపంచ విత్తన వాణిజ్యంలో ప్రస్తుతం ఒక శాతంగానున్న భారత్‌ వాటాను 2035 నాటికి పది శాతానికి పెంచాలనేది తమ లక్ష్యమని భారత విత్తన పరిశ్రమల సమాఖ్య (ఫెడరేషన్‌ ఆఫ్‌ సీడ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా–ఎఫ్‌ఎస్‌ఐఐ) ప్రకటించింది. నూనెగింజలు, పప్పుధాన్యాల వంటి కీలక పంటలలో దేశీయ ఆవిష్కరణలను, స్వయం సమృద్ధిని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఎఫ్‌ఎస్‌ఐఐ పదో వార్షిక సర్వసభ్య సమావేశం ఢిల్లీలో గురువారం జరిగింది.

ఈ సందర్భంగా ఎఫ్‌ఎస్‌ఐఐ చైర్మన్, సావన్నా సీడ్స్‌ సీఈవో అజయ్‌ రాణా మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచ విపణిలో భారత్‌ విత్తన పరిశ్రమ విలువ 3.6 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.34.5 వేల కోట్లు) ఉందని, ఇది 2030 నాటికి 5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.48 వేల కోట్లు) స్థాయికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్లోబల్‌ సీడ్‌ మార్కెట్‌లో భారత్‌ ప్రధాన శక్తిగా ఎదిగేందుకు అవసరమైన శాస్త్ర విజ్ఞానం, ప్రతిభతో పాటు మానవ వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయని వివరించారు. నూతన విత్తన రకాలు, సాంకేతికతకు త్వరితగతిన అనుమతులు ఇచ్చేలా దేశమంతటా ఒకేవిధమైన నియంత్రణ వ్యవస్థ ఉండాలని కోరారు. నూతన విత్తన రకాలకు బలమైన మేధోసంపత్తి హక్కుల రక్షణ కల్పించాలని, ఇది కంపెనీలు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి నమ్మకాన్ని ఇస్తుందని అన్నారు.

నేషనల్‌ ఫార్మర్స్‌ ఎంపవర్‌మెంట్‌ ఇనిషియేటివ్‌ (ఎన్‌ఎఫ్‌ఈఐ) కన్వీనర్‌ కిషోర్‌ జైస్వాల్‌ మాట్లాడుతూ, ప్రపంచ దేశాల రైతులతో సమానంగా మన రైతులకు కూడా ఆధునిక విత్తన సాంకేతిక నైపుణ్యాలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సత్‌గురు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్స్, నెదర్లాండ్స్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా రూపొందించిన ‘ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఆఫ్‌ ఇండియాస్‌ వెజిటబుల్‌ సీడ్‌ సెక్టార్‌’ నివేదిక వివరాలను డాక్టర్‌ కె.విజయరాఘవన్‌ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎఫ్‌ఎస్‌ఐఐ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పరేష్‌ వర్మ, ఢిల్లీలోని నెదర్లాండ్స్‌ రాయబార కార్యాలయ అగ్రికల్చర్‌ కౌన్సెలర్‌ మేరియన్‌ వాన్‌ షేక్, డాక్టర్‌ మనీష్‌ దివాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: భారత్‌లో అత్యంత సంపన్న నటులు వీరే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement