సాగుబడి
బయోపాలిమర్ విత్తన పూత పద్ధతిని ఆవిష్కరించిన ఐఐఓఆర్ శాస్త్రవేత్తలు
రొయ్యల పొట్టు నుంచి తీసిన పదార్థాలతో సహజ రీతిలో విత్తన పూతతో 25% అదనపు దిగుబడి
విత్తన పూతకు అయ్యే ఖర్చు వందల్లో.. అదనపు నికరాదాయం వేలల్లో..
వరిలో ఎకరానికి రూ. 145 విత్తన పూత ఖర్చుతో రైతుకు రూ. 10 వేలకు పైగా అదనపు నికరాదాయం
వేరుశనగలో ఎకరానికి రూ. 1,275 విత్తన పూత ఖర్చుతో రైతుకు రూ. 13 వేలకు పైగా అదనపు నికరాదాయం
∙విత్తన పూతకు వాడే బయోపాలిమర్ ద్రావణాలను ఇప్పటికే రైతులకు అందుబాటులోకి తెచ్చిన ఐఐఓఆర్, ప్రైవేటు విత్తన సంస్థలు
పంటల సాగులో ఎదురయ్యే వివిధ రకాల సమస్యలను పరిష్కరించటానికి తెలివైన ఏకైక మార్గం, రసాయనాలతో కాకుండా, సహజ సిద్ధమైన పదార్థాల పూతతో కూడిన విత్తనాలను వినియోగించటమేనని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ నూనెగింజల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ – ఐఐఓఆర్) శాస్త్రవేత్తలు ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.
సాధారణ విత్తనాలు వేసుకొని పంటలు మొలకెత్తాక తలెత్తే సమస్యలను పరిష్కరించుకునే పిచికారీలు చెయ్యటం కన్నా.. విత్తనం వెయ్యటనికి ముందే తెలివిగా అనేక రకాల రక్షణ కల్పించే పదార్థాలతో విత్తనాలకు పూత పూసి విత్తుకోవటం ఎంతో తెలివైన పద్ధతి అని ఐఐఓఆర్ కీటక శాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.డి. ప్రసాద్, వ్యవసాయ రసాయనాల నిపుణురాలు డాక్టర్ కేఎస్‌వీపీ చంద్రిక ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. చెప్పటమే కాదు.. చాలా ఏళ్లు శ్రమించి రసాయనాలు లేని సహజ పద్ధతిలో రొయ్యల పొట్టు నుంచి తీసిన కైటోసాన్ అనే నాచురల్ బయోపాలిమర్ పదార్థంతో అద్భుతమైన విత్తన పూత పద్ధతిని ఆవిష్కరించి పేటెంట్ అందుకున్నారు. బయోపాలిమర్–ఆధారిత బహుళ పొరల స్మార్ట్ సీడ్ కోటింగ్ టెక్నాలజీగా దీన్ని చెబుతారు. ఐసీఏఆర్ రూపొందించిన అత్యంత ఆశాజనకమైన ఆవిష్కరణలలో ఒకటిగా ఇది గుర్తింపు పొందటం విశేషం.
ఈ సాంకేతికతను రూ. 25 లక్షలతో కొనుగోలు చేసిన మూడు కంపెనీలు నాచురల్ బయోపాలిమర్ ద్రావణాన్ని రైతులకు ఇప్పటికే అందుబాటులోకి తెచ్చాయని, రాజేంద్రనగర్‌లోని తమ కార్యాలయంలో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయని డా. ప్రసాద్, డా. చంద్రిక తెలిపారు. ఈ ద్రావణాలను రైతులు కొనుగోలు చేసి తమ దగ్గరున్న సాధారణ విత్తనాలకు పూత పూసి అప్పటికప్పుడే నిమిషాల్లో విత్తుకోవచ్చు లేదంటే ఈ పూతలు పూసిన విత్తనాలనే కొనుగోలు చేసి విత్తుకోవచ్చు. ఏ పంటల విత్తనాలకైనా ఈ ద్రావణంతో పూత పూసి విత్తుకోవచ్చని వారు వివరించారు.
25% అధిక దిగుబడి
రక్షక మందులతో పూత పూయని సాధారణ విత్తనాలు విత్తుకుంటే పంటకు తొలి దశలోనే నానా ఇబ్బందుల వస్తాయి. మొలక శాతం తగ్గుతుంది. చీడపీడలు తొలి దశలోనే చుట్టుముడతాయి. అయితే, విత్తనానికి అవసరమైన పూతలు పూసి విత్తుకుంటే ఈ సమస్యలు ఉండవు కాబట్టి కనీసం 25% వరకు అధిక దిగుబడి సాధ్యమేనని గత రెండేళ్లుగా అనేక పంటల్లో రుజువైందని డా. ప్రసాద్, డా. చంద్రిక వివరించారు.

శిలీంధ్రనాశకాలు, కీటకనాశకాలు, సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులు, ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను విడివిడిగా పంటలపై వాడటానికి బదులుగా.. వీటన్నిటినీ ప్రత్యేకంగా రూపొందించిన పద్ధతిలో విత్తనాలకు పూతలుగా లేపనం చేసి విత్తుకుంటే చాలు. విత్తన పూతలు పంటలను బెట్ట నుంచి, పోషక లోపాల నుంచి, చీడపీడల నుంచి విత్తిన రెండు నెలల వరకూ రక్షిస్తాయని తెలిపారు.
వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం రాంపూర్‌లో 24 మంది వేరుశనగ రైతులు గత మూడేళ్లుగా బయోపాలిమర్ పూత పూసిన విత్తనాలు వాడి ఎకరానికి 3 క్వింటాళ్ల దిగుబడి పెంచుకున్నారు. రసాయనిక ఎరువుల వాడకం 20% తగ్గింది. 2 నీటి తడులు తగ్గాయి. పురుగుమందుల అవసరం సగానికి సగం తగ్గింది. ఆకుమచ్చ తగ్గటంతో వేరుశనగ చొప్ప పశుగ్రాసంగా చక్కగా ఉపయోగపడుతోందని రైతులు చెప్పారు.
విత్తన పూతలతో ప్రయోజనాలు
∙పోషకాలను అధిక సామర్థ్యంతో వినియోగించుకోవటం ∙పురుగుమందుల వినియోగ సామర్థ్యం మెరుగుపడటం ∙రసాయనిక ఎరువులు, పురుగు/తెగుళ్ల మందులు నేల, నీటి ద్వారా వృథా కావటం తగ్గుతుంది ∙విత్తన పూతలోని మేలుచేసే సూక్ష్మజీవులు మొక్క వేర్ల దగ్గర మొలక దశ నుంచే పెరుగుతూ రక్షణ కల్పిస్తాయి ∙ఎరువుల అవసరం తగ్గుతుంది. పురుగు/తెగుళ్ల మందుల పిచికారీలు తగ్గుతాయి ∙దిగుబడితో పాటు రైతుకు నికరాదాయం పెరుగుతుంది ∙పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది.

సహజ విత్తన పూతతో పంటకు సమగ్రమైన రక్షణ!
అస్తవ్యస్తమైన వర్షపాతం, దీర్ఘకాలిక కరువులు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, తక్కువ సేంద్రియ కర్బనంతో క్షీణించిన నేలలు వంటి వాతావరణ మార్పుల పరిస్థితులలో ఈ సాంకేతికత ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. సహజమైన పదార్థాలతో తయారు చేసిన బయోపాలిమర్ విత్తన పూతలు విత్తనం చుట్టూ అనుకూలమైన సూక్ష్మ వాతావరణాన్ని సృష్టిస్తాయి. మొలకెత్తడం, వేర్లు ఏర్పడటం, తేమ నిలుపుదల, పంట తొలిదశలో బలంగా పెరగటం వంటివి మెరుగుపడతాయి. అదే సమయంలో, వేర్ల చుట్టూ సూక్ష్మజీవులు పెరిగి చీడపీడలు, పర్యావరణ ఒత్తిళ్ల నుంచి పంట మొక్కలకు మరింతగా సహజ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. కీటకనాశకాలు తొలిదశలో కీటకాల వల్ల కలిగే నష్టం నుంచి లేత నారుమొక్కలను కాపాడతాయి. ఈ అంశాలన్నీ కలిసి, పంట పెరుగుదల తొలి దశల నుంచే సమగ్రమైన రక్షణ దొరుకుతుంది. అంతిమంగా 25% వరకు అదనపు దిగుబడి, ఆ మేరకు అదనపు ఆదాయం రైతుకు లభిస్తాయి. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయి ప్రయోగాల్లో అనేక పంటల్లో సత్ఫలితాలు వస్తున్నాయి.
– డాక్టర్ ఆర్.డి. ప్రసాద్, (92473 36334) ప్రధాన శాస్త్రవేత్త, కీటక శాస్త్ర విభాగం, ఐసీఏఆర్–ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్ 040–24598100
– డాక్టర్ కేఎస్‌వీపీ చంద్రిక, శాస్త్రవేత్త (వ్యవసాయ రసాయనాలు)
- నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


