Sagubadi: విలక్షణ పంట లవంగం! | Talanadan Gramboo Clove Speciality Geographical Indication | Sakshi
Sakshi News home page

Sagubadi: విలక్షణ పంట లవంగం!

Aug 7 2026 4:33 AM | Updated on Aug 7 2026 4:33 AM

Talanadan Gramboo Clove Speciality Geographical Indication

సుగంధ ద్రవ్య పంటలకు నిలయమైన కేరళప్రాంతంలో పండే ‘తలనాడన్‌ గ్రాంబూ’ (లవంగం) తన ప్రత్యేకతతో భౌగోళిక గుర్తింపు (జీఐ) దక్కించుకుంది. కొట్టాయం జిల్లాలోని ఈరాట్టుపేట బ్లాక్‌ పంచాయతీ పరిధిలోని తలనాడ్, ఈరాట్టుపేట, ఈకోయ్, మేలుకావు, పూంజర్‌ వంటి పశ్చిమ కనుమల కొండప్రాంతాల్లో ఈ పంట విశేషంగా సాగవుతోంది. తలనాడన్‌ లవంగ రైతు సహకార సంఘం, కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి ఫలితంగా ఈ గుర్తింపు లభించింది. ఇది మనప్రాంతంలో పండే పంట కాకపోయినా, లవంగాలు మనమూ వాడుతూ ఉంటాం కాబట్టి ఈ పంటకు సంబంధించిన విశేషాలు సరదాగా తెలుసుకుందాం..

ప్రత్యేక గుణాలు.. నాణ్యత..
సాధారణ లవంగాలతో పోలిస్తే తలనాడన్‌ లవంగాలు పరిమాణంలో పెద్దవిగా, బరువుగా ఉంటాయి. గ్రాము బరువుకు కేవలం 8 నుంచి 10 మొగ్గలు మాత్రమే తూగుతాయి. ఇవి లేత ఆకుపచ్చ నుంచి గులాబీ రంగులోకి మారి, ఎండబెట్టిన తర్వాత ఆకర్షణీయమైన గోధుమ రంగు సంతరించుకుంటాయి. కొట్టాయంప్రాంతంలో ఉండే చల్లని వాతావరణం, దట్టమైన ΄÷గమంచు, అటవీ నేలల తేమ కారణంగా వీటిలో ‘యూజెనాల్‌’ అనే సుగంధ నూనె శాతం, పాలిఫెనాల్స్‌ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇవి మంచి సువాసన, ఘాటు, అధిక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.

చెట్టుకు 10–15 కిలోలు
లవంగం చెట్ల విత్తనాలతో మొక్కలు పెంచి నాటుతారు. నాటిన 4–5 సంవత్సరాల్లో కాపు ప్రారంభమై, 7–8 సంవత్సరాల నుంచి పూర్తిస్థాయి దిగుబడి ఇవ్వటం ప్రారంభిస్తాయి. ప్రతి ఏటా జూన్‌–జూలై నెలల్లో మొగ్గ తొడిగి, డిసెంబర్‌–జనవరి నాటికి కోతకు వస్తాయి. మొగ్గలు విచ్చుకోకముందే చేతితో సేకరించి వెంటనే ఎండబెడతారు. సరిగ్గా ఎండబెట్టకపోతే నాణ్యత తగ్గి ‘ఖోకర్‌‘ అనే నిరుపయోగ రకంగా మారే ప్రమాదం ఉంది. ఎదిగిన ఒక చెట్టు నుంచి ఏడాదికి 10–15 కిలోల వరకు దిగుబడి వస్తుంది.  

రైతులకు ఆర్థిక ప్రయోజనం
సాగు వ్యయంతో పోలిస్తే తలనాడన్‌ లవంగం రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తోంది. మార్కెట్‌లో ఎండు లవంగాల ధర నాణ్యతను బట్టి కిలో రూ. 500 నుంచి రూ. 2000 వరకు పలుకుతుంది. లవంగ కాడలు కూడా కిలో రూ. 100 నుంచి రూ. 250 వరకు అమ్ముడవుతున్నాయి. జీఐ ట్యాగ్‌ లభించటం వల్ల నకిలీల భయం లేకుండా రైతులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్‌ అవకాశాలు, మంచి మద్దతు ధర లభిస్తున్నాయి.  

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement