లంచ్ బ్రేక్‌లో వచ్చిన అదృష్టం.. రూ.19 కోట్లు గెలిచిన మహిళ! | US Woman Wins 2 Million Dollars Lottery During Office Lunch Break Know The Details | Sakshi
Sakshi News home page

లంచ్ బ్రేక్‌లో వచ్చిన అదృష్టం.. రూ.19 కోట్లు గెలిచిన మహిళ!

Sep 25 2026 3:58 PM | Updated on Sep 25 2026 4:34 PM

US Woman Wins 2 Million Dollars Lottery During Office Lunch Break Know The Details

అమెరికాలోని వర్జీనియాకు చెందిన మహిళకు.. ఒక రోజు ఊహించని అదృష్టం కలిసొచ్చింది. ఆమె ఏకంగా 2 మిలియన్ డాలర్ల లాటరీ గెలుచుకుంది. సాధారణంగా.. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు గెలిస్తే ఎవరైనా ఆనందంతో ఉద్యోగానికి వెళ్లడం మానేసి, కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకుంటారు. కానీ ఈ మహిళ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది.

ఆ రోజు ఆమెకు పని విషయంలో చాలా ఒత్తిడిగా అనిపించింది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో ఏదైనా తినడానికి బయటకు వెళ్లిన ఆమె, అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవాలని అనుకుంది. అలా.. లవ్ ఫుడ్ మార్ట్ అనే షాపుకు వెళ్లి 20 డాలర్స్ పెట్టి “ప్లాటినం 7ఎస్” అనే స్క్రాచ్-ఆఫ్ లాటరీ టికెట్ కొనుగోలు చేసింది.

టికెట్ కొనుగోలు చేసి.. అక్కడే దానిని స్క్రాచ్ చేసి చూడగా, తాను కొనుగోలు చేసిన టికెట్‌కు ఏకంగా 2 మిలియన్ డాలర్ల (రూ.19 కోట్ల కంటే ఎక్కువ) జాక్‌పాట్ తగిలింది. ఒక్కసారిగా జీవితమే మారిపోయేంత డబ్బు గెలిచినా, ఆమె అక్కడ పెద్దగా హంగామా చేయలేదు. ఎందుకంటే అప్పటికే ఆమె లంచ్ బ్రేక్ సమయం అయిపోతోంది!

ఆమె టికెట్‌ను జాగ్రత్తగా తన దగ్గర పెట్టుకుని, ఏమీ జరగనట్టుగా తిరిగి తన ఉద్యోగానికి వెళ్లింది. అక్కడ మిగిలిన పనిని కూడా పూర్తి చేసింది. తరువాత వర్జీనియా లాటరీ అధికారులతో మాట్లాడుతూ.., “నేను తిరిగి పనికి వెళ్లి ఏమీ జరగనట్టుగా నటించాల్సి వచ్చింది” అని చెప్పింది.

ఆమెకు బహుమతిని తీసుకునే సమయంలో రెండు అవకాశాలు ఇచ్చారు. 2 మిలియన్ డాలర్లను 30 సంవత్సరాల పాటు విడతలుగా తీసుకోవచ్చు లేదా ఒకేసారి నగదు రూపంలో తీసుకోవచ్చు. ఆమె ఒకేసారి నగదు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంత పెద్ద మొత్తంలో లాటరీ గెలుచుకున్నప్పటికీ.. ఆమె తన పేరును కూడా బయటకు వెల్లడించలేదు. వర్జీనియా చట్టం ప్రకారం, కొన్ని సందర్భాల్లో లాటరీ విజేతలు తమ పేరు, స్వస్థలం వంటి వివరాలను రహస్యంగా ఉంచుకోవచ్చు. ఆమె కూడా అదే విధానాన్ని ఎంచుకుంది.

ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. ఆమె డబ్బు గెలుచుకోవడం కాదు. అంత మొత్తం గెలుచుకున్నప్పటికీ.. పని పూర్తి చేయడానికి ఆఫీసుకు వెళ్లడం.  జీవితంలో ఒక్కసారిగా ఇంత పెద్ద అదృష్టం వచ్చినా, తన రోజువారీ బాధ్యతను పూర్తి చేసి ఇంటికి వెళ్లిన ఈ మహిళ కథ అందుకే సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. ఆ తర్వాత ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసిందా లేదా అన్న విషయం మాత్రం తెలియలేదు.

ఇదీ చదవండి: ఇలా ఎవరైనా లీవ్ అడుగుతారా?: హర్ష గోయెంకా ట్వీట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement