ఇలా ఎవరైనా లీవ్ అడుగుతారా?: హర్ష గోయెంకా ట్వీట్ | Funny Leave Letter and Boss Reaction Harsh Goenka Post | Sakshi
Sakshi News home page

ఇలా ఎవరైనా లీవ్ అడుగుతారా?: హర్ష గోయెంకా ట్వీట్

Sep 24 2026 7:11 PM | Updated on Sep 24 2026 7:38 PM

Funny Leave Letter and Boss Reaction Harsh Goenka Post

సాధారణంగా ఉద్యోగులు సెలవు కావాలంటే తమ బాస్‌కు ఒక లేఖ రాస్తారు. అందులో సెలవు తీసుకోవడానికి కారణం, ఎన్ని రోజులు సెలవు కావాలి, ఎప్పుడు తిరిగి విధులకు హాజరవుతారు వంటి వివరాలను తెలియజేస్తారు. అయితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు వాటికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. అయితే చాలా కామెడీగా ఉన్నాయి. వీటిని ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా షేర్ చేశారు.

ఉద్యోగి రోహన్ శర్మ తన సెలవును ఒక సరదా రీతిలో వివరించగా.. అతని బాస్ కూడా అదే స్థాయిలో ఫన్నీగా స్పందిస్తూ సెలవును ఆమోదించారు.

ఉద్యోగి లీవ్ లెటర్
మొదటి లేఖలో రోహన్ శర్మ తన బాస్‌కు మరుసటి రోజు ఆఫీసుకు రాలేనని తెలియజేశాడు. అయితే.. సాధారణంగా అనారోగ్యంగా ఉంది లేదా వ్యక్తిగత పని ఉంది అని చెప్పకుండా.. తన పరిస్థితిని హాస్యభరితమైన పదాలతో వివరించాడు.

మంచంపై పడుకుని విశ్రాంతి తీసుకున్న డ్రాయింగ్ ఉంది. అతని మెదడు ఇప్పటికే ఎయిర్‌ప్లేన్ మోడ్‌లోకి వెళ్లిపోయిందని, తన తల్లి కూడా విశ్రాంతి తీసుకోమని చెప్పిందని లేఖలో సరదాగా పేర్కొంటాడు. అంతేకాకుండా.. తన కాళ్లు ఉద్యోగానికి రాజీనామా చేశాయని, సోమవారం+గురుత్వాకర్షణ కలిసి తనను మంచం నుంచి లేవకుండా చేస్తున్నాయని చెప్పడం లేఖలో చూడవచ్చు.

లేఖలో చాయ్‌నే నా థెరపీ అని ఉండటం కూడా కనిపిస్తుంది. సాధారణంగా చాలామంది ఉద్యోగులకు సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్లడం కష్టంగా అనిపిస్తుంది. ఆ భావనను రోహన్ శర్మ చాలా సరదాగా చిత్రాల రూపంలో చూపించాడు. మంచంపై పడుకుని నిద్రపోతున్న వ్యక్తి, పక్కన చాయ్ కప్పు, ఎగురుతున్న విమానం, రాజీనామా చేసిన కాళ్లు వంటి చిత్రాలు అతని పరిస్థితిని మరింత హాస్యాస్పదంగా మార్చాయి.

చివరగా.. ఎల్లుండి మళ్లీ ప్రయత్నిస్తాను.. అయితే నా శరీరం సెలవు పొడిగింపు కోసం దరఖాస్తు చేస్తే మాత్రం ఏమీ చేయలేను అనే భావనతో లేఖను ముగించాడు. దీని ద్వారా ఉద్యోగులు సెలవు తీసుకోవడానికి చెప్పే సాధారణ కారణాలను ఒక వినోదాత్మక శైలిలో చూపించాడు.

బాస్ ఇచ్చిన సమాధానం
రెండో చిత్రంలో బాస్ రోహన్ శర్మ సెలవు లేఖకు ఇచ్చిన ఆమోదం కనిపిస్తుంది. బాస్ తనను తాను “హ్యాపినెస్ డిపార్ట్‌మెంట్” తరఫున మాట్లాడుతున్న వ్యక్తిగా పరిచయం చేసుకుంటారు. రోహన్ శర్మ రేపటి సెలవు అభ్యర్థనను ఆమోదిస్తున్నట్లు చెబుతూ.. అతని సెలవుకు కొన్ని సరదా కారణాలను అధికారికంగా ప్రకటిస్తారు.

బాస్ ప్రకారం.. ఎయిర్‌ప్లేన్ మోడ్ ఇప్పుడు అధికారిక వైద్య పరిస్థితిగా మారింది. సోమవారం రోజున ఉండే గురుత్వాకర్షణను కార్యాలయ ప్రమాదంగా ప్రకటించామని, చాయ్ థెరపీ సంస్థ విధానంలో భాగమని చెబుతారు. అంతేకాకుండా.. రోహన్ కాళ్ల రాజీనామాను కూడా అంగీకరించామని, విశ్రాంతి తర్వాత తిరిగి ఉద్యోగంలో చేరాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రూ.కోటి కడుతున్నా, ప్రయోజనం లేదు.. భారత పాస్‌పోర్ట్‌పై వ్యాపారవేత్త ఫైర్!

ఇక్కడ బాస్ ఉపయోగించిన భాష పూర్తిగా హాస్యభరితంగా ఉంటుంది. సాధారణంగా బాస్‌లు సెలవు లేఖలకు ఆమోదించినట్లు లేదా తిరస్కరించినట్లు సమాధానం ఇస్తారు. కానీ ఈ బాస్ మాత్రం ఉద్యోగి చెప్పిన ప్రతి సరదా కారణాన్ని మరింత అతిశయోక్తిగా మార్చి, దానిని ఒక ఫన్నీ ఆఫీస్ ఆర్డర్‌లా రూపొందించారు. బాస్ చివర్లో రోహన్‌ను సెలవు తర్వాత ఆఫీసుకు తిరిగి వచ్చేటప్పుడు అదనంగా నవ్వులు, ఒక కొత్త జోక్ తీసుకురావాలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement