కొత్త ఐఫోన్ ఫీవర్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఇటీవలె విడుదలైన యాపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ మోడళ్లు.. భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చేశాయి. శుక్రవారం నుంచి అమ్మకాలు ప్రారంభం కావడంతో, ముందుగా దక్కించుకునేందుకు యాపిల్ స్టోర్స్ తెరవడానికి ముందు నుంచే ఫ్యాన్స్ బారులు తీరారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు స్టోర్ల వద్దకు ఐఫోన్ ప్రియులు పోటెత్తారు.
ఈ సందర్భంగా యాపిల్ స్టోర్ల వద్ద అనేక సిత్రాలు కనిపించాయి. పలువురు ఫ్యాన్స్ తమ పాత ఐఫోన్లను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చారు. తన భార్య కోసం ఐఫోన్ 18 ప్రో కొనేందుకు వచ్చిన ఓ వ్యక్తిని మీడియా పలకరించగా విస్తుపోయే విషయం చెప్పాడు. తన భార్యకు కొత్త ఐఫోన్ కొనేందుకు బంగారం అమ్మేసినట్లు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియాను వ్యాపారవేత్త హర్ష్ గోయెంక తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. కొంత మంది ఇల్లు కొనడానికి బంగారం అమ్మేస్తారు.. మరికొంత మంది పిల్లల భవిష్యత్తు కోసం పసిడిని విక్రయిస్తుంటారు. కానీ ఇతడని చూడండి భార్యకు ఐఫోన్ కొనేందుకు బంగారం అమ్మేశాడు.. అంటూ రాసుకొచ్చారు.
అమెరికాలో సెప్టెంబర్ 9న ఆవిష్కరించిన ఐఫోన్ 18 ప్రో ధర భారత్‌లో రూ. 1,64,900 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,79,900. బ్లాక్, సిల్వర్ తదితర నాలుగు రంగుల్లో ఇవి లభిస్తాయి. యాపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ’డ్యుయో’ని కూడా ప్రవేశపెట్టింది. భారత్‌లో దీని ధర రూ. 2,99,900 నుంచి రూ. 4,49,900 వరకు ఉంది.
Some people sell gold to buy a house. Some sell it for their children’s future. This Delhi man sold family gold passed down from his grandmother and great-grandmother to buy his wife an iPhone 18 Pro Max.🙈 pic.twitter.com/MVSUEtmfSB
— Harsh Goenka (@hvgoenka) September 18, 2026


