Gold sale
-
‘దేశం కోసం బంగారం అమ్మేయండి’
భారతదేశం తన అవసరానికి మించి బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికి పరిష్కారం ప్రభుత్వ విధానాల్లో కంటే, ప్రజల లాకర్లలోనే ఉందని ఆనంద్ రాథి వెల్త్ జాయింట్ సీఈఓ ఫిరోజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. భారతీయ కుటుంబాలు తమ వద్ద ఉన్న బంగారంలో కేవలం 2 నుండి 4 శాతం వరకు విక్రయించాలని ఆయన కోరారు. ఇది త్యాగం కాదు, దేశం కోసం చేసే ఒక రకమైన "ఆర్థిక దేశభక్తి" అని ఆయన అభివర్ణించారు.భారత్‌లో సమస్యగా బంగారం భారతీయ కుటుంబాల వద్ద సమిష్టిగా దాదాపు 4 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.4 కోట్ల కోట్లు) విలువైన బంగారం ఉంది. ఇందులో చాలా వరకు వాడకుండా లాకర్లలో ఖాళీగా పడి ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం వరకు 35 బిలియన్ డార్లుగా ఉన్న భారతదేశ వార్షిక బంగారం దిగుమతులు, ఇప్పుడు ఏకంగా 75 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది కరెంట్ ఖాతా లోటు (CAD) పెరగడానికి, రూపాయి విలువ క్షీణించడానికి ప్రధాన కారణమవుతోంది.పోయిన విదేశీ పెట్టుబడుల కంటే ఎక్కువఇటీవల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) భారత మార్కెట్ నుండి రూ.1,68,000 కోట్లు (17–18 బిలియన్ డాలర్లు) ఉపసంహరించుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. కానీ, మన దేశ బంగారం దిగుమతి బిల్లు దీని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉండటం గమనార్హం.100 గ్రాముల విక్రయంతో వచ్చే మార్పుఈ ప్రతిపాదన ఎంత ఆచరణాత్మకమైనదో చెప్పడానికి అజీజ్ కొన్ని లెక్కలను వివరించారు. ఒక కుటుంబం తమ వద్ద ఉన్న బంగారంలో కేవలం 100 గ్రాములను (ప్రస్తుత ధరల ప్రకారం సుమారు రూ.15-16 లక్షలు) విక్రయిస్తే ఎలాంటి మార్పు వస్తుందో చూడండి.. ఆనంద్ రాథి సంస్థ పరిధిలోని 13,800 కుటుంబాలు ఇలా చేస్తేనే దాదాపు రూ.2,500–3,000 కోట్ల బంగారం తిరిగి మార్కెట్లోకి వస్తుంది.ఇదే విధంగా దేశంలోని సంపన్న కుటుంబాలన్నీ చేస్తే, బంగారం దిగుమతులను సులభంగా 40 బిలియన్ డాలర్ల వరకు తగ్గించవచ్చు. ప్రజలు విక్రయించే బంగారం ఆభరణాలు, పారిశ్రామిక అవసరాల కోసం మార్కెట్లో పునర్వినియోగంలోకి వస్తుంది. తద్వారా కొత్తగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.ఇది త్యాగం కాదు... లాభాల స్వీకరణ !బంగారం ధరలు ప్రస్తుతం చారిత్రక గరిష్టాల వద్ద ఉన్నాయి. ఈ సమయంలో కొంత బంగారాన్ని విక్రయించడం అనేది దేశానికి మేలు చేయడంతో పాటు, వ్యక్తిగతంగా స్మార్ట్ పోర్ట్ ఫోలియో నిర్వహణ (లాభాలను ఖాతాలో వేసుకోవడం) అవుతుందని అజీజ్ పేర్కొన్నారు."ఈక్విటీ మార్కెట్లలో లాభాలు స్వీకరించినట్లే, బంగారంలోనూ భారీ ర్యాలీ వచ్చింది. కాబట్టి మీ బంగారంపై 3-4% లాభాలను దేశం కోసం బుక్ చేసుకోండి" అని ఆయన పిలుపునిచ్చారు.గడిచిన 10 ఏళ్ల కాలంలో బంగారం రూపాయి పరంగా కేవలం 8.5% వార్షిక రాబడిని మాత్రమే ఇచ్చింది. దీని కంటే 'సుకన్య సమృద్ధి యోజన' (8.25% వడ్డీ, పన్ను రహితం) వంటి ఇతర పొదుపు పథకాలు పన్నులన్నీ పోనూ మెరుగైన లేదా సమానమైన లాభాలను అందిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.ప్రభుత్వానికీ విజ్ఞప్తిఈ ప్రచారంలో భాగంగా బంగారం విక్రయించిన రశీదులను సమర్పించాలని అజీజ్ ప్రజలను కోరుతున్నారు. దీని ద్వారా తగినంత మద్దతును కూడగట్టి, బంగారం విక్రయాలపై మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) నుండి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పిటిషన్ వేయాలని ఆయన భావిస్తున్నారు. -
పసిడికి ‘పెళ్లి సందడి’! తగ్గనున్న ధర ?
ముంబై: కరోనా వైరస్ ధాటి నుంచి ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికన్నా వేగంగానే కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత దీపావళి సీజన్‌పై ఆభరణాల విక్రేతలు ఆశావహంగా ఉన్నారు. కోవిడ్ పూర్వ స్థాయి కన్నా 30 శాతం అధికంగా అమ్మకాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు దిగి రావడం, వాయిదా వేస్తున్న వారు కొనుగోళ్లకు ముందుకు వచ్చి డిమాండ్ మెరుగుపడుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని వారు అంటున్నారు. ఈసారి బాగున్నాయి ‘సాధారణంగా ఏటా మూడో త్రైమా సికంలో అంతగా విక్రయాలు ఉండవు. కానీ ఈసా రి మాత్రం అమ్మకాలు కొంత పుంజుకున్నాయి. బంగారం ధర తగ్గడం కూడా కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మెరుగుపడటానికి కొంత కారణం‘ అని అఖిల భారత రత్నాభరణాల దేశీ మండలి చైర్మన్ ఆశీశ్ పేఠే తెలిపారు. గడిచిన కొద్ది నెలలుగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల ధోరణి చూస్తుంటే ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలోనే ఉన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. మహమ్మారి కారణంగా వాయిదా పడిన వివాహాలు ఈ ఏడాది ఆఖర్లో జరగనుండటం రత్నాభరణాల విక్రయాలకు దోహదపడగలవని పేర్కొన్నారు. ఈ పరిణామాల దరిమిలా 2019తో పోలిస్తే 20–25 శాతం దాకా అమ్మకాల వృద్ధి ఉండొచ్చని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఒకానొక దశలో రూ. 56,000 రికార్డు స్థాయిని తాకిన పసిడి ధర (పది గ్రాములు).. ప్రస్తుతం రూ. 49,200 స్థాయిలో తిరుగాడుతోంది. మరో 3–4 నెలలు జోరుగా పెళ్లిళ్లు... నవరాత్రుల దగ్గర్నుంచీ మార్కెట్లో డిమాండ్ గణనీయంగా కనిపిస్తోందని పీఎన్జీ జ్యుయలర్స్ సీఎండీ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు. గతేడాది దీపావళితో పోలిస్తే వ్యాపారం రెట్టింపు కాగలదని, 2019తో పోలిస్తే 25–30 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘కోవిడ్–19 భయాల నుంచి ప్రజలు కొంత బైటికి వచ్చినట్లు కనిపిస్తంది. సానుకూల భవిష్యత్ మీద వారు ఆశావహంగా ఉన్నారు. ఆభరణాల్లాంటివి కొనుగోలు చేయడం ద్వారా వారు సంతోషిస్తున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ కూడా మరో 3–4 నెలల పాటు కొనసాగవచ్చు. ఇది పరిశ్రమకు గట్టి ఊతమిస్తుంది. ఒకవేళ థర్డ్ వేవ్ అంశాలేమీ లేకపోతే పరిశ్రమపై సానుకూల ప్రభావం చూపగలదు‘ అని తెలిపారు. ‘పేరుకుపోయిన డిమాండ్ వల్ల ఈసారి ధన్‌తెరాస్ నాడు ఆభరణాల అమ్మకాలు, గతేడాది దీపావళి సందర్భంతో పోలిస్తే 30–40 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నాం‘ అని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్ అహమ్మద్ ఎంపీ తెలిపారు. ‘దసరా నుంచి అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. నెమ్మదిగా మహమ్మారి మబ్బులు విడిపోతున్నాయి. వినియోగదారుల్లో విశ్వాసం పెరుగుతోంది. పేరుకుపోయిన డిమాండ్‌తో దీపావళి, రాబోయే పెళ్లిళ్ల సీజన్లో విక్రయాలు పుంజుకుంటాయని భావిస్తున్నాం. వార్షికంగా చూస్తే కనీసం 35–40 శాతం వృద్ధి అంచనా వేస్తున్నాం‘ అని డబ్ల్యూహెచ్పీ జ్యుయలర్స్ డైరెక్టర్ ఆదిత్య పేఠే చెప్పారు. వినియోగదారుల్లో సానుకూల సెంటిమెంటు వచ్చే ఏడాది ప్రథమార్ధం దాకా కొనసాగగలదని ఆశిస్తున్నట్లు పూజా డైమండ్స్ డైరెక్టర్ శ్రేయ్ మెహతా పేర్కొన్నారు. రిటైల్ డిమాండ్ మెరుగుపడుతోంది టీకా ప్రక్రియ పుంజుకోవడం, కోవిడ్ కేసులు నమోదయ్యే వేగం మందగించడం వంటి అంశాలతో ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా మెరుగుపడుతున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ప్రాంతీయ సీఈవో సోమసుందరం పీఆర్ తెలిపారు. జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో బంగారు ఆభరణాల డిమాండ్ 58 శాతం ఎగియగా, కడ్డీలు.. నాణేలకు పెట్టుబడులపరమైన డిమాండ్ 18% పెరిగిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా కట్టడిపరమైన ఆంక్షలను క్రమంగా సడలించే కొద్దీ రిటైల్ డిమాండ్ తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి చేరుతోందని సోమసుందర్ చెప్పారు. ఈసారి పండుగ, పెళ్లిళ్ల సీజన్లో అత్యధికంగా పసిడి కొనుగోళ్లు జరగవచ్చని ఆయన పేర్కొన్నారు. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట.. -
పెరిగిన బంగారం అమ్మకాలు!
హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో బంగారు ఆభరణాల అమ్మకాలు భారీగా పెరిగాయి. జ్యూయలరీ షాపులు కళకళలాడుతున్నాయి. పండుగను దృష్టిలో పెట్టుకొని జ్యూయలరీ షాపుల వారు మహిళల కోసం రకరకాల డిజైన్లలో ఆభరణాలను అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్‌లో మహిళలు జోరుగా బంగారం కొనుగోళ్లు చేస్తున్నారు. బంగారంపై పెట్టుబడి పెట్టడం మంచిదన్న భావన చాలామందిలో నెలకొంది. నిన్న ధన త్రయోదశి పర్వ దినం సందర్భంగా కూడా భారీగా కొనుగోళ్లు జరిగాయి. దాదాపు మూడేళ్లుగా బంగారం ధర నిలకడగా ఉండటం వల్ల కూడా కొనుగోలుదారులు కొనుగోలుకు ముందుకు వచ్చారు. దీపావళి తర్వాత పసిడి ధర పెరిగే అవకాశం ఉంది. పండుగ తర్వాత పసిడి దిగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. పసిడి దిగుమతులు విపరీతంగా పెరిగిన కారణంగా దిగుమతి సుంకాన్ని 10 శాతానికి పెంచారు. ఇంకా ఇతరత్రా పలు ఆంక్షలు విధించారు. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినప్పటికీ మన దేశంలో మాత్రం తగ్గలేదు. ఇప్పుడు మరోసారి ఆంక్షలు విధిస్తే బంగారం ధర ఓ మాదిరిగా పెరిగే అవకాశం ఉంది. ఈ అంశాన్ని దృష్టిలోపెట్టుకొని కూడా కొంతమంది బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. **


