భారతదేశం తన అవసరానికి మించి బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనికి పరిష్కారం ప్రభుత్వ విధానాల్లో కంటే, ప్రజల లాకర్లలోనే ఉందని ఆనంద్ రాథి వెల్త్ జాయింట్ సీఈఓ ఫిరోజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. భారతీయ కుటుంబాలు తమ వద్ద ఉన్న బంగారంలో కేవలం 2 నుండి 4 శాతం వరకు విక్రయించాలని ఆయన కోరారు. ఇది త్యాగం కాదు, దేశం కోసం చేసే ఒక రకమైన "ఆర్థిక దేశభక్తి" అని ఆయన అభివర్ణించారు.
భారత్‌లో సమస్యగా బంగారం
భారతీయ కుటుంబాల వద్ద సమిష్టిగా దాదాపు 4 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.4 కోట్ల కోట్లు) విలువైన బంగారం ఉంది. ఇందులో చాలా వరకు వాడకుండా లాకర్లలో ఖాళీగా పడి ఉంది. ఇక కొన్నేళ్ల క్రితం వరకు 35 బిలియన్ డార్లుగా ఉన్న భారతదేశ వార్షిక బంగారం దిగుమతులు, ఇప్పుడు ఏకంగా 75 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది కరెంట్ ఖాతా లోటు (CAD) పెరగడానికి, రూపాయి విలువ క్షీణించడానికి ప్రధాన కారణమవుతోంది.
పోయిన విదేశీ పెట్టుబడుల కంటే ఎక్కువ
ఇటీవల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) భారత మార్కెట్ నుండి రూ.1,68,000 కోట్లు (17–18 బిలియన్ డాలర్లు) ఉపసంహరించుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. కానీ, మన దేశ బంగారం దిగుమతి బిల్లు దీని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉండటం గమనార్హం.
100 గ్రాముల విక్రయంతో వచ్చే మార్పు
ఈ ప్రతిపాదన ఎంత ఆచరణాత్మకమైనదో చెప్పడానికి అజీజ్ కొన్ని లెక్కలను వివరించారు. ఒక కుటుంబం తమ వద్ద ఉన్న బంగారంలో కేవలం 100 గ్రాములను (ప్రస్తుత ధరల ప్రకారం సుమారు రూ.15-16 లక్షలు) విక్రయిస్తే ఎలాంటి మార్పు వస్తుందో చూడండి.. ఆనంద్ రాథి సంస్థ పరిధిలోని 13,800 కుటుంబాలు ఇలా చేస్తేనే దాదాపు రూ.2,500–3,000 కోట్ల బంగారం తిరిగి మార్కెట్లోకి వస్తుంది.
ఇదే విధంగా దేశంలోని సంపన్న కుటుంబాలన్నీ చేస్తే, బంగారం దిగుమతులను సులభంగా 40 బిలియన్ డాలర్ల వరకు తగ్గించవచ్చు. ప్రజలు విక్రయించే బంగారం ఆభరణాలు, పారిశ్రామిక అవసరాల కోసం మార్కెట్లో పునర్వినియోగంలోకి వస్తుంది. తద్వారా కొత్తగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది.
ఇది త్యాగం కాదు... లాభాల స్వీకరణ !
బంగారం ధరలు ప్రస్తుతం చారిత్రక గరిష్టాల వద్ద ఉన్నాయి. ఈ సమయంలో కొంత బంగారాన్ని విక్రయించడం అనేది దేశానికి మేలు చేయడంతో పాటు, వ్యక్తిగతంగా స్మార్ట్ పోర్ట్ ఫోలియో నిర్వహణ (లాభాలను ఖాతాలో వేసుకోవడం) అవుతుందని అజీజ్ పేర్కొన్నారు.
"ఈక్విటీ మార్కెట్లలో లాభాలు స్వీకరించినట్లే, బంగారంలోనూ భారీ ర్యాలీ వచ్చింది. కాబట్టి మీ బంగారంపై 3-4% లాభాలను దేశం కోసం బుక్ చేసుకోండి" అని ఆయన పిలుపునిచ్చారు.
గడిచిన 10 ఏళ్ల కాలంలో బంగారం రూపాయి పరంగా కేవలం 8.5% వార్షిక రాబడిని మాత్రమే ఇచ్చింది. దీని కంటే 'సుకన్య సమృద్ధి యోజన' (8.25% వడ్డీ, పన్ను రహితం) వంటి ఇతర పొదుపు పథకాలు పన్నులన్నీ పోనూ మెరుగైన లేదా సమానమైన లాభాలను అందిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.
ప్రభుత్వానికీ విజ్ఞప్తి
ఈ ప్రచారంలో భాగంగా బంగారం విక్రయించిన రశీదులను సమర్పించాలని అజీజ్ ప్రజలను కోరుతున్నారు. దీని ద్వారా తగినంత మద్దతును కూడగట్టి, బంగారం విక్రయాలపై మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) నుండి తాత్కాలిక మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి పిటిషన్ వేయాలని ఆయన భావిస్తున్నారు.


