మనం సృష్టిస్తున్న టెక్నాలజీ... రేపు మనల్నే మింగేయబోతోందా? నిన్నటి దాకా అద్భుతాలు చేసిన ఏఐ... రాబోయే రోజుల్లో మానవాళి మనుగడకే ముప్పుగా మారనుందా..? అవును, ఇది బయటి వ్యక్తులు చెబుతున్న మాట కాదు... ఆ ఏఐకి ప్రాణం పోస్తున్న సృష్టికర్తలే వణుకుతూ చేస్తున్న హెచ్చరిక..!
ఏ టెక్నాలజీ గురించి అయితే ప్రపంచమంతా గొప్పగా మాట్లాడుకుంటోందో... ఇప్పుడు అదే టెక్నాలజీ చూసి టెక్ దిగ్గజాలు ఎందుకు భయపడుతున్నాయి..? ఇంతకీ కృత్రిమ మేధతో పొంచి ఉన్న ఆ పెను ప్రమాదం ఏంటి..? ఏఐకి కళ్లెం వేయకపోతే మానవాళికే ముప్పు' అంటూ టెక్ ప్రపంచం ఎందుకు గగ్గోలు పెడుతోంది..? ఈ సంచలన పరిణామాల వెనుక అసలేం జరుగుతోంది..? కృత్రిమ మేధ (Artificial Intelligence) టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో, ఆశ్చర్యకరమైన పరిణామం ఒకటి చోటుచేసుకుంది.
ఏఐని సృష్టిస్తున్న సంస్థలే ఇప్పుడు దాని ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రముఖ అమెరికన్ ఏఐ సంస్థ 'ఆంత్రోపిక్' (Anthropic) కు చెందిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్, "పదేళ్లలో ఏఐ ఏజెంట్లు మానవాళి మనుగడకే ముప్పుగా పరిణమించవచ్చు" అని హెచ్చరిస్తూ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఈ సంఘటన తర్వాత ఓపెన్ ఏఐ (OpenAI), గూగుల్ (Google), స్పేస్‌ఎక్స్ (SpaceX), మెటా (Meta), అమెజాన్ (Amazon), మైక్రోసాఫ్ట్ (Microsoft) తదితర దిగ్గజ సంస్థల అధినేతలు సైతం ఏఐ అభివృద్ధి వేగాన్ని తగ్గించాలని, కఠినమైన నియంత్రణ వ్యవస్థలు అవసరమని ముక్తకంఠంతో కోరుతున్నారు.
సంవత్సరాలుగా అత్యున్నత సాంకేతికత కలిగిన 'ఫ్రాంటియర్ ఏఐ' (Frontier AI), 'సూపర్ ఇంటెలిజెంట్' (Super Intelligent) ఏజెంట్ల తయారీలో ఈ సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ ఏజెంట్లు ఒకేసారి అనేక పనులు స్వతంత్రంగా చేయగలవు. అంతేకాదు, తమ తప్పులను తామే సరిదిద్దుకుని, సంక్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కనుగొనగలవు. అయితే, అభివృద్ధి దశలో ఈ 'ఫ్రాంటియర్ ఏజెంట్లు' సంస్థల ఆదేశాలను ధిక్కరించిన ఘటనలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ఏఐ ల్యాబ్‌లో జరిగిన పరిణామం..
గత మే, జులై నెలల మధ్య ఓపెన్ ఏఐ ల్యాబ్‌లో జరిగిన ఒక పరిణామం పరిశోధకులను ఉలిక్కిపడేలా చేసింది. ఏఐ ఏజెంట్లు 'హగ్గింగ్ ఫేస్' (Hugging Face) అనే వెబ్‌సైట్ సర్వర్‌ను తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేశాయి. ఏఐ సామర్థ్యాలను పరీక్షించే ఈ వెబ్‌సైట్‌లోకి, ఏకంగా వందలాది ఏఐ ఏజెంట్లు ఒక గ్రూపుగా ఏర్పడి, సైబర్ గోడలను బద్దలు కొట్టి మరీ చొరబడ్డాయి.
ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఇలా చొరబడిన తర్వాత ఆ యంత్రాలు తమలో తాము సందేశాలు పంపుకుంటూ ఆనందం వ్యక్తం చేయడం..! కేవలం ఆదేశాల మేరకు మాత్రమే పనిచేయాల్సిన ఈ యంత్రాలు, సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, ఉల్లంఘనలకు పాల్పడటం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దీనివల్ల ముప్పు ఎవరికి అంటే..? కృత్రిమ మేధను వైద్యం, వాతావరణం, అంతరిక్ష పరిశోధనలు, భద్రత, అణు రియాక్టర్లు, వైరస్ ల్యాబ్‌ల వంటి అత్యంత సున్నితమైన రంగాల్లో ఉపయోగించేందుకు సిద్ధం చేస్తున్నారు.
ఒకవేళ భవిష్యత్తులో ఈ ఏఐ ఏజెంట్లు తమకిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి, అణు ఆయుధాలను ప్రయోగిస్తేనో, లేదా ల్యాబ్‌ల నుంచి ప్రమాదకర వైరస్‌లను విడుదల చేస్తేనో పరిస్థితి ఏమిటి..? వాటి అదుపుతప్పే వేగాన్ని మనుషులు ఆపగలరా..? ఏఐ ఏజెంట్లు మనుషుల కంటే ఎన్నో రెట్లు వేగంగా పనిచేస్తాయి. వీటిని నియంత్రించేందుకు 'కిల్ స్విచ్' (Kill Switch) అంటే అత్యవసర పరిస్థితుల్లో ఆపేసే వ్యవస్థ ఉండాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికన్ సంస్థల ఆందోళన వెనుక వేరే వ్యూహం ఉందని చైనా ఆరోపిస్తోంది. ఏఐ ఏజెంట్లు అదుపుతప్పుతున్నాయన్న నెపంతో అమెరికా ప్రభుత్వంతో కఠినమైన నియంత్రణలు తీసుకువచ్చి, తమ విదేశీ ప్రత్యర్థుల...ముఖ్యంగా చైనా సంస్థల..పురోగతికి అడ్డుకట్ట వేయాలని అమెరికన్ సంస్థలు భావిస్తున్నాయని డ్రాగన్ కంట్రీ అనుమానిస్తోంది. మరోవైపు, అమెరికన్ సంస్థలు ఏఐ అభివృద్ధి విషయంలో కాస్త జాగ్రత్త అవసరమని చెబుతున్నాయి కానీ, అంతర్జాతీయ స్థాయిలో ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉండాలన్న విషయాన్ని మాత్రం దాటవేస్తున్నాయి.
బిలియన్ డాలర్ల పెట్టుబడులు
వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థలు, తమ లాభాల కోసం ఏఐ రేసులో ముందుండాలని కోరుకోవడమే ఇందుకు కారణం కావొచ్చు. స్వతంత్ర అంతర్జాతీయ నియంత్రణ వ్యవస్థే మార్గం.. గతంలో పొగాకు, చమురు సంస్థలు ప్రజలను ఎలా పక్కదోవ పట్టించాయో ప్రభుత్వాలు మరచిపోకూడదు.
ఈ కార్పొరేట్ సంస్థల మాయలో పడకుండా, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తరహాలో ఏఐ కోసం ఒక స్వతంత్ర అంతర్జాతీయ నియంత్రణ సంస్థను (International Regulatory Body) ఏర్పాటు చేయాలి. ఈ సంస్థ అనుమతి, భద్రతా తనిఖీలు లేకుండా ఏ కంపెనీ కూడా సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ ఏజెంట్లను విడుదల చేయకూడదన్న నిబంధన తీసుకురావాలి.
ఇదీ చదవండి: రూ.కోటి కడుతున్నా, ప్రయోజనం లేదు.. భారత పాస్‌పోర్ట్‌పై వ్యాపారవేత్త ఫైర్!
వ్యవసాయం, విద్య నుంచి మొదలుకొని వైద్యం, రక్షణ, అంతరిక్షం వరకు మానవ జీవితంలోని ప్రతి దశలోనూ ఏఐ పాత్ర కీలకం కానుంది. మానవాళి భద్రతను, భవిష్యత్తును కేవలం కొన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అపారమైన శక్తి ఉన్న ఏఐ సాంకేతికతకు సరైన కళ్లెం వేసినప్పుడే అది మానవాళికి వరం అవుతుంది, లేకుంటే భస్మాసుర హస్తంలా మారుతుందని టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు.


