Representative image
లక్నో: బిహార్‌లోని బక్సర్ రైలు మార్గంలో నితిన్ కుమార్ (21) హత్య కేసులో రోహిత్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని వారణాసిలో అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నితిన్‌ను రైలులో బంధించి, అతడి కుటుంబం నుంచి రూ.10,000 డిమాండ్ చేసిన అనంతరం చేతులు, కాళ్లు కట్టి కదులుతున్న రైలు నుంచి బయటకు తోసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో నితిన్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
వైశాలీకి చెందిన నితిన్ కుమార్ హైదరాబాద్‌లో కూలీగా పనిచేసేవాడు. బెంగళూరు నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో సెప్టెంబర్ 19న 07091 దానాపూర్ ప్రత్యేక రైలులో ప్రయాణించాడు. ఈ సమయంలో రోహిత్ అతడిని లక్ష్యంగా చేసుకుని బంధించినట్లు పోలీసులు చెబుతున్నారు. అనంతరం కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు ఇప్పించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు.
నితిన్ కుటుంబ సభ్యుడు ముకేశ్ రాయ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బక్సర్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 21న కేసు నమోదైంది. డబ్బు కోసం గుర్తుతెలియని వ్యక్తులు నితిన్‌ను అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కోసం రైల్వే డీఎస్పీ కంచన్ కుమారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో రోహిత్ గురించి సమాచారం లభించడంతో వారణాసిలో అతడిని అరెస్టు చేశారు.
అరెస్టు అనంతరం విచారణలో నితిన్‌ను చేతులు, కాళ్లు కట్టి కదులుతున్న రైలు నుంచి బయటకు తోసినట్లు రోహిత్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతడికి గతంలోనూ ఇలాంటి నేర చరిత్ర ఉన్నట్లు వెల్లడించారు. 2024లో బక్సర్‌కు చెందిన ఇద్దరు యువకులను కూడా రైలు నుంచి బయటకు తోసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఘటనలో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారని, ఆ కేసులో రోహిత్‌కు శిక్ష పడిందని చెప్పారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ ఇలాంటి ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోహిత్ తనను తాను కొన్నిసార్లు పోలీసు సిబ్బందిగా, మరికొన్నిసార్లు రైల్వే పోలీసు లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం సిబ్బందిగా పరిచయం చేసుకుని వ్యక్తులను లక్ష్యంగా చేసుకునేవాడు. సిగరెట్ తాగడంపై నితిన్‌ను వేధించిన అనంతరం కుటుంబం నుంచి రూ.10,000 డిమాండ్ చేసినట్లు తెలిపారు. నిందితుడిపై త్వరితగతిన విచారణ పూర్తి చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రోహిత్ పోలీసుల అదుపులో ఉండగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.


