అయోధ్య విరాళాల చోరీ కేసు చార్జిషీట్‌లో సిట్ వెల్లడి
105 చోరీ ఉదంతాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు
నిందితుల నుంచి రూ.79.85 లక్షలు స్వా«దీనం
కొందరి నుంచి బంగారం, వెండి వస్తువులు సైతం..
అక్టోబర్ 7న కోర్టు ఎదుట హాజరుకానున్న నిందితులు
అయోధ్య: అయోధ్య రామ మందిర విరాళాల చోరీ వ్యవహారంలో కీలక విషయం బయటపడింది. నగదు లెక్కింపు సమయంలోనే ఈ చోరీ జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వెల్లడించింది. విరాళాల దొంగతనంపై సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. సిట్ తాజాగా దాదాపు 70,000 పేజీల చార్జిషీట్‌ను అయోధ్యలోని అదనపు జిల్లా జడ్జి(అవినీతి నిరోధక) కోర్టులో దాఖలు చేసింది. శ్రీరాముడికి భక్తులు సమర్పించిన నగదును లెక్కిస్తున్న సమయంలోనే అందులో భారీగా నొక్కేసినట్లు తేల్చింది.
దేవుడి సొమ్ము కాజేయడం, దాచిపెట్టడం, పంచుకోవడంలో కొందరు వ్యక్తుల నెట్‌వర్క్ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్యాప్తు సమయంలో స్వాదీనం చేసుకున్న వేలాది సందేశాలు, నగదు, విలువైన వస్తువులతోపాటు లెక్కింపు ప్రాంతం నుంచి నగదును తరలించిన 105 ఉదంతాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయని చార్జిషీట్‌లో సిట్ అధికారులు పేర్కొన్నారు. అలాగే ఎనిమిది మంది నిందితులు.. అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా అలియాస్ షానీ, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, సుభాష్ శ్రీవాస్తవ పేర్లను చార్జిసీట్‌లో చేర్చారు. ప్రస్తుతం వీరందరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఫోన్లలో 3,000 మెసేజ్‌లు డిలీట్ చేసిన నిందితులు
విరాళాల చోరీపై సిట్ ప్రాథమిక విచారణ అనంతరం, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ ఫిర్యాదు మేరకు జూన్ 25న కేసు నమోదైంది. లెక్కించిన నగదును తదుపరి దశలో బ్యాంకులకు తరలించే సమయంలో అపహరణ జరిగినట్లు ఆధారాలు లభించలేదని సిట్ పేర్కొంది. ఈ దర్యాప్తులో.. నిందితులు, వారి బంధువులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఆస్తులు, వాహనాలు, ఇతర వనరుల ద్వారా జరిగినట్లు చెబుతున్న డబ్బు లావాదేవీల జాడను కూడా గుర్తించారు. ఎనిమిది మంది నిందితుల్లో ఏడుగురి నుంచి రూ.79.85 లక్షలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు.
అయితే, శ్రీవాస్తవ అనే నిందితుడి నుంచి సొమ్ము ఏదీ స్వా«దీనం చేసుకోలేదు. అనుకల్ప్ మిశ్రాను ప్రధాన కుట్రదారుడిగా పోలీసులు పేర్కొన్నారు. తన బంధువు లవ్‌కుశ్ మిశ్రా, నిందితుడు అవినాష్ శుక్లాలతో అతను ఫోన్ మెసేజ్‌ల ద్వారా సంప్రదింపులు జరిపాడని చార్జి షీట్‌లో సిట్ వెల్లడించింది. నిందితుల మొబైల్ ఫోన్ల నుంచి 3,000కు పైగా డిలీట్ చేసిన సందేశాలను రికవర్ చేసినట్ల తెలియజేసింది. దొంగిలించిన నగదును దాచిపెట్టడం, రవాణా చేయడం, పంపిణీ చేయడం గురించి ఆ సందేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
పోలీసులు ఈ సందేశాలను విరాళాల చోరీ కుట్రకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యంలో భాగంగా పరిగణించారు. లెక్కింపు సమయంలో కాజేసిన డబ్బును దాచిపెట్టి, ఆ తర్వాత పంచుకున్నారని చార్జిషీట్‌లో అధికారులు ఆరోపించారు. కొంతమంది నిందితులపై నిర్దిష్టమైన అభియోగాలు మోపడానికి సీసీటీవీ దృశ్యాలను కూడా ఆధారంగా చూపారు. దర్యాప్తు బృందం నివేదిక ప్రకారం.. 85 సందర్భాల్లో విరాళాల డబ్బును దారిమళ్లించడంలో అవినాష్ శుక్లా ప్రమేయం ఉంది. అనుకల్ప్ మిశ్రా 56 సందర్భాల్లో, కరుణేష్ పాండే 68 సందర్భాల్లో, లవ్‌కుశ్ మిశ్రా 52 సందర్భాల్లో దీనికి సహకరించారు.
రామ్ శంకర్ యాదవ్ కీలక పాత్ర
ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వద్ద డ్రైవర్‌గా పనిచేసిన రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్నూకు రామాలయంలో ఎటువంటి అధికారిక పదవీ లేదు. అయినప్పటికీ ఆలయ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవాడు. విరాళాలను లెక్కించే గదిలోకి స్వేచ్ఛగా ప్రవేశించేవాడు. విరాళాల పెట్టెల తాళాలు కూడా అతని వద్ద ఉండేవి. సరుకుల రవాణా వాహనాల కోసం ప్రవేశ ద్వారం తెరవడం, సిబ్బందికి సూచనలు ఇవ్వడం, వీఐపీలకు దర్శన ఏర్పాట్లు చేయడంలో టిన్నూ పాత్ర ఉంది. సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు, డిజిటల్ ఆధారాలు ఇదే అంశాన్ని నిర్ధారిస్తున్నాయి. విరాళాల పెట్టెల తాళాలు టిన్నూ వద్ద ఉండడం కీలకమైన అంశం.
విరాళాలు లెక్కించే విధానంలో లోపాలు
అనుకల్ప్ మిశ్రా నుంచి రూ.16.82 లక్షలు, లవకుశ్ మిశ్రా నుంచి దాదాపు రూ.14.25 లక్షలు, అవినాష్ శుక్లా నుంచి రూ.20.39 లక్షలు, 1,121 అమెరికా డాలర్లు. రామశంకర్ మిశ్రా నుంచి రూ.7.32 లక్షలు, కరుణేష్ పాండే నుంచి రూ.18.07 లక్షలు, మనీష్ యాదవ్ నుంచి రూ.2 లక్షల నగదు రికవరీలను చార్జిషీట్‌లో నమోదు చేశారు. కొందరు నిందితుల నుంచి బంగారం, వెండి వస్తువులను కూడా స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. విరాళంగా వచ్చిన విలువైన వస్తువులను కూడా అధికారులు పరిశీలించారు. ట్రస్ట్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసిన 803 విలువైన వస్తువులు భౌతికంగా ఉన్నట్లు ధ్రువీకరించారు.
ఎటువంటి వ్యత్యాసాలు కనిపించలేదు. రసీదులు జారీ చేయని మరో 86 విలువైన వస్తువులను కూడా భౌతికంగా ధ్రువీకరించారు. విరాళాలను లెక్కించే విధానంలో లోపాలను సిట్ గుర్తించింది. నగదు లెక్కింపు విధులు నిర్వర్తించే బ్యాంకు ఉద్యోగులు ‘రొటేషన్’పద్ధతిలో పనిచేయాల్సి ఉంది. వారు నిర్దేశిత యూనిఫాం ధరించాలి. ఈ నిబంధనను సరిగ్గా పాటించలేదు. చార్జిషీట్ కాపీలు, అవసరమైన పత్రాలను ఎనిమిది మంది నిందితులకు అందించాలని కోర్టు ఆదేశించింది. నిందితులు అక్టోబర్ 7న కోర్టు ఎదుట హాజరుకానున్నారు. అయోధ్య విరాళాల చోరీ కేసు ఇప్పుడు ‘స్టేట్ వర్సెస్ అనుకల్ప్ మిశ్రా, ఇతరులు’గా కొనసాగుతుంది.


