ఎల‘మంద’కు కాసుల పంట

Farming Lands As Cow Shelters For Soil Fertility - Sakshi

సాగు భూముల్లో పశువుల నిద్ర

వారం రోజులకు రూ.50 వేల ఆదాయం

భూసారం పెంపుపై రైతుల ఆసక్తి

సాక్షి, కోరుట్ల: రసాయనిక ఎరువుల వినియోగంతో భూమి సారం కోల్పోతూ వస్తోంది. పంట దిగుబడిపైనా ప్రభావం చూపుతోంది. వ్యవసాయ భూముల్లో ఆవుల మందతో భూమికి సారం.. ఎలమందకు రాబడి.. రైతుకు ప్రయోజనం కలుగుతోంది. దీంతో భూసారం పెంపుపై రైతాంగం ఆవుల మందలపై దృష్టి సారిస్తోంది. ఈ మంద వారం పాటు సాగు భూముల్లో నిద్ర తీసిందంటే చాలు సదరు ఎలమందకు రూ.50 వేలకు మించి చేతికొస్తుంది. ఆవుల మంద విసర్జకాలకు ఉన్న డిమాండే ఇందుకు కారణమని చెబుతున్నారు. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల సరిహద్దుల్లో ఉన్న రుద్రంగి మండలం మానాల, చందుర్తి, కోనరావుపేట మండలాల పరిసరాల్లోని తండాల్లో పశుపోషణ పెద్ద ఎత్తున సాగుతోంది. అటవీ ప్రాంతాల్లో పచ్చిక బయళ్లు పెద్ద ఎత్తున ఉండటంతో ఆవుల మందలను ఎక్కువగా పోషిస్తున్నారు. నెలల తరబడి సంచార పశుపోషణ చేస్తూ ఆదాయం కోసం మందలను సాగు భూముల్లో నిద్రకు ఉంచుతారు. పశ్చిమ డివిజన్‌ సరిహద్దుల్లోని తండాల్లో ఇలా ఆవుల మందలను పోషించేవారు దాదాపు 150 మంది దాకా ఉంటారు. వంద వరకు మందలు ఉండగా.. ఒక్కో మందలో వందకు పైగా ఆవులు ఉన్నాయి. 

వారానికి రూ.50 వేలు 
పంటల సాగుకు సిద్ధమయ్యే ముందు రైతులు భూసారం పెంపు కోసం ఆవుల మందల నిద్రపై ఆసక్తి చూపుతున్నారు. సహజసిద్ధంగా ఆవుల మల, మూత్ర విసర్జకాలతో సాగుభూములు సార వంతంగా మారుతాయి. రసాయన ఎరువులు వాడ కుండానే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. మం దలో ఉన్న ఆవుల సంఖ్యను బట్టి రైతులు మందల యజమానులకు డబ్బులు చెల్లిస్తున్నారు. వందకు పైబడి ఉన్న ఆవుల మంద వారం పాటు సాగు భూమిలోనే కట్టేస్తే రోజుకు రూ.6 వేల నుంచి రూ.8 వేలు చెల్లిస్తున్నారు. కనీసం వారంపాటు మంద సాగుభూమిలో ఉంటే పశు మల, మూత్ర విసర్జకాలతో భూసారం చక్కగా పెరుగుతుంది.

ఇవీ లాభాలు 
సాగు భూమిలో కర్బన శాతం పెరుగుతుంది
సూక్ష్మ, స్థూల పోషకాలు సమతూకం అవుతాయి 
భూమి సహజ లక్షణాలు కోల్పోకుండా ఉంటుంది 
నత్రజని, భాస్వరం, పొటాషియం సహజసిద్ధంగా అంది నేల సారవంతం అవుతుంది

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top