విమెన్ పవర్
మహిళా కవిత్వం
ప్రతినెలా అందరికీ వీలైన రోజున ఒక మధ్యాహ్నం, జలంధర్‌లోని ఒక సభ్యురాలి ఇంట్లో కొంతమంది మహిళలు సమావేశమవుతుంటారు. అది ఏదో సాంఘిక సమావేశమో లేక లాంఛన్రపాయమైన సభో కాదు. తాము స్వయంగా రాసుకున్న కవిత్వాన్ని చదవడానికి చేసుకున్న ఒక ఏర్పాటు. ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, గృహిణులు, వివిధ రంగాలకు చెందిన మహిళలు చేతుల్లో నోట్‌బుక్‌లతో ఒకచోట చేరతారు. బయటకు చెప్పుకోని తమ భావోద్వేగాలను, అనుభవాలను, ఆలోచనలను వ్యక్తపరచడానికి పద్యరూపంలో ఒక వేదికను వారు కనుగొంటారు.
రచయిత్రి నరేష్ నాజ్ స్థాపించిన మహిళా కవయిత్రుల వేదిక అయిన ’మహిళా కావ్య మంచ్’ ఈ సమావేశాలను నిర్వహిస్తుంది. ఈ సంస్థ రాష్ట్రంలోని పలు ్రపాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది, జిల్లాస్థాయి విభాగాలు స్వతంత్రంగా పనిచేస్తూ నెలవారీ కవితా సమావేశాలను నిర్వహిస్తున్నాయి.
ఎలాంటి రుసుమూ లేదు...
అనేక సాహిత్య సంస్థల వలె కాకుండా మహిళా కావ్యమంచ్ సభ్యత్వ రుసుమును వసూలు చేయదు. కవిత్వం రాయడంపై ఆసక్తి ఉన్న ఏ మహిళ అయినా, ఆమె వృత్తి లేదా సాహిత్య నేపధ్యంతో సంబంధం లేకుండా సభ్యురాలుగా చేరచ్చు. సభ్యుల సౌలభ్యాన్ని బట్టి సమావేశాలు ఆన్ లైన్ లోనూ, ఆఫ్‌లైన్ లోనూ జరుగుతాయి. అయితే ఆఫ్‌లైన్ సమావేశాలు సాధారణంగా సభ్యురాలి నివాసంలో నిర్వహిస్తారు.
ఈ సమావేశంలో పాల్గొనేవారి సంఖ్య నెలా నెలా పెరుగుతూనే ఉంది. దీంతో ఇది ఒక సాహిత్య వేదిక కంటే ఎక్కువగానే మారింది. ఒత్తిడితో కూడిన వృత్తి, ఇంటి బాధ్యతలు, కుటుంబ కట్టుబాట్ల నడుమ, ఈ నెలవారీ సమావేశాలు సృజనాత్మకతకు, స్వీయ వ్యక్తీకరణకు ప్రత్యేక సమయాన్ని అందిస్తున్నాయి. ప్రోత్సాహకరమైన ప్రేక్షకుల ముందు తమ రచనలను చదివి వినిపించడం వల్ల, వారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, తమ రోజువారీ పాత్రలకు అతీతంగా ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు సహాయపడిందని సభ్యులు చెబుతున్నారు.
సోషల్ మీడియా కవిత్వాన్నీ విస్తృతంగా పరిచయం చేస్తున్నప్పటికీ అర్థవంతమైన సాహిత్య సంఘాలను కలుసుకోవడం కష్టంగానే మారింది. కవిత్వం కేవలం రాయడానికి మాత్రమే కాదని, దానిని వినేవారూ ఉండాలని ఇలాంటి సమావేశాలలో పాల్గొనేవారికి గుర్తుచేస్తూనే ఉంది.
ఒకే వేదికపైకి..
ఈ సంస్థ ప్రతి సంవత్సరం రాష్ట్రస్థాయి సమావేశాలను కూడా నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా వివిధ జిల్లాలకు చెందిన మహిళా కవయిత్రులను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది. తమ ఇళ్లలో కవితలు చదవడం ద్వారా ఎందరో కవులకు, తమ రచనలను మరింత విస్తృతమైన ప్రేక్షకులతో పంచుకోవడానికి ఇది ఒక అవకాశంగా మారుతుంది.
కజిన్స్, ఫ్రెండ్స్, బంధువులలో కొంతమంది సభ్యులు ప్రతినెలా ఒకరింట్లో సమావేశమై ఆనందాన్ని పంచుకోవడం గురించి మనకు తెలిసిందే..! పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో మాత్రం ప్రతినెలా మహిళా కవితాబృందం ఒకరి ఇంట్లో కలుసుకుంటారు. తమ అనుభవాలను, అనుభూతులను కవిత్వం ద్వారా పంచుకుంటారు. కాగితాలకే పరిమితం కాని ఒక గొంతుకను అందిస్తారు. రచయిత్రి నరేష్ నాజ్ స్థాపించిన మహిళా కవయిత్రుల వేదిక ‘మహిళా కావ్య మంచ్’ ద్వారా నెలవారీ కవితా సమావేశాలను సమర్థవంతంగా కొనసాగిస్తున్నారు.


