నేవీ బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌గా రిద్ధి | Riddhi Chauhan Inspiring Success Story, 17-Year-Old Indian American Teen Leads 300 Cadets In US Navy Program | Sakshi
Sakshi News home page

నేవీ బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌గా రిద్ధి

Jul 17 2026 8:36 AM | Updated on Jul 17 2026 10:40 AM

Success Story Of Riddhi Chauhan As Navy Battalion Commanding Officer

విమెన్‌ పవర్‌

రిద్ధి చౌహాన్‌

భారతీయ సంతతికి చెందిన 17 ఏళ్ల యువతి రిద్ధి చౌహాన్‌ యూఎస్‌ నేవీ సహకారంతో నడిచే ప్రతిష్టాత్మక హైస్కూల్‌ మిలిటరీ ప్రోగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్‌లోని ప్రముఖ బెంజమిన్‌ ఎన్‌. కార్డోజో హైస్కూల్‌ నేవీ జూనియర్‌ రిజర్వ్‌ ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ కార్ప్స్‌ విభాగంలో అత్యున్నత హోదా అయిన బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు.

తన పాఠశాల పరిధిలోని 300 మంది క్యాడెట్లకు నాయకత్వం వహిస్తున్న ఆమె వారి శిక్షణ, విధివిధానాలు, సంక్షేమ బాధ్యతలను పర్యవేక్షిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ఈ ఎన్‌జీఆర్‌వోటీసీప్రోగ్రామ్‌లోనే అత్యున్నత హోదా సాధించిన తొలి భారతీయ సంతతి విద్యార్థినిగా రిద్ధి నిలిచారు.

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన రుచిక, దిలీప్‌ చౌహాన్‌ల కుమార్తె రిద్ధి కుటుంబం ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తోంది. బాల్యం నుంచే దేశసేవపై ఆసక్తి పెంచుకున్న రిద్ధి, కేవలం స్కూల్‌ స్థాయికే పరిమితం కాకుండా భవిష్యత్తులో యూఎస్‌ నేవీలో ఆఫీసర్‌గా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే, యునైటెడ్‌ స్టేట్స్‌ నావల్‌ అకాడమీకి తొలిమెట్టుగా భావించే అత్యంత ప్రతిష్టాత్మక నావల్‌ అకాడమీ ప్రిపరేటరీ స్కూల్‌లో ప్రవేశించడానికి ఆమె సిద్ధమవుతున్నారు. బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ వంటి అరుదైన బాధ్యత పొం​దడానికి ముందు, రిద్ధి అకడమిక్‌ కమాండర్, స్టెమ్‌ కమాండర్, ΄్లాటూన్‌ లీడర్, ఇన్స్‌పెక్షన్‌ కమాండర్‌గా పలు విభాగాల్లో తన ప్రతిభను నిరూపించుకున్నారు.

పర్సనల్‌ మెంటర్‌గానూ..
రిద్ధి అకడమిక్‌ కమాండర్‌గా వ్యవహరిస్తూ, జాతీయస్థాయి అకడమిక్‌ పోటీలలో తన టీమ్‌కు ప్రథమ స్థానాన్ని అందించారు. వరుసగా రెండేళ్లపాటు ‘లీడర్‌షిప్‌ అండ్‌ అకడమిక్‌ బౌల్‌’ పోటీల్లో తన స్కూల్‌ను ముందంజ లో నిలపడమేకాకుండా రోబోటిక్స్‌లో శాస్త్రవేత్తల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు, తన ఈ ప్రయాణంలో తనతోపాటుగా ఉన్న మరో 200 మంది క్యాడెట్లకు పర్సనల్‌ మెంటార్‌గా వ్యవహరిస్తూ, వారిని కూడా సమర్థమైన నాయకులుగా తీర్చిదిద్దారు.

ఆధ్యాత్మిక స్ఫూర్తితోనే!
తనలో ఉన్న నాయకత్వ లక్షణాలు, సేవా గుణం పుస్తకాలతో వచ్చింది కాదనీ.. తన కుటుంబం నేర్పించిన విలువలు, భారతీయ సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక గురువుల బోధనల వల్లే ఈరోజు తను ఇంతమందికి దిశానిర్దేశం చేయగలుగుతున్నానని చెబుతోంది రిద్ధి చౌహాన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement