క్రియేటివ్ కిడ్స్
కథలు వినే వయసులోనే.. ప్రపంచం చదువుకునేలా కథలు రాస్తున్నారు ఈ చిచ్చర పిడుగులు. కలాన్ని కూడా సరిగ్గా చేత్తో పట్టడం రాని ఈ చిన్నారులు తమ ఊహాశక్తితో, అద్భుతమైన ఆలోచనలతో కవితలు, కథలు సృష్టిస్తున్నారు. తమ రాతలతో ఏడేళ్లకే ఒకరు ప్రపంచ రికార్డు సృష్టిస్తే, మూడేళ్ల వయసులోనే మరొకరు గ్లోబల్ పబ్లిషింగ్ హౌస్‌లను సైతం ఆశ్చర్యపరిచారు. తమ అద్భుత ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, రికార్డులను సొంతం చేసుకుంటున్నారు.
అభిజిత గుప్తా
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన చిన్నారి రచయిత అభిజిత గుప్తా ఏడేళ్లకే ప్రపంచ రికార్డు సృష్టించింది. అత్యంత పిన్న వయస్కురాలైన కవయిత్రిగా, కథల రచయిత్రిగా ‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో స్థానం సంపాదించుకుంది. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ‘గ్రాండ్ మాస్టర్ ఇన్ రైటింగ్’ బిరుదును కూడా అందుకుంది. అభిజిత రాసిన మొదటి పుస్తకం ‘హ్యాపీనెస్ ఆల్ అరౌండ్’. కథలు, కవితల సమాహారమైన ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. అభిజిత ప్రముఖ రాష్ట్రకవులైన మైథిలీశరణ్ గుప్తా, సియారాంశరణ్ గుప్తా కుటుంబం నుంచి వచ్చిన చిన్నారి. వియ్ విల్ స్యూర్లీ సస్టేయిన్, టు బిగిన్ విత్ ద లిటిల్ థింగ్స్ వంటి పుస్తకాలు కూడా ఈ చిన్నారి కలం నుంచి జాలువారినవే.
క్రిసీస్ నైట్
ప్రతిభావంతురాలైన బాల రచయిత్రి, ఇలస్ట్రేటర్ (పుస్తకాలకు బొమ్మలు వేయడం) క్రిసీస్ నైట్. ఈ చిన్నారి కేవలం మూడేండ్ల వయసులో ఉన్నçప్పుడే తన తొలి పుస్తకమైన ‘ది గ్రేట్ బిగ్ లయన్’ను స్వయంగా ప్రచురించి.. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన రచయిత్రిగా గుర్తింపు పొందింది. మొదట సింగపూర్‌లో చిన్నగా ప్రచురితమైన ఈ పుస్తకాన్ని.. తరువాత అంతర్జాతీయ ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్ రాండమ్ హౌస్’ ప్రపంచ వ్యాప్తంగా ప్రచురించింది. సింగపూర్‌లో జన్మించిన క్రిసీస్‌కి భారతదేశంతో మంచి అనుబంధం ఉంది. ఆమె పుస్తకం ఇండియాలో పెద్ద ఎత్తున విడుదలయ్యింది.
క్రిసీస్ బాల మేధావి. మొదటి ఏడాదిలోనే చదవడం నేర్చుకుంది. ఆమెకున్న అసాధారణ భాషా నైపుణ్యాలను గుర్తించి, అతి చిన్న వయసులోనే ప్రతిష్టాత్మక మెన్సా ఇంటర్నేషనల్ సొసైటీలో ఆమెకు సభ్యత్వం లభించింది. అంతేకాకుండా ఆమె రాసిన ‘ది గ్రేట్ బిగ్ లయన్’ కథకు సింహం బొమ్మలను, ఇతర చిత్రాలను కూడా ఆమే స్వయంగా గీసింది. క్రిసీస్ నైట్ కేవలం ఈ ఒక్క పుస్తకానికే పరిమితం కాలేదు. పిల్లల్లో ధైర్యాన్ని నింపేందుకు ‘క్యాప్చరింగ్ థండర్’ అనే మరొక పుస్తకాన్ని కూడా రాసింది. క్రిసీస్ మొదటి పుస్తకం ‘ది గ్రేట్ బిగ్ లయన్’ విడుదలైన తర్వాత సింగపూర్, దుబాయ్, కెనడాతో పాటు భారతదేశంలో కూడా అనేక వర్చువల్ ఈవెంట్స్, బుక్ లాంచ్‌ల ద్వారా లక్షలాది మంది పిల్లలకు ఈ చిన్నారి స్ఫూర్తిగా నిలిచింది.
అయాన్ కపాడియా
సాధారణంగా చిన్న పిల్లలు జంతువుల కథలు రాస్తారు. కానీ ముంబైకి చెందిన అయాన్ కపాడియా మాత్రం కేవలం 10 సంవత్సరాల వయసులోనే సైన్స్ ఫిక్షన్ నవలను రాసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయాన్ రాసిన ‘మేవరిక్స్ మార్వలస్ అడ్వెంచర్’ సిరీస్ సైన్స్ ప్రియులను సైతం ఆలోచింపజేసేలా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం, కథలు అల్లడం అభిరుచిగా ఉన్న ఈ బుడతడు తన 9వ ఏటనే మొదటి సిరీస్ అయినటువంటి మావెరిక్స్ మార్వలస్ అడ్వెంచర్‌ను కేవలం మూడురోజుల్లోనే పూర్తి చేశాడు. ఇందుకు గాను అయాన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి భారతదేశ బాలరచయిత అనే ప్రతిష్టాత్మక టైటిల్‌ను కూడా అందుకున్నాడు. తన పుస్తకాల అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని అనా«థాశ్రమానికి విరాళంగా ఇచ్చాడు అయాన్. హ్యారీ పోటర్, పర్సీ జాక్సన్, రోనాల్డ్ డాల్ వంటి ఎన్నో పుస్తకాలను ఇప్పటికే చదివేశాడు ఈ బాల మేధావి.
అభిరామ్ సాయి చిమ్మిలి
తెలంగాణకు చెందిన అభిరామ్ సాయి చిమ్మిలి రాసిన ద క్లాక్ ఆఫ్ కాన్‌సీక్వెన్స్ అనే పుస్తకం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. భారతీయ బాల రచయితలను ్రపోత్సహించే ప్రతిష్టాత్మక ‘నేషనల్ యంగ్ ఆథర్స్ ఫెయిర్’ లో అభిరామ్ నెంబర్ వన్ జ్యూరీ అవార్డు విజేతగా నిలిచి సరికొత్త రికార్డు çసృష్టించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద పుస్తక రచన ప్లాట్‌ఫారం అయిన ‘బ్రిబుక్స్’, ‘ఎడ్యుకేషన్ వరల్డ్’ సంయుక్తంగా న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక అవార్డుల ప్రదానోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేశారు.
పర్యావరణ మార్పులు, వాటి వల్ల భవిష్యత్తులో రాబోయే పరిణామాలు, తీసుకోవాల్సిన తక్షణ చర్యల నేపథ్యంలో రాసిన ఈ పుస్తకంలో.. 2095వ సంవత్సరంలో పర్యావరణ మార్పుల వల్ల ప్రపంచం ఎదుర్కొనే సవాళ్లను కళ్లకు కట్టినట్లు వివరించాడు. ఎంతో పరిణతితో కూడిన కథాంశం, అద్భుతమైన శైలితో రాసిన ఈ పుస్తకం జాతీయ స్థాయి జ్యూరీ ΄్యానెల్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అభిరామ్ సాయి చిమ్మిలి కేవలం రచనలకే పరిమితం కాకుండా స్పెల్ బి పోటీలలో రెండుసార్లు అంతర్జాతీయ స్థాయి వరకు పాల్గొని తన ప్రతిభను చాటుకున్నాడు. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం అభిరామ్‌కు ఇష్టమైన వ్యాపకాలు.
మిరాయా వీర్
ముంబైకి చెందిన మిరాయా వీర్ పర్యావరణ స్పృహæకలిగిన బాల రచయిత్రి. ఐదు సంవత్సరాల వయసులోనే రాయడం ప్రారంభించింది మిరాయ. తన తొమ్మిదేళ్ల వయసులో రాసిన తొలి పుస్తకం హలో అంటార్కిటికా. వాతావరణ మార్పుల నేపథ్యంలో మానవులు, జంతువులు, ప్రకృతి మధ్య ఉండే అవినాభావ సంబంధాన్ని ఇందులో ఎంతో చక్కగా వివరించింది. ఆమె రాసిన రెండో పుస్తకం ది డౌన్ అండర్. కౌమారదశలో ఉన్న పిల్లలకు, వృద్ధులకు మధ్య ఉండే సున్నితమైన బంధాన్ని ఆవిష్కరిస్తుంది ఈ పుస్తకం. అలాంగ్ ది నైల్: ఆన్ ఈజిప్షియన్ చేజ్ అనేది మిరాయా రాసిన మూడవ పుస్తకం. హిస్టారికల్ ఫాంటసీ, ట్రావెలాగ్, మిస్టరీ కలబోతగా సాగే పుస్తకం ఇది. ఈ కథలో ఐరా, అయాన్ పాత్రలు నైలు నది చారిత్రక ప్రాముఖ్యతను కళ్లకు కడతాయి.


