బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలి
ఐరాస భద్రతా మండలిలో భారత్ స్పషీ్టకరణ
సాక్షి, న్యూఢిల్లీ: సాయుధ ఘర్షణలు, యుద్ధాల సమయంలో పాఠశాలలు, అమాయకులైన చిన్నారులపై దాడులకు ఒడిగట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా భారత్ కుండబద్దలు కొట్టింది. దాడులకు పాల్పడిన వారి బాధ్యతను కచ్చితంగా తేల్చాలని, జవాబుదారీతనం లేకుండా పిల్లలకు కల్పించే రక్షణ అసంపూర్ణమేనని స్పష్టం చేసింది. మండలిలో ‘పిల్లలు–సాయుధ ఘర్షణలు’అంశంపై జరిగిన బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పాల్గొన్నారు. చిన్నారులపై జరుగుతున్న దాడులపై ఆయనతీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల చదువుకునే హక్కును కాపాడటానికి భారత్ నిబద్ధతతో ఉందని ఆయన ఉద్ఘాటించారు.
కఠినంగా శిక్షించాల్సిందే..
సంక్షోభ సమయాల్లో కూడా పిల్లల విద్యకు ఆటంకం కలగరాదని ఈ సందర్భంగా హరీశ్ పేర్కొన్నారు. యుద్ధాలు, ఘర్షణలతో అట్టుడుకుతున్న ప్రాంతాల్లో పిల్లల విద్యా హక్కును పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ఆయన సభ్య దేశాలకు వివరించారు. ఎవరైతే శిక్ష పడదన్న ధీమాతో బడులు, పసిపిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారో వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన వారిని శిక్షించినప్పుడే భవిష్యత్తులో ఇలాంటి అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడుతుందని స్పష్టం చేశారు. ఒక దేశ భవిష్యత్తును కాపాడాలంటే ముందుగా ఆ దేశ పసిపిల్లల చదువును కాపాడటం ఎంతో కీలకమని భారత్ తరఫున ఆయన గట్టిగా వాదించారు.
ఆందోళన కలిగించే గణాంకాలు..
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ విడుదల చేసిన తాజా నివేదికలోని గణాంకాలను పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఒక్క ఏడాది వ్యవధిలోనే పాఠశాలలపై దాడులు ఏకంగా 44 శాతం మేర పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 47.3 కోట్ల మంది పిల్లలు (ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు) ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు, లేదా అక్కడి నుంచి ప్రాణభయంతో వలస వెళుతున్నారు. వీరిలో 8.5 కోట్ల మందికి పైగా పిల్లలు కనీస విద్యకు కూడా నోచుకోవడం లేదు. ఈ నివేదిక ప్రకారం ఏకంగా 38,558 తీవ్రమైన ఉల్లంఘనలు జరగ్గా, వీటివల్ల 24,174 మంది చిన్నారులు (15,493 బాలురు, 7,990 బాలికలు) ప్రత్యక్షంగా బాధితులయ్యారు. పదే పదే ఉల్లంఘనలకు గురైన పిల్లల సంఖ్య సైతం 3,137 నుంచి 3,176కి పెరిగింది. ఈ గణాంకాలు మానవాళి సమిష్టి వైఫల్యానికి నిదర్శనమని భారత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.


