గాజాలో పిల్లలను టార్గెట్‌ చేసి చంపారు  | Israeli security forces have deliberately targeted Palestinian childrens | Sakshi
Sakshi News home page

గాజాలో పిల్లలను టార్గెట్‌ చేసి చంపారు 

Jun 26 2026 12:33 AM | Updated on Jun 26 2026 12:33 AM

Israeli security forces have deliberately targeted Palestinian childrens

పాలస్తీనాపై ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్‌ 

ఐరాస: పాలస్తీనాలో పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగానే ఇజ్రాయెల్‌ దాడులు చేసిందని పాలస్తీనా భూభాగంపై ఐక్యరాజ్యసమితి వేసిన విచారణ కమిషన్‌ తెలిపింది. మొత్తంగా 20వేల మందికి పైగా పిల్లలు చనిపోయారని, 44వేల మందికి పైగా గాయపడ్డారని కమిసన్‌ తెలిపింది. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్‌. మురళీధర్‌ నేతృత్వంలోని కమిషన్‌ ఈ మేరకు ఒక నివేదికను సమర్పించింది. 100 పేజీల నివేదికను కమిషన్‌ జూన్‌ 23న విడుదల చేసింది. 

సంఘర్షణ సమయంలో పాలస్తీనా పిల్లలపై జరిగిన హింస, నష్టాన్ని కమిషన్‌ నమోదు చేసిందని మురళీధర్‌ తెలిపారు.  ‘‘2023 అక్టోబర్‌ 7 నుంచి 2025 అక్టోబర్‌ 7 మధ్య... రెండేళ్లకాలంలో గాజాలో 20,000 మందికి పైగా పిల్లలు, వెస్ట్‌ బ్యాంక్, తూర్పు జెరూసలంలో కొందరు పిల్లలు చనిపోయారు. 44,000 మందికి పైగా గాయపడ్డారు. పిల్లలను చంపడం, గాయాలపాలు చేయడం చాలా లక్ష్యంతో జరిగింది. 

ఇజ్రాయెల్‌ దళాలు జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అధిక శక్తివంతమైన బాంబులను, డ్రోన్లు, స్నైపర్‌ రైఫిళ్ల వంటి కచ్చితమైన ఆయుధాలను ఉపయోగించాయి. క్వాడ్‌కాప్టర్ల కచ్చితత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆస్పత్రులు, అనాథాశ్రమాలతో సహా పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారి మౌలిక సదుపాయాల విధ్వంసం జరిగింది. గాజాలోని మొత్తం పాఠశాలల్లో తొంభై ఏడు శాతం పూర్తిగా ధ్వంసమయ్యాయి. 

చాలా మంది పిల్లలు ఇప్పుడు మూడేళ్లకు పైగా ప్రాథమిక విద్యను కోల్పోయారు. తమ కుటుంబాలను పూర్తిగా కోల్పోయిన పిల్లలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందుకు వారికి చికిత్స అందించిన వైద్యులు సాక్ష్యం. ఇజ్రాయెల్‌ రక్షణ దళాలు నిర్బంధంలో ఉన్న పిల్లలను హింసించినట్లు, ఉద్దేశపూర్వకంగా పిల్లలను అంగవైకల్యానికి గురిచేసి చంపినట్లు మా వద్ద సాక్ష్యాలున్నాయి’’అని మురళీధర్‌ తెలిపారు. 

పిల్లలు, వైద్యులు, ఇతర సాక్షులతో జరిపిన ఇంటర్వ్యూలు, కమిషన్‌ పరిశోధకులు, ఫోరెన్సిక్‌ విశ్లేషకులు ధృవీకరించిన ఆధారాలతో నివేదిక తయారు చేశామన్నారు. అదే సమయంలో, పాలస్తీనా సాయుధ గ్రూపుల దురాగతాలను కూడా కమిషన్‌ నమోదు చేసిందని మురళీధర్‌ పేర్కొన్నారు. పిల్లలపై పాలస్తీనా సాయుధ గ్రూపుల చర్యలను కూడా నమోదు చేశామని, ఈ హత్యలు, దాడుల్లో కొన్నింటికి హమాస్, పాలస్తీనా సాయుధ గ్రూపులు కూడా కారణమని ఆయన పేర్కొన్నారు.

ఖండనలు కాదు, చర్యలు తీసుకోవాలి 
ఈ దాడులపై కేవలం ఆందోళన వ్యక్తం చేస్తే సరిపోదని, అంతర్జాతీయ చర్యలకు పిలుపునివ్వాలన్నారు. ఇజ్రాయెల్‌తో సైనిక, వాణిజ్య లేదా దౌత్య సంబంధాలున్న దేశాలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై విచారణ జరపాలని, అందుకు సార్వత్రిక న్యాయ పరిధి సూత్రాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన కోరారు. 

అయితే, విచారణలో పాల్గొనడానికి ఇజ్రాయెల్‌ నిరాకరించిందని, ఇజ్రాయెల్‌ అధికారుల నుంచి కూడా సమాచారాన్ని స్వీకరించడానికి కమిషన్‌ సిద్ధంగా ఉందని మురళీధర్‌ నొక్కి చెప్పారు. కమిషన్‌ సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా చర్య తీసుకోవాలా? వద్దా? అనేది సభ్య దేశాలు నిర్ణయించుకోవాలన్నారు. ‘ఇప్పుడు అంతర్జాతీయ సమాజం చేతిలో నిర్ణయాధికారం ఉంది. సాక్ష్యాధారాలన్నింటినీ స్వీకరించి, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలి’’అని ఆయన నొక్కి చెప్పారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement