పిల్లలకు కాదు... పాఠం పెద్దలకే! | Changing Parental Mindsets For Modern Education | Sakshi
Sakshi News home page

పిల్లలకు కాదు... పాఠం పెద్దలకే!

Jul 27 2026 2:03 PM | Updated on Jul 27 2026 2:08 PM

Changing Parental Mindsets For Modern Education

క కాలానికి సరిపోయిన ఆలోచనలు, నేడు ప్రశ్నించకుండా సత్యాలుగా మిగిలిపోతున్నాయి. ఉదాహరణకు, పిల్లవాడు ఒక సమస్యకు కొత్త పరిష్కారం చెబితే, ‘మేం ఇన్నేళ్లుగా ఇలాగే చేస్తున్నాం’ లేదా ‘అందరూ ఇలానే చేస్తున్నారు’ అనే ఒక్క వాక్యంతో ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తాం. ఆ పరిష్కారం సరైందా, కాదా అని పరిశీలించే ముందే, అది కొత్తదనే కారణంతో తిరస్కరిస్తాం. అలా ఓడిపోతు న్నది కొత్త ఆలోచన కాదు; గెలుస్తున్నది పాత అలవాటు.

అందుకే ప్రపంచం మారుతున్నా, మన సమాధానాలు మాత్రం అలాగే మిగిలిపోతున్నాయి. ఫలితంగా అసలు ప్రశ్న పిల్లలు ఏమి నేర్చుకోవాలనేది కాదు; పెద్దలు ముందుగా ఏమి వదిలే యాలనేదే!
‘పిల్లలు నేర్చుకున్నదాన్ని వదలాలి (ఆన్‌లెర్న్‌), కొత్తగా ఆలోచించాలి’– ఈ మధ్య విద్యా చర్చల్లో బాగా వినిపిస్తున్న మాట. ఇక్కడ ‘వదలడం’ అంటే నేర్చుకున్న జ్ఞానాన్ని మర్చిపోవడం కాదు; కాలం చెల్లిన ఆలోచనా విధానాలను ప్రశ్నిస్తూ కొత్త దృక్ప థాన్ని స్వీకరించడం. కానీ ఈ ఆలోచనను మరో కోణంలో చూడాల్సిన అవసరం ఉంది.

పిల్లల దగ్గర వదిలేయాల్సినంత పాత నమ్మకాలు ఏము న్నాయి? వాళ్లు మొదటిసారి ప్రపంచాన్ని చూస్తున్నారు; పాత కళ్లద్దాలు మాత్రం మన పెద్దలవే. వాటిని వాళ్లకు అందించింది మనమే. కాబట్టి ఇప్పుడు ప్రశ్న– ‘పిల్లలు ఏం నేర్చుకోవాలి?’ అని కాదు; ‘మనం ముందుగా ఏ పాత నమ్మకాలను వదిలించు కోవాలి?’ అనేది. ఒకప్పుడు ఇవి విజయానికి మార్గదర్శకాలుగా ఉండి ఉండొచ్చు. కానీ వాటిని శాశ్వత సత్యాలుగా మార్చింది మనమే.

ఇది ఎందుకు అంత కష్టం?
ఒక నమ్మకాన్ని వదలడం అంటే, దాన్ని పట్టుకుని జీవించిన మన సొంత గతాన్నే ప్రశ్నించడం. ‘నేను ఇలా పెరిగాను, నేను బాగానే ఉన్నాను కదా’ అనే భావన మనలో బలంగా ఉంటుంది. ఆ నమ్మకాన్ని వదిలేస్తే, మన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, రాజీలు అన్నీ వృథా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇది దురుద్దేశ్యం కాదు; తెలిసిన దానిపై ఉండే భద్రతా భావం. తల్లిదండ్రులు, ప్రతి ఉపాధ్యాయుడు ఒకప్పుడు ఒక వ్యవస్థ గుండా వచ్చినవారే. వాళ్ల మీద కూడా ఎవరో ఒక ముద్ర వేశారు. ఇప్పుడు వాళ్లు చేస్తున్నది– తమకు వేసిన అదే ముద్రను, తెలియకుండానే, తర్వాతి తరానికి బదిలీ చేస్తున్నారు. ప్రతి కాలం తన సమస్యలకు తన సమాధానాలు సృష్టించుకుంటుంది. కలంతో పాటూ సమాధా నాలూ మారాలి.

ప్రపంచ ఆర్థిక వేదిక ప్రకారం, 2030 నాటికి ఉద్యోగ నైపుణ్యాల్లో 39% మారిపోతాయి. ఈ రోజు నేర్పే సగం నైపుణ్యాలు అప్పటికి పనికిరాకపోవచ్చు. అందుకోసం సిలబస్‌ మార్చడం సరిపోదు; దాన్ని బోధించే వారి ఆలోచనా విధానం కూడా మారాలి. వ్యవస్థ ఎంత మారినా, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేది మను షులే– ఇంట్లో తల్లిదండ్రులు, తరగతి గదిలో ఉపాధ్యాయులు. వ్యవస్థ ఒక వైపు మారుతుంటే, పెద్దల ఆలోచనలు అక్కడే నిలిచి పోతే, ఆ మార్పు అసంపూర్ణంగా మిగిలిపోతుంది. కాబట్టి పిల్లల భవిష్యత్తును మార్చేది కొత్త సిలబస్‌ మాత్రమే కాదు; పెద్దల మనస్తత్వంలో వచ్చే చిన్న మార్పు కూడా. పిల్లలు రేపటి తరాన్ని నిర్మించాలంటే, ఈరోజు పెద్దలు నిన్నటి కళ్లద్దాలను వదిలించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– వంగవోలు రవి, ఉపాధ్యాయుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement