అమ్మ అనే పిలుపు కోసం మహిళలు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఆధునిక జీవనశైలి వల్ల నేడు సంతానలేమి సమస్యలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు సంతానలేమి సమస్య ఏడు శాతం ఉండేదని నేడు రెట్టింపు అయినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. గుంటూరులో ప్రత్యేక ఆస్పత్రులు, ఐవీఎఫ్ సెంటర్స్ చాలా వచ్చాయి.
పిల్లలు పుట్టకపోవటానికి కారణాలు...
పెళ్ళైన ఏడాది పాటు ఎలాంటి గర్భనిరోధక పద్ధతులు పాటించకుండా దాంపత్య జీవితాన్ని కొనసాగించినా గర్భం రాకపోవటాన్ని వంధత్వం(ఇన్‌ఫెర్టిలిటీ) అంటారు. ఆడవాళ్లలో సంతాన లేమికి కారణా ల్లో ఆలస్యంగా అంటే 35 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవటం. ఆలస్యంగా రజస్వల అవ్వటం. అండం విడుదల అవ్వకపోవటం, హోర్మోన్ల సమస్య, గర్భసంచి, కడుపులో ఇన్‌ఫెక్షన్లు, గర్భసంచి ట్యూబ్ లు మూసుకుపోవటం, పీసీఓడీ, జునైటైల్ టీబీ, బీపీ, షుగర్, జీవనశైలి, అధిక మానసిక ఒత్తిడి, అధిక బరువు, అండం విడుదల జరిగే సమయంలో దాంపత్యంలో పాల్గొనకపోవటం, దాంపత్యం కోసం మూఢనమ్మకాలు పెట్టుకుని ఆచరించటం, సెక్స్‌పై అవగాహన లేకపోవటం తదితర కారణాలు ఉన్నాయి.
మగవారిలో సంతానలేమికి కారణాలు....
మగవాళ్లలో దీర్ఘకాలిక వ్యాధులైన బీపీ, షుగర్ సంతానలేమికి దారితీస్తాయి. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, కొన్ని రకాల మందులు వాడటం వలన కూడా సంతానలేని సమస్య ఉత్పన్నమవుతుంది. సుఖవ్యాధులు, టీబీ, బీర్జాలకు గాయాలు అవ్వటం, దెబ్బలు తగలటం, అంగం సైజుల్లో తేడాలు, పని ఒత్తిడి వలన సంతానలేమి సమస్యలు వస్తున్నాయి. కంప్యూటర్‌ను 6 నుంచి 8 గంటలపాటు వినియోగించటం, రాత్రివేళల్లో ఎక్కవగా సెల్‌ఫోన్ మాట్లాడటం, వీర్యకణాలు తక్కువగా ఉండటం, రాత్రివేళలో నిద్రపోకుండా ఉండటం, హార్మోన్ సమస్యలు, గర్భనిరోధక సాధనాలు ఎక్కువగా వాడటం వల్ల సమస్యలు వస్తున్నాయి.
ఆధునిక చికిత్సలతో సంతానం....
సంతానం కోసం చింతించేవారికి నేడు అత్యాధునిక వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. సంతానం కోసం ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) విధానంలో భార్య అండాన్ని, భర్త శుక్రకణాల్ని ఇంక్యుబేటర్‌లో పెట్టి రెండు నుంచి ఐదు రోజుల్లో పిండం తయారైయ్యాక ఇంజెక్షన్ రూపంలో భార్య గర్భంలో పిండాన్ని పెడతారు. భర్త శుక్రకణాల సంఖ్య తక్కవగా ఉంటే ఇక్సీ విధానం ద్వారా, సంఖ్య జీరో అయితే టీసా పద్ధతి ద్వారా బీర్జాల్లో నుంచి సిరంజి ద్వారా వీర్యకణాలు తీసి ఫలదీకరణం చెందించి పిండాన్ని తయారు చేసి గర్భంలో పెడతారు. ఇంట్రాయుటైన్ ఇన్‌సెమినేషన్(ఐయూఐ) విధానంలో భర్త శుక్రకణాలు తీసి ఇంజెక్షన్ రూపంలో భార్య గర్భంలో ప్రవేశపెడతారు. భార్య గర్భసంచి పిండం మోసే స్థితిలో లేకపోయినా, ఆమె ఆరోగ్యరీత్యా గర్భం రాకూడదని వైద్యులు నిర్ధారిస్తే సరోగసి ద్వారా(అద్దెగర్భం) సంతానం పొందవచ్చు.
ఆరోగ్య కరమైన సంతానం కోసం..
ఆరోగ్యకరమైన సంతానం పుట్టేందుకు 23 నుంచి 28 ఏళ్ల వయస్సు చాలా అనుకూలం. గర్భం దాల్చేందుకు ముందుగానే ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవటం చాలా మంచిది. గర్భం దాలి్చన 13 వారాలలోపు న్యూకల్ ట్రాన్స్ ల్యూసెన్సీ (ఎన్‌టి) స్కాన్ చేయించాలి. డబుల్‌మార్కర్ టెస్ట్, క్రోమోజోన్ ఎనాలసిస్ టెస్ట్, షుగర్ టెస్ట్, రక్తహీనత టెస్ట్ చేయించాలి. 18 వారాల నుండి ఐరన్‌మాత్రలు, ఫోలిక్‌యాసిడ్, క్యాల్షియం మాత్రలు, మూడు, ఐదు నెలల్లో టీటీ ఇంజెక్షన్లు చేయించాలి.
– డాక్టర్ శ్రీహర్ష రావూరి, ఐవీఎఫ్ స్పెషలిస్ట్, గుంటూరు
అందుబాటులో ఆధునిక వైద్యం
నూతన వైద్య విధానంలో సంతానలేమి సమస్యతో వచ్చిన వారు ఆస్పత్రిలో వైద్యం పొందిన పిదప సంతానం పొందుతున్నారు. గుంటూరు నగరంలో అత్యాధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఐవీఎప్ చికిత్సల్లో ప్రస్తుతం రొ»ొటిక్ ఇక్సీ విధానం, నానో రోబోస్ సాంకేతిక పరిజ్ఞానం కూడా పలు దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా కచ్చితత్వం ఎక్కువగా ఉంది.
–డాక్టర్ బూసిరెడ్డి దీప్తిరెడ్డి, స్త్రీ,ప్రసూతి, సంతాన సాఫల్య వైద్య నిపుణురాలు, గుంటూరు
ఐవీఎఫ్‌తో త్వరగా సంతానం
సంతానలేమి సమస్య ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో 300 మంది గైనకాలజిస్టులు ఉన్నారు. సంతాన సాఫల్య కేంద్రాలు 11 ఉన్నాయి. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతి రోజు ఒకరు సంతాన లేమి చికిత్స కోసం సంప్రదిస్తున్నారు. వివాహమైన ఏడాదిలోపు గర్భం దాల్చకపోతే వెంటనే ఐవీఎఫ్ నిపుణులను సంప్రదించటం ద్వారా త్వరగా సంతానం పొందే అవకాశం ఉంది.
– డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, సీనియర్ ఐవీఎఫ్ స్పెషలిస్ట్, గుంటూరు.


