ఉచిత వైద్యం అందించాల్సిందే | Telangana High Court issues directive to Basavatarakam Hospital regarding treatment for poor cancer patients | Sakshi
Sakshi News home page

ఉచిత వైద్యం అందించాల్సిందే

Jul 22 2026 5:35 AM | Updated on Jul 22 2026 5:35 AM

Telangana High Court issues directive to Basavatarakam Hospital regarding treatment for poor cancer patients

పేద కేన్సర్‌ రోగులకు వైద్యంపై బసవతారకం ఆస్పత్రికి హైకోర్టు ఆదేశం

25% ఉచిత ఇన్‌ పేషెంట్‌ కోటా కింద రోగికి చికిత్స ప్రారంభించాలని వెల్లడి 

నిబంధనలు అమలవుతున్నాయో లేదో డీఎంహెచ్‌వో నివేదిక ఇవ్వాలన్న కోర్టు

సాక్షి,హైదరాబాద్‌: ప్రభుత్వ భూమిని రాయి తీ ధరకు పొందిన ప్రైవేటు ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోలేవని హైకోర్టు తేల్చిచెప్పింది. రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్న ఓ పేద వితంతువుకు బసవతారకం ఇండో–అమెరికన్‌ కేన్సర్‌ హాస్పిటల్‌లో వెంటనే ఉచిత చికిత్స అందించాలని ఆదేశించింది. ప్రభుత్వం విధించిన 25% ఉచిత ఇన్‌పేòషేంట్‌ చికిత్స కోటా కింద బాధితురాలిని చేర్చుకుని రుసుములు వసూలు చేయకుండా చికిత్స ప్రారంభించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు.

అలాగే ఆ నిబంధనలు నిజంగా అమలవుతున్నాయా.. లేదా.. అనే అంశంపై డీఎంహెచ్‌వో పర్యవేక్షించి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ.. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన బాలె భాగ్యమ్మ రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నారు. కరీంనగర్‌లోని వైద్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని బసవతారకం కేన్సర్‌ హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించారు. ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్న తర్వాత తన వ్యాధి ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో లేదని, చికిత్సకు అవసరమైన మొత్తం ఖర్చును తానే భరించాలని ఆస్పత్రి యాజమాన్యం తెలిపిందంటూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు.  

ప్రభుత్వ భూమి ఇచ్చేటప్పుడే షరతులు 
పిటిషనర్‌ తరఫున న్యాయవాది మల్లారెడ్డి గాడిపల్లి, సీనియర్‌ న్యాయవాది గండ మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. 1989లో ప్రభుత్వం బంజారాహిల్స్‌లోని 7.35 ఎకరాల ప్రభుత్వ భూమిని బసవతారకం కేన్సర్‌ ఫౌండేషన్‌కు రాయితీపై లీజుకు ఇచి్చందన్నారు. ఆ సమయంలో ఆస్పత్రి 25 % ఇన్‌పేషెంట్‌ పడకలను పేద రోగులకు ఉచితంగా కేటాయించాలని, 40% ఔట్‌పేషెంట్‌ సేవలనూ ఉచితంగా అందించాలనే షరతులు విధించిందని తెలిపారు.

ఈ షరతుల అమలును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం 2022లో జీవో 80 జారీ చేసి ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. తాము ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స కోరడం లేదని, ప్రభుత్వ భూమిని రాయితీపై పొందినందుకు ప్రతిఫలంగా ఆస్పత్రిపై ఉన్న 25 శాతం ఉచిత చికిత్స బాధ్యతను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామన్నారు. పిటిషనర్‌ జూలై 15న సంబంధిత అధికారులకు ఈ మేరకు వినతిపత్రాలిచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. 

కోర్టు అత్యవసర జోక్యం: వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్‌ కేన్సర్‌తో బాధపడుతూ తక్షణ వైద్య సహా యం అవసరమైన పరిస్థితిలో ఉన్నారని గుర్తించి, ఈ దశలో చికిత్స ఆలస్యం అయితే తీవ్ర పరిణామాలు తలెత్తే అవకాశం ఉన్నందున, తుది విచారణ పూర్తయ్యే వరకు వేచి ఉండకుండా మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. భాగ్యమ్మను వెంటనే ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స ప్రారంభించాలని, కన్సల్టేషన్, పరీక్షలు, కీమో థెరపీ, శస్త్రచికిత్స, రేడియోథెరపీ, మందులు, ఆస్పత్రిలో చేరిక తదితర అన్ని వైద్య సేవలను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అందించాలని బసవతారకం ఆస్పత్రిని ఆదేశించారు. 

రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే చాన్స్‌
ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఒక్క బాధితురాలికే పరిమితం కాకుండా ఇతరులకు, అలాగే వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు తీసుకున్న లేదా ఇతర రాయితీలు పొందిన ప్రైవేటు ఆస్పత్రులకు కూడా వర్తిస్తాయా? ఇవన్నీ పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాయా.. లేదా? అనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉందని న్యాయవర్గాలు అంటున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement