కర్ణాటక: ఓ కోతి తీవ్ర విషాదానికి కారణమైంది. చిక్క తాలూకా పరిధిలోని పెరేసంద్ర గ్రామంలో శశికళ (11) అనే బాలిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనారోగ్యంతో చనిపోగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకులు, గ్రామస్తులు ధర్నా చేశారు. వివరాలు.. నవీన్, చంద్రిక దంపతుల కుమార్తె శశికళ ఇంటి ముందు టిఫిన్ తింటుండగా ఓ కోతి టిఫిన్‌ను లాక్కుంది. భయపడిన బాలిక ఇంట్లోకి పారిపోయి నీళ్లు తాగుతూ హఠాత్తుగా పడిపోయింది. తల్లిదండ్రులు పెరేసంద్ర పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ఇక్కడ ఆక్సిజన్ వసతి లేదు, చిక్కబళ్లాపురానికి పిలుచుకుపోవాలని వైద్యులు సూచించారు. అక్కడికి తీసుకెళ్తుండగా పాప దారిలోనే కన్నుమూసింది.
వైద్యం చేసి ఉంటే బతికేది
ఆక్రోశానికి గురైన కుటుంబీకులు, గ్రామస్తులు పెరేసంద్ర ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ సొంత గ్రామంలో ఆస్పత్రిలో కనీస సౌలభ్యాలు లేకుంటే ఎలా అని నిలదీశారు. సమాజ సేవకులు సందీప్‌రెడ్డి మాట్లాడుతూ సమయానికి ఆక్సిజన్, వైద్యం అంది ఉంటే పాప బతికేది అన్నారు. డిహెచ్‌ఓ మహేశ్‌కుమార్ నిరసనకారులతో చర్చించారు, 20 రోజులలో సమస్యలను సరిదిద్దుతామని, డాక్టర్‌ను రెండు రోజులలో నియమిస్తామని హామీ ఇచ్చారు. ఎడిసి భాస్కర్, డీఎస్పీ ప్రకాశ్ తదితరులు తల్లిదండ్రులకు నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు.


