పిల్లల కథ
ఒక అడవిలో ఎలుగుబంటి నివసించేది. అది అడవిలోని జంతువులన్నింటికీ వైద్యం చేసే గొప్ప వైద్యుడు. రకరకాల ఆకులు, వేర్లు, మూలికలతో అది అద్భుతమైన మందులు తయారు చేసేది. తనకు కావాల్సిన కొన్ని అరుదైన ఔషధాల కోసం ఎలుగుబంటి తరచుగా పొరుగున ఉన్న అడవికి వెళ్తుండేది. అక్కడ తన మిత్రుడైన కోతిని కలుసుకోవడం దానికి ఎంతో ఇష్టం.
ఆ కోతి కూడా గొప్ప వైద్యుడు కావడంతో, తన ఇంటి వెనుక ఒక పెద్ద ఔషధ వనాన్ని పెంచుతోంది. ఆ తోటలో లేని మొక్క అంటూ లేదు. ఒకరోజు ఎలుగుబంటికి అత్యవసరంగా కొన్ని మూలికలు అవసరమయ్యాయి. వెంటనే అది బయలుదేరి కోతి ఇంటికి చేరుకుంది. మిత్రుడిని చూడగానే కోతి ఎంతో సంతోషించింది.
‘మిత్రమా! ఏమైంది? విచారంగా ఉన్నావు ఎందుకు? నా సహాయం ఏమన్నా కావాలా?’ అని కోతి అడిగింది. దానికి ఎలుగుబంటి ‘మిత్రమా! మా అడవిలో ఒక వ్యాధి వ్యాపిస్తోంది. దానికి కొన్ని ప్రత్యేకమైన మూలికలు కావాలి’ అని కోరింది. కోతి నవ్వుతూ, ‘దానిదేముంది! మన తోటలో నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. వెళ్లి నీకు నచ్చినవి తీసుకో’ అని చెప్పింది.
కానీ ఎలుగుబంటి తోటలోకి అడుగు పెట్టగానే దిగ్భ్రాంతికి గురైంది. అక్కడ మొక్కలన్నీ ఎవరో తొక్కినట్లు నలిగిపోయి ఉన్నాయి. చిన్న చిన్న మొక్కలన్నీ నేలమట్టమై ఉన్నాయి. ఎలుగుబంటి తిరిగి వచ్చి కోతికి ఈ విషయం చెప్పింది. కోతి పరిగెత్తుకుంటూ వెళ్లి తన తోటను చూసుకుని కన్నీళ్లు పెట్టుకుంది.
‘అయ్యో! నా ప్రాణం కంటే మిన్నగా పెంచుకున్న మొక్కలన్నీ ఇలా అయిపోయాయే! ఎవరో క్రూరులు కావాలనే నా తోటను నాశనం చేశారు’ అని కోతి ఏడ్చింది. ఎలుగుబంటి అక్కడి నేలను నిశితంగా పరిశీలించింది. నేలపై ఉన్న పెద్ద అడుగుజాడలను చూసి అది ఒక నిర్ణయానికి వచ్చింది.
‘మిత్రమా, ఏడవకు. ఈ అడుగుజాడలను చూస్తుంటే ఇది ఒక ఏనుగు చేసిన పని అని అర్థమవుతోంది’ అని ఎలుగుబంటి చెప్పింది. కానీ కోతి ఆ మాటలను అస్సలు ఒప్పుకోలేదు. ‘కాదు మిత్రమా! మా అడవిలోని ఏనుగు చాలా మంచిది. అది అందరికీ సహాయం చేస్తుంది. అది ఇంతటి అన్యాయం ఎప్పటికీ చేయదు’ అని వాదించింది.
నిజం తెలుసుకోవడానికి అవి రెండూ కలిసి అడవిలోకి బయలుదేరాయి. అవి నది ఒడ్డుకు చేరుకోగానే అక్కడ ఏనుగు నీళ్లు తాగుతూ కనిపించింది. ఏనుగు కాళ్లకు నలిగిపోయిన ఆకులు, పువ్వులు అతుక్కుని ఉండటం కోతి గమనించింది. తన తోటలోని ఔషధ మొక్కలన్నింటినీ తొక్కి నాశనం చేసింది, తొండంతో పీకింది ఏనుగేనని కోతి, ఎలుగుబంటి గ్రహించాయి. అప్పుడు ఎలుగుబంటి కోతి వైపు తిరిగి గంభీరంగా ఇలా అంది, ‘చూడు మిత్రమా! ఒకరిలో ఒక మంచి గుణం ఉన్నంత మాత్రాన, వారిలో చెడు గుణాలు ఉండవని అనుకోవడం మన పొరపాటే.’
దూరంగా నది ఒడ్డున ఒక కొంగ ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నట్లు నిలబడి వాటికి కనిపించింది. ఎలుగుబంటి ఆ కొంగను చూపిస్తూ, ‘ఆ కొంగను చూడు, అది ఎంత శాంతంగా కనిపిస్తోంది! కానీ లోపల క్రూరమైన ఆలోచనతో చేపల కోసం వేచి చూస్తోంది’ అని చెప్పింది.
అదే సమయంలో ఒక చిన్న కుందేలు ఏడుస్తూ అక్కడికి వచ్చింది. ఏనుగును చూసి భయపడుతూనే, ‘గజరాజా! నిన్న నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నీ భారీ పాదాల కిందపడి మా ఇల్లు కూలిపోయింది. మా పిల్లలు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. నువ్వు కనీసం వెనక్కి కూడా చూడకుండా వెళ్ళిపోయావు’ అని ఫిర్యాదు చేసింది.
కుందేలు మాటలు విన్న ఏనుగుకు ఒక్కసారిగా తలవంపులయ్యింది. తన శక్తి.. బలంతో ఇతరులను రక్షిస్తున్నానన్న గర్వంలో, తన కదలికల వల్ల ఇతరులకు కలుగుతున్న నష్టాన్ని తాను గమనించలేదని ఏనుగు గ్రహించింది. అజాగ్రత్త కూడా ఒక పెద్ద తప్పేనని దానికి అర్థమైంది.
వెంటనే ఏనుగు కోతి దగ్గరకు నడుచుకుంటూ వచ్చింది. ‘నన్ను క్షమించు మిత్రమా! నేను కావాలని నీ తోటను నాశనం చేయలేదు. కానీ నా నడక వల్ల నీకు ఇంత నష్టం జరుగుతుందని నేను ఊహించలేదు. నా అజాగ్రత్త వల్ల జరిగిన ఈ తప్పుకు నేను ఎంతో విచారిస్తున్నాను’ అని వేడుకుంది.
కోతి ఏనుగు పశ్చాత్తాపాన్ని చూసి మనసు మార్చుకుంది. ఎలుగుబంటి చెప్పినట్లు ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని, లోపల ఉండే అసలు గుణం బయటపడే వరకు ఎవరినీ అంచనా వేయకూడదని గ్రహించింది. ఆ రోజు నుండి ఏనుగు అడవిలో నడుస్తున్నప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం ప్రారంభించింది. - పైడిమర్రి రామకృష్ణ


