కొత్త కథలు వింటున్న తెలుగు హీరోలు
తెరపైకి సరికొత్త కాంబినేషన్స్
సినిమాలో కొత్తదనం లేక పోతే ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదు. దీంతో హీరోలందరూ కొత్త కథల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఒక్క కథను ఓకే చేయడం కోసం పదుల సంఖ్యలో కథలు వింటున్నారు. ఇటు దర్శకులు, రచయితలు కూడా తమ కలానికి మరింత పదును పెట్టి విభిన్నమైన కథలను సిద్ధం చేస్తున్నారు. దీంతో సరికొత్త కాంబినేషన్స్ పుట్టుకొస్తున్నాయి. మరి... ఏ హీరోకి ఏ దర్శకుడు కథ చె΄్పారు? ఏ దర్శకుడు ఏ హీరోను మెప్పించారు? తెలుగులో రాబోతున్న కొత్త కాంబినేషన్స్ ఏమిటి? అన్న విశేషాలపై ఓ లుక్ వేయండి.
సంక్రాంతి తర్వాతే..!
హీరో వెంకటేశ్ వరుస కథలు వింటున్నారు. యువ రచయిత నందు, తరుణ్ భాస్కర్ చెప్పిన కథలను ఆల్రెడీ విన్నారు వెంకటేశ్. అయితే ఈ కథలతో సినిమాలు చేయాలని ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఇదే స్పీడ్‌లో వెంకటేశ్ రీసెంట్‌గా మరో కథ విన్నారట. ‘బింబిసార’ చిత్రంతో దర్శకుడిగా తొలి విజయాన్ని అందుకుని, రెండో సినిమాయే చిరంజీవితో ‘విశ్వంభర’ తీసిన మల్లిడి వశిష్ట ఇటీవల వెంకటేశ్‌కు ఓ కథ వినిపించారట. ఈ సినిమా చేసేందుకు వెంకటేశ్ సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట.
ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబరు 47’ సినిమాలో హీరోగా నటిస్తూ, బిజీగా ఉన్నారు వెంకటేశ్. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను త్వరితగతిన పూర్తి చేయాలనే సంక్పల్పంతో ఉన్నారట ఈ సీనియర్ హీరో. అలాగే ‘ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం’ ‘మన శంకర వర ప్రసాద్’ (ఇందులో చిరంజీవి హీరో) వంటి హిట్ చిత్రాలను తనకు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడితో వెంకటేశ్ ఓ సినిమా చేస్తారు.
వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. సో... వెంకీ ఇమ్మిడియట్ సినిమా ఇదే అవుతుంది. ఈ నెల 20 తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ మరో హీరోగా నటించనుండగా కీర్తీ సురేష్, కృతీశెట్టి హీరోయిన్స్‌గా నటిస్తారు. ఇక ఈ చిత్రానికి ‘జనవరి 13న విడుదల’ అనే ఓ క్రేజీ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఇలా తన తర్వాతి ప్రాజెక్ట్ కూడా లైన్‌లో ఉండటంతో, వెంకీ తన తదుపరి సినిమాను సంక్రాంతి పండగ తర్వాతనే ఫైనలైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే కథలు మాత్రం వింటున్నారు. ఈలోపు వెంకీని ఇంప్రెస్ చేసి, ఆయనతో సినిమా చేసే చాన్స్‌ను ఏ దర్శకుడు దక్కించుకుంటారో చూడాలి.
నెక్ట్స్ ఎవరు?
రాజమౌళి డైరెక్షన్‌లోని ‘వారణాసి’ చిత్రంతో మహేశ్‌బాబు ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ చేయాల్సి ఉంది. దీంతో అనుకున్నట్లుగానే ఏప్రిల్ 7నే సినిమాను రిలీజ్ చేయాలని, ఇది జరగాలంటే ఈ ఏడాది ఆగస్టులోపే షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట రాజమౌళి. ఇలా ‘వారణాసి’ సినిమా షూటింగ్ కాస్త అటూ ఇటూ అయినా ఈ ఏడాదే ఈ సినిమా షూటింగ్ నుంచి ఫ్రీ అవుతారు మహేశ్‌బాబు.
కాగా, ఈ సినిమా తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకూడదని మహేశ్‌బాబు అనుకుంటున్నారట. ఈ సినిమా రిలీజైన వెంటనే తన తదుపరి సినిమాను పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట మహేశ్. ఇందుకు తగ్గట్లుగానే ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారట. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్‌లతో పాటు బుచ్చిబాబు సానా చెప్పిన స్టోరీ లైన్స్‌ను మహేశ్‌బాబు విన్నారని సమాచారం. ‘వారణాసి’ సినిమా రిలీజైన తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేయాలనే విషయంపై మహేశ్‌బాబు ఓ స్పష్టతకు వస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మోస్ట్‌లీ సందీప్ రెడ్డి వంగాతోనే మహేశ్‌బాబు సినిమా ఉండొచ్చని భోగట్టా.
ముందు ఎవరు?
హీరో రవితేజ కాస్త స్పీడ్ పెంచాలనుకుంటున్నారు. రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’. ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే తన నెక్ట్స్ సినిమాలను ఖరారు చేసుకోవాలని అనుకుంటున్నారట రవితేజ. ఇందులో భాగంగానే దర్శకుడు వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి చెప్పిన కథలను రవితేజ విన్నారని తెలిసింది. ముందుగా హసిత్ గోలి కథ వినిపించారు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ చెప్పిన కథ విన్నారట రవితేజ.
ఈ రెండు కథలకూ ఇంప్రెస్ అయినప్పటికీ ముందుగా వివేక్ ఆత్రేయ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లాలని రవితేజ నిర్ణయించుకున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని తెలిసింది. ఈ సినిమా ప్రారంభమైన మరికొన్ని రోజులకే హసిత్ గోలీ సినిమానూ సెట్స్‌పైకి తీసుకు వెళ్లాలని రవితేజ ΄్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఇలా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్‌ను సమాంతరంగా ముందుకు తీసుకువెళ్లాలని రవితేజ అనుకుంటున్నారట. ఈ రెండు సినిమాలూ వచ్చే ఏడాదే రిలీజ్ అవుతాయని ఊహించవచ్చు. ఇక రవితేజ హీరోగా హసిత్ గోలి డైరెక్షన్‌లోని సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం.
కాస్త సమయం ఉంది..
‘ది ప్యారడైజ్’ ప్రపంచంలో తీరిక లేకుండా ఉన్నారు హీరో నాని. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూ΄÷ందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు సుజిత్‌తో ‘బ్లడీ రొమియో’ అనే ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామా సినిమా చేయనున్నారు నాని. ఇక రెండు సినిమాలు ఇలా ఉండగానే... నిర్మాతగా తనకు ‘కోర్టు’ సినిమా రూపంలో ఓ బ్లాక్‌బస్టర్‌ను అందించిన రామ్ జగదీష్ చెప్పిన కథను నాని ఓకే చేశారని తెలిసింది.
కానీ ఈ కథలో నానీయే హీరోగా నటిస్తారా? లేక నిర్మాణ బాధ్యతల వరకే పరిమితం అవుతారా? అనేది చూడాలి. అలాగే ఇటీవల ‘బ్యాండ్ మేళం’ సినిమా తీసిన సతీష్ జవ్వాజి చెప్పిన కథను కూడా విన్నారు నాని. ఈ కథను ఆల్మోస్ట్ ఓకే చేశారు. అయితే ఈ కథలో తానే హీరోగా నటించాలని నాని భావిస్తున్నారని, కాక పోతే కథకు ఇంకాస్త మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందని సతీష్‌కు నాని సూచించారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇప్పటికే రెండు సినిమాలను ఖరారు చేసుకున్న నాని,మరో రెండు సినిమాల కథలను కూడా ఓకే చేశారు.
మ్యూజికల్ లవ్‌స్టోరీ!
ప్రస్తుతం ‘వృషకర్మ’ సినిమాతో నాగచైతన్య బిజీ బిజీ. ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ఇది నాగచైతన్య కెరీర్‌లో 24వ చిత్రం. దీంతో తన కెరీర్‌లోని 25వ సినిమాను లవ్ జానర్‌లో చేయాలా? లేక యాక్షన్ జానర్‌లో చేయాలా? అనే సందిగ్ధంలో ఉన్నారట నాగచైతన్య. ఈ క్రమంలోనే దర్శకుడు కొరటాల శివ, బోయపాటి శ్రీను, శివ నిర్వాణ, ‘బెదురులంక 2012’ ఫేమ్ క్లాక్స్ చెప్పిన కథలను విన్నారట నాగచైతన్య.
అయితే రొటీన్ లవ్‌స్టోరీకీ కాస్త భిన్నంగా ఓ డిఫరెంట్ ప్రేమకథను చెప్పిన క్లాక్స్‌కు ముందుగా చాన్స్ ఇచ్చారని సమాచారం. ప్రజెంట్ ఈ కథకు సంబంధించిన తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట క్లాక్. ‘వృషకర్మ’ సినిమా రిలీజ్ తర్వాత, నాగచైతన్య 25వ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ‘దూత’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ ‘దూత చాప్టర్2’ షూటింగ్‌లోనూ త్వరలోనే పాల్గొనున్నారు నాగచైతన్య. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘దూత చాప్టర్ 2’తో తొలిసారిగా నిర్మాతగా మారారు నాగచైతన్య. ఈ సిరీస్‌కు శరత్‌మరార్ మరో నిర్మాత.
రెండు సంవత్సరాల తర్వాత
తొలి చిత్రం ‘ఉప్పెన’తో సూపర్ హిట్ అందుకున్నారు హీరో వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వైష్ణవ్ చేసిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాలను రాబట్ట లేక పోయాయి. వైష్ణవ్ గత చిత్రం ‘ఆది కేశవ’ 2023లో విడుదలైంది. ఆ తర్వాత మరో కొత్త సినిమా సైన్ చేయడానికి వైష్ణవ్ దాదాపు రెండు సంవత్సరాల సమయం తీసుకున్నారు. ఈ గ్యాప్‌లో వైష్ణవ్ ఎన్నో కథలు విన్నారని తెలిసింది. కానీ ఫైనల్‌గా సుధీర్‌బాబుతో ‘హంట్’ సినిమా తీసిన దర్శకుడు మహేశ్ సూరపనేని చెప్పిన కథ వైష్ణవ్‌ను ఇంప్రెస్
చేసిందట.
ఒకేసారి రెండు సినిమాలు
ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలు కనీసం రెండు సెట్స్‌పై ఉంటున్నాయి. ఇప్పుడు కూడా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజి, స్పిరిట్’ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ఈ రెండు సినిమాల చిత్రీకరణ ఈ ఏడాదే పూర్తవుతుంది. ‘ఫౌజీ’ సినిమా రిలీజ్‌ను ఈ ఏడాదే అనుకుంటున్నారు. ‘స్పిరిట్’ సినిమాను వచ్చే మార్చి 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే... మరో రెండు సినిమాలను సమాంతరంగా సెట్స్‌పైకి తీసుకువెళ్లాలని ప్రభాస్ భావిస్తున్నారట.
కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌తో ప్రభాస్ మూడు సినిమాలు చేయాల్సి ఉంది. వీటిలో ‘సలార్ 2’ ఒకటి అని తెలిసింది. అలాగే ప్రశాంత్ వర్మతో కూడా ప్రభాస్ ఓ మైథాలజీ సినిమా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ‘డ్రాగన్’తో ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టితో ‘జై హనుమాన్’ చేస్తూ ప్రశాంత్ వర్మ బిజీగా ఉన్నారు. కానీ వచ్చే ఏడాదికి ఈ ఇద్దరు దర్శకులు కాస్త ఫ్రీ అవుతారు. మరి... ప్రభాస్ తర్వాతి రెండు సినిమాలకు ఈ ఇద్దరు దర్శకులే డైరెక్షన్ చేస్తారా? లేక మరో దర్శకుడి పేరు ఏదైనా సడన్‌గా తెరపైకి వచ్చి, కొత్త కాంబినేషన్ సెట్ అవు తుందా? అనేది చూడాలి. ఏదీ ఏమైనా తన తర్వాతి సినిమాలపై ప్రభాస్ ఓ క్లారిటీతో ఉన్నారని సమాచారం.
అడవిలో పోరాటం
‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు రామ్‌చరణ్. ఇక మెల్లిగా చరణ్ ఫ్యాన్స్ చర్చంతా ఆయన తర్వాతి సినిమాపైనే జరుగుతోంది. ‘రంగస్థ్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను తనకు ఇచ్చిన సుకుమార్‌తో రామ్ చరణ్ తర్వాతి సినిమా ఉంటుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించనున్నాయి. ఈ ఏడాదే ఈ సినిమా సెట్స్‌కు వెళ్తుందని సమాచారం. అయితే ఇటీవల బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని ముంబైలో ఓ సందర్భంగా కలిశారట రామ్ చరణ్. దీంతో వీరి కాంబినేషన్‌లో సినిమా కన్ఫార్మ్ అనే టాక్ తెరపైకి వచ్చింది.
అయితే ఇదొక పీరియాడికల్ జంగిల్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా అని, ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించరని, కేవలం నిర్మాణం వరకు మాత్రమే పరిమితం అవుతారనే వార్తలు బాలీవుడ్‌లో వినిపించాయి. అలాగే ఈ సినిమాకు తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. మరోవైపు బాలీవుడ్‌లో ‘కిల్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు నిఖిల్ నగేష్ భట్‌తోనూ ఓ సినిమా విషయమై రామ్‌చరణ్ చర్చలు జరిపారని టాక్. అయితే ఈ అంశాలపై పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
– ముసిమి శివాంజనేయులు


