breaking news
Ficus plant
-
Sagubadi: కల్జివ్వ.. ప్రకృతి ప్రసాదించిన ఔషధ వృక్షం!
కల్జివ్వి పండ్లు మేడి పండ్ల ఆకారంలో, సైజులో చిన్నగా ఉంటాయి. ఈ చెట్లకు బండజువ్వి, జువ్వి అనే పేర్లు కూడా∙ఉన్నాయి. బండజువ్వి రకం ఎక్కువగా బండకొరుకులు, మొరం నేలలో, చెట్లపై గమనించవచ్చు. జువ్వి, కల్జివ్వి ఒకటే అంటారు. ఈ జాతిలో పొదలు, గుల్మాలు, చెట్లు ఉన్నాయి. వీటిలో ఇతరాలు పైకస్ అసినిన, పైకస్ ప్యూజెసెన్స్, ఉరోస్టిగ్మ టొమెన్ టోసం మొదలగునవి ఉన్నాయి. ఉనికి: పండ్లు జూన్–జులై నెలల్లో వస్తాయి. మేడి పండ్ల చెట్టులో వలెనే ఇందులో కూడా పూలు బయటికి కనపడవు. వీటిల్లో కూడా చీమలు, కందిరీగలు ఫలదీరకణకు దోహదపడతాయి. వీటి పూలను గాల్ ఫ్లవర్ అని అంటారు. ఈ చెట్ల పూలల్లో మూడు రకాలు ఉంటాయి. ఒకటి మొగ్గ, పొడవాటి కాడ ఆడ, కురుచ కాడ ఆడ పువ్వులు ఉంటాయి. ఈ చెట్టు దాదాపు 12 మీటర్ల ఎత్తు వరకు పెరగలదు. వీటి పక్క కొమ్మలకు నూగు పోచలుంటాయి. ఆకుల తొడిమ దగ్గర పండ్లు వస్తాయి. ఇవి మైదాన ప్రాంతాల్లో, అడవుల్లోనూ పెరుగుతాయి. ఇంచుమించు అన్ని నేలల్లో వస్తాయి. ఈ చెట్లు సామాన్యంగా సతతహరితంగా ఉంటాయి. కానీ కాలం అనుకూలించకుండా ఉంటే ఆకులు రాల్చుతుంది. ఈ చెట్లు ఎక్కువగా ఉష్ణమండలం, ఉప–ఉష్ణమండలం ప్రాంతంలో వీటి ఉనికి ఉంటుంది.కానీ ఇవి భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్లలో ఉన్నట్లు గుర్తించారు. భారత్లో మాత్రం అండమాన్, నికోబార్ దీవులు, బీహార్, మధ్య–దక్షిణ ప్రాంతాలు, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అడవుల్లో వీటి ఉనికి ఉంది. ముఖ్యంగా నల్లమల అడవులు వీటికి పెట్టింది పేరు. వీటిపై జరిగిన ప్రయోగాలు చాలా తక్కువ. వీటిని సాగుకు మరల్చితే లాభసాటిగా ఉంటుంది. ఆకులను మేకలు, పశువులు తింటాయి!వీటి ఆకులు మేకలు, పశువులు తింటాయి. కరువు కాలాల్లో వీటిని మేతగా వాడతారు. పండ్లు తింటారు. కలప అంత గట్టిగా ఉండదు, వంట చెరకుగా వాడుకోవచ్చు. మాను లావు ఉంటే దాన్ని పెట్టెల తయారీకి వాడవచ్చు. ముఖ్యంగా పండ్ల రవాణకు ఉపయోగపడుతుంది. రోడ్లకు ఇరు పక్కలా ఈ చెట్లను నాటవచ్చు. ఈ చెట్లు కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఆకులను రుబ్బగా వచ్చిన రసాన్ని బొగ్గలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. బెరుడును దంచగా వచ్చే గుజ్జును దెబ్బలకు, కోసుకుపోయిన చోట్ల రుద్దినట్లయితే అవి కొన్నిరోజుల్లో మానుతాయి. ఇప్పటికీ చెంచులు వైద్యంలో వాడుతున్నారు. ఈ జాతి మొక్కలను విత్తనం ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. బోన్సాయి (మరుగుజ్జు) మొక్కల పెంపకానికీ ఉపయోగించవచ్చు. ఈ జాతి పండ్లపై అనుకున్నంతగా పరిశోధనలు జరగలేదనవచ్చు.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఏభయ్యేళ్లు దిగుబడినిచ్చే ఏనుగు చెవి అంజీర చెట్లు!
మనకు అంజీర తెలుసు. కానీ, ఏనుగు చెవి అంజీర తెలీదు. అయితే, ఈ చెట్లు ఏడాది పొడవునా పోషకాలతో కూడిన అంజీర పండ్ల దిగుబడిని ఏభయ్యేళ్ల పాటు అందిస్తాయని యానాం వాస్తవ్యులైన అంజీర నిపుణులు డాక్టర్ జె. వి. సుధాకర్ చెబుతున్నారు. పోషకాల పరంగా ఎన్నో సుగుణాలతోపాటు మార్కెట్ విలువ కలిగిన ఏనుగు చెవి అంజీర చెట్లను తెలుగు రాష్ట్రాల రైతులు ప్రత్యేక పండ్ల తోటగా లేదా అంతర పంటగా లేదా పొలాల గట్లపైన పెంచుకోవచ్చని.. ఏడాది పొడవునా అంజీర పండ్ల దిగుబడితో నిరంతరాదాయం పొందవచ్చని ఆయన ‘సాగుబడి’కి తెలిపారు. చదవండి ఆయన మాటల్లోనే.. ఏనుగు చెవి అంజీర (శాస్త్రీయ నామం.. ఫైకస్ ఆరిక్యులేటా) పనస, మల్బరీ చెట్ల మాదిరిగానే మోరేసి కుటుంబానికి చెందినది. దీని పుట్టిల్లు హిమాలయాలు. ఆకులు పెద్దగా విశాలమైన ఏనుగు చెవి అంత, హృదయాకారంలో ఆకర్షణీయంగా ఉంటాయి. అందువల్లనే దీనికి ఏనుగు చెవి అంజీర అని పేరు వచ్చింది. లేత ఆకులు ఎరుపురంగులో ఉండి ముదిరిన తరువాత లేత ఆకుపచ్చ రంగులోకి మారతాయి. దీన్ని ప్రస్తుతం మన దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉద్యాన వనాల్లో ‘స్పెసిమన్’ అలంకరణ మొక్కగా వాడుతున్నారు. ఈ చెట్టు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కొండ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లోనూ ఏనుగు చెవి అంజీర చక్కగా పెరుగుతుంది. తేలిక నేలలు, తేమ గల నేలలు, సేంద్రియ కర్బనం ఎక్కువగా ఉండే నేలల్లో బాగా పెరుగుతుంది. విత్తనాల ద్వారా లేదా కాండచ్ఛేదనాల ద్వారా అంట్లుకట్టి నాటుకోవచ్చు. నాటిన 4–5 ఏళ్ల నుంచి కాపు మొదలవుతుంది. నాటిన 40–50 ఏళ్ల వరకు దిగుబడినిస్తాయి. పండ్లు నేరుగా కాండం మీద కింది నుంచి పై వరకు గుంపులుగా, గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఏడాది పొడవునా పండ్ల కాపు వస్తుంది. తాజా పండ్లను ఎప్పటికప్పుడు అమ్ముకుంటూ ఏడాది పొడవునా రైతులు ఆదాయం పొందవచ్చు. పక్వానికి వచ్చిన పండు 30–100 గ్రాముల బరువుతో ఎరుపు రంగు నుంచి ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. ప్రస్తుతం ఇవి ఎక్కువగా తమిళనాడులోని సేలం, కేరళలోని త్రిస్సూర్, తిరువనంతపురంలలో సాగవుతున్నాయి. మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. కిలో రూ. 200–300 వరకు పలుకుతోంది. పోషకాలు అధికంగా ఉండటం వల్ల తమిళనాడు, కేరళల్లో గర్భిణు ఈ పండ్లను ఎక్కువగా తింటున్నారు.పిండిపదార్థం, చక్కెర, బి విటమిన్లు, కె విటమిన్, ఖనిజలవణాలైన కాల్షియం, మెగ్నీషియం, మాంగనీసు, జింక్ తదితర పోషకాలు ఈ పండులో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సాధారణ అంజీర పండులో ఉండే పోషక గుణాలన్నీ ఏనుగు చెవి అంజీరలోనూ ఉన్నాయి. తాజా ఫలాలను పైన పొరను తొలగించి తినవచ్చు. పండ్ల రసం, జామ్ చేసుకోవచ్చు. పండ్లతోపాటు దీని ఆకులో కూడా ఔషధ గుణాలున్నాయి. గాయాలు, పుండ్లు మానడానికి, విరేచనాలను అరికట్టడానికి వాడుతున్నారు. మధుమేహ వ్యాధి నివారణకు ఈ ఆకులను మణిపూర్లో వాడుతున్నారు. మలేసియాలో బీపీ తగ్గించడానికి ఈ ఆకులు వాడుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఆకులను భోజనానికి విస్తరిగా వాడుతున్నారు. అదేవిధంగా ఈ ఆకులు పశువుల మేతగా కూడా మంచి ఫలితాలనిస్తాయి. ఈ మొక్కల నుంచి వచ్చే తెల్లని పాల వంటి లేటెక్స్ ద్రవానికి ఔషధ విలువలున్నాయి. ఈ మొక్కలను ఏటవాలుగా ఉన్న భూముల్లో వేసినట్టయితే భూమి కోతను సమర్థవంతంగా అరికట్టవచ్చు. ఇన్ని సుగుణాలు, మార్కెట్ విలువ గల ఈ మొక్కలను తెలుగు రాష్ట్రాల రైతులు ప్రత్యేక ఫల పంటగా, అంతర పంటగా లేదా పొలాల్లో, గట్ల మీద పెంచుకుంటే రైతులకు మంచి ఆదాయం వస్తుంది. కడియం తదితర ప్రాంతాల్లోని నర్సరీల్లో ఏనుగు చెవి అంజీర మొక్కలు అందుబాటులో ఉంటాయి. డాక్టర్ జె.వి.సుధాకర్, సహాయ ఆచార్యులు, యానాం కళాశాల (92442 14784 నంబరులో సంప్రదించవచ్చు) -
మర్రి.. కనువిందేమరి
‘ఇంతింతై.. వటుడింతై’ అన్న చందంగా పాఠశాల భవనంపై పెరిగిన ఓ మొక్క.. నేడు ఓ చెట్టుగా రూపాంతరం చెందింది. మండలంలోని ఎన్కేపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలకు గతంలో నిర్మించిన భవనం శిథిలమవడంతో ఉపయోగించకుండా వదిలేశారు. ఇదే ఆవరణలో పాఠశాలకు కొత్తగా వేరే గదులు నిర్మించడంతో వాటిని వినియోగిస్తున్నారు. ఈ వృథా పాఠశాల భవాన్ని తొలగించకుండా అలాగే వదిలేయడంతో అప్పట్లో మట్టితో నిర్మించిన ఈ భవనంపై ఓ మర్రి మొక్క పెరిగింది. అది నేడు పెద్దదై ఏర్లు.. ఊడలు రావడంతో చిన్న సైజూ వృక్షాన్ని తలపిస్తోంది. - మొయినాబాద్ రూరల్


