ఇంటి పంట 12
మిద్దెతోటలు, ఇంటిపంటల్లో తవుడు (రైస్ బ్రాన్)ను మొక్కల పెంపకంలో అద్భుతమైన ఎరువుగా ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. తవుడు మొక్కల పెరుగుదలకు, నేల స్వభావాన్ని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. తవుడులో విటమిన్ బి, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
తవుడును నేరుగా మట్టిలో చల్లడం లేదా కంపోస్ట్‌లో కలపడం వల్ల అది నెమ్మదిగా కుళ్ళి మొక్కలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.
ఇది మట్టిలోని మేలు చేసే సూక్ష్మజీవుల పెరుగుదలకు దోహదపడుతుంది. మొక్కలకు బలం చేకూరుతుంది.
తవుడును నీటిలో నానబెట్టి, పులియబెట్టి మొక్కలకు వాడవచ్చు. ఇది మొక్కలకు ఒక అద్భుతమైన సహజ ఎరువుగా, నేల సారాన్ని పెంచే బూస్టర్‌గా పనిచేస్తుంది.
కుళ్లే ప్రక్రియలో తవుడులో ఉండే సంక్లిష్ట కర్బన పదార్థాలు విచ్ఛిన్నమై, మొక్కలకు సులభంగా అందే నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలుగా మారుతాయి.
తవుడు ద్రావణంలో లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా, ఇతర మేలు చేసే సూక్ష్మజీవులు పెరుగుతాయి. ఇవి నేలలోని హానికర వ్యాధికారకాలను అరికట్టి, వేర్ల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
తవుడు ద్రావణం నేల నిర్మాణాన్ని మెరుగుపరిచి, వానపాములు వంటి జీవులను ఆకర్షిస్తుంది, తద్వారా నేల గుల్లగా మారుతుంది.
ఈ ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల మొక్కలకు చీడపీడల నుండి రక్షణ లభిస్తుంది, మొక్కల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మిశ్రమం నుండి పుల్లటి లేదా మంచి వాసన వచ్చినప్పుడు అది తయారైనట్లు గుర్తు. ఒకవేళ కుళ్ళిన వాసన వస్తే అది వాడకూడదు.
తయారైన ద్రావణాన్ని 1 లీటరు ద్రావణానికి 10 లీటర్ల నీరు కలిపి మొక్కల మొదళ్లలో పోయవచ్చు లేదా ఆకులపై పిచికారీ చేయవచ్చు.
దీన్ని నెలకు ఒకటి లేదా రెండుసార్లు వాడితే సరిపోతుంది. అతిగా వాడితే మట్టి గట్టిపడే అవకాశం ఉంటుంది.
తవుడు ఫెర్మెంటేషన్ నీరు పూల (గులాబీ, మల్లె, జాజి, మందార..) మొక్కలకు చాలా బాగా పనిచేస్తుంది. తవుడులోని భాస్వరం, పొటాషియం వల్ల పూల సైజు పెరుగుతుంది అలాగే ఎక్కువ మొగ్గలు కూడా వస్తాయి.
ఇందులోని పోషకాలు పూలకు మంచి రంగును, సువాసనను ఇస్తాయి.
ముఖ్యంగా గులాబీ మొక్కల మొదళ్లలో ఈ ద్రావణాన్ని పోస్తే వేర్లు దృఢంగా మారి, మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది.
కూరగాయల (టమాటో , మిరప , వంగ..) మొక్కలకు వాడితే నత్రజని అందుతుంది. ఆకులు ముదురు పచ్చగా మారి, కిరణజన్య సంయోగ క్రియ బాగా జరుగుతుంది.
టమాటా, మిర్చి వంటి మొక్కల్లో పూత రాలడం తగ్గుతుంది. కాయలు నాణ్యంగా, రుచిగా వస్తాయి.
తవుడు ద్రావణాన్ని ఆకులపై స్ప్రే చేయడం వల్ల ఆకు ముడత వంటి సమస్యలు తగ్గుతాయి.
మనం తయారు చేసుకున్న ద్రావణం గాఢత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 1 లీటరు ద్రావణానికి కచ్చితంగా 10 లీటర్ల నీటిని కలిపి వాడాలి. లేదంటే మొక్కల వేర్లు దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఎప్పుడైనా ఎరువులను ఉదయం పూట లేదా సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత ఇస్తే మొక్కలు త్వరగా గ్రహిస్తాయి.
తవుడు ద్రావణాన్ని 15–20 రోజుల లోపు వాడేయడం మంచిది. ఎక్కువ రోజులు ఉంచితే దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది.
తవుడు నీటిలో ఉండే అమినో ఆమ్లాలు మొక్కలు త్వరగా కొమ్మలు వేయడానికి సహకరిస్తాయి. మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు (4–5 ఆకులు ఉన్నప్పుడు) దీన్ని ఇస్తే ఎదుగుదల బాగుంటుంది.

మొక్క కాండం దృఢంగా మారడానికి, ఆకులు వెడల్పుగా పెరగడానికి ఇందులో ఉండే నత్రజని ఎంతో అవసరం.
కుండీలో ఉండే మట్టి గట్టిపడకుండా, ఈ ద్రావణం మట్టిని గుల్లగా ఉంచుతుంది. దీనివల్ల వేర్లకు గాలి ఆడి మొక్క చురుగ్గా పెరుగుతుంది.
తవుడు నీటిని పులియబెట్టేటప్పుడు అందులో కొంచెం పుల్లటి మజ్జిగ కూడా కలిపితే, అది మరింత శక్తివంతంగా మారుతుంది. ఇది మొక్కలకు ‘గ్రోత్ ప్రమోటర్’లా పనిచేస్తుంది.
ఈ ద్రావణాన్ని వారానికి ఒకసారి కాకుండా, 15 రోజులకు ఒకసారి మాత్రమే వాడాలి. మిగిలిన రోజుల్లో సాధారణ నీటిని పోయవచ్చు.
తవుడుతో తయారు చేసిన ఫెర్మెంటేషన్ నీరు వాడటం మొదలుపెట్టిన 15 రోజుల్లోనే కూరగాయల మొక్కల ఆకుల్లో మంచి మెరుపును గమనించవచ్చు.
వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేస్తున్నట్లయితే, అందులో అప్పుడప్పుడు కొంచెం ఎండు తవుడు చల్లవచ్చు. ఇది వ్యర్థాలు త్వరగా కుళ్లి ఎరువుగా మారడానికి సహాయపడుతుంది. వంటింటి వ్యర్థాల నుండి వచ్చే చెడు వాసనను అరికట్టడానికి తవుడు బాగా పనిచేస్తుంది.
తవుడును కంపోస్ట్ బిన్ లోని పొరల మధ్య చల్లడం వల్ల అందులోని సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల కంపోస్ట్ తయారయ్యే సమయం తగ్గుతుంది.
ఒకవేళ కిచెన్ వేస్ట్ వల్ల బిన్‌లో తేమ ఎక్కువగా ఉంటే, కొంచెం పొడి తవుడు చల్లితే అదనపు తేమను పీల్చుకుని, ముక్కిపోయిన వాసన రాకుండా చేస్తుంది.
కంపోస్ట్ బిన్ పొడిగా ఉంటే లోపల సూక్ష్మజీవుల చర్య మందగిస్తుంది. దీనివల్ల వ్యర్థాలు ఎరువుగా మారడానికి చాలా సమయం పడుతుంది. కంపోస్ట్ పక్రియ వేగంగా జరగాలంటే అది తడిసిన స్పాంజిలా (తేమగా మరీ నీరు కారకుండా) ఉండాలి. (బిన్ లోని మట్టిని లేదా వ్యర్థాలను చేత్తో పట్టుకుని పిండినప్పుడు, ఒకటి రెండు చుక్కల నీరు వస్తే తేమ సరిగ్గా ఉన్నట్లు).
తవుడును బెల్లం నీటితో కలిపి, పులియబెట్టి కంపోస్ట్ బిన్‌లో కొద్దిగా చల్లినట్లు వేస్తే వ్యర్థాలు చాలా త్వరగా విచ్ఛిన్నమవుతాయి. తవుడు ఫెర్మెంటేషన్ నీరు కంపోస్ట్ బిన్ కు ఒక ‘బూస్టర్‘లా పనిచేస్తుంది.
తవుడును నీటిలో నానబెట్టి ఫెర్మెంటేషన్ చేసిన తర్వాత మిగిలిన తవుడు పిప్పిని పారవేయకుండా, కంపోస్ట్ బిన్‌లో కలిపితే మంచి ఎరువుగా మారుతుంది.
తవుడును పులియబెట్టిన నీటిలో, కూరగాయల తొక్కలు నానబెట్టిన నీటిని కూడా కలిపి మొక్కలకు పోయవచ్చు. దీనివల్ల మొక్కకు అవసరమైన అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అందుతాయి.
తవుడు రైస్ మిల్లులో దొరుకుతుంది. ఒక్కసారే ఎక్కువ కొనవద్దు, పురుగులు పడతాయి. నెలకు 1 లేక 2 కేజీలు తీసుకుని వాడుకుంటే సరిపోతుంది. ఆది వాడిన తరువాత మళ్లీ తెచ్చుకోవచ్చు.
తయారీ విధానం..
ఒక పెద్ద ΄్లాస్టిక్ బకెట్‌లో 10 లీటర్ల నీరు తీసుకుని, అందులో కేజీ తవుడు మరియు బెల్లం వేసి బాగా కలపాలి. తవుడు డైరెక్ట్ గా నీటిలో వేయవచ్చు లేదా ఒక కాటన్ క్లాత్ లో మూట కట్టి వేయవచ్చు.
బకెట్ పై పలచని బట్ట లేదా కొద్దిగా మూత పెట్టి నీడలో ఉంచాలి. ఎండ తగిలితే లోపల ఉన్న మేలు చేసే బ్యాక్టీరియా చనిపోయే అవకాశం ఉంటుంది.
3 నుండి 5 రోజుల పాటు పులియబెట్టాలి. రోజుకు రెండుసార్లు (ఉదయం, సాయంత్రం) ఒక కర్రతో మిశ్రమాన్ని బాగా కలపాలి . దీనివల్ల గాలి ఆడి మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.
5 రోజుల తర్వాత ఆ నీటిని వడకట్టి తవుడు పిప్పిని వేరు చేయాలి. ఈ తవుడు పిప్పి ని కంపోస్ట్ బిన్ లో వేయవచ్చు.
తయారు చేసిన ద్రావణం చాలా గాఢంగా ఉంటుంది, కాబట్టి 1 లీటరు తవుడు ద్రావణానికి 10 లీటర్ల సాధారణ నీటిని కలిపి పలచగా చేయాలి.
అంటే, తయారు చేసిన 10 లీటర్ల ద్రావణంతో మొత్తం 100 లీటర్ల ఎరువును సిద్ధం చేసుకోవచ్చు.
ఎక్కువ మొక్కలు ఉంటే ఈ 100 లీటర్ల నీటిని అన్నింటికీ పోయవచ్చు. ఒకవేళ మొక్కలు తక్కువగా ఉంటే, తవుడు పరిమాణాన్ని తగ్గించి (అర కేజీ తవుడు – 5 లీటర్ల నీరు) తయారు చేసుకోవచ్చు.
నల్ల తవుడు మేలు!
దొరికితే నల్ల తవుడు (బ్లాక్ రైస్ బ్రాన్) వాడవచ్చు. దీనిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నల్ల తవుడులో ఆంథోసైనిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి దీనికి ఆ నలుపు లేదా ముదురు ఊదా రంగును ఇస్తాయి. ఇవి మొక్కలకు చీడపీడల నుండి సహజమైన రక్షణను అందిస్తాయి.
సాధారణ తెల్ల తవుడుతో పోలిస్తే, నల్ల తవుడులోప్రోటీన్, ఫైబర్, ఇనుము వంటి ఖనిజాలు అత్యధికంగా ఉంటాయి. ఇది మొక్కల పెరుగుదలకు అవసరమైన 18 రకాల అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. నల్ల తవుడు కొంచెం ఖరీదైనది. మార్కెట్లో తక్కువగా దొరుకుతుంది. ఒకవేళ ఇది దొరక్కపోతే సాధారణ తవుడు కూడా వాడవచ్చు. అది కూడా మొక్కలకు చాలా మేలు చేస్తుంది.
- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


