లేవగానే ఫోన్‌ ఎందుకు చూస్తాం? | Wake Up Grab Phone: The Hidden Psychology Behind Your Morning Habit | Sakshi
Sakshi News home page

లేవగానే ఫోన్‌ ఎందుకు చూస్తాం?

Jul 31 2026 8:19 AM | Updated on Jul 31 2026 8:34 AM

Wake Up Grab Phone: The Hidden Psychology Behind Your Morning Habit

ఉదయం కళ్లు తెరిచిన వెంటనే చాలామందికి తెలియకుండానే చేయి ఫోన్‌ వైపు వెళ్తుంది. అలారం ఆపిన వెంటనే.. వాట్సాప్‌ మెసేజ్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌.. ఈమెయిల్స్‌ చెక్‌ చేయడం.. ఆఖరికి వాతావరణం ఎలా ఉందో చూడడం రోజువారీ అలవాటుగా మారిపోయింది. చాలామంది దీన్ని “మొబైల్‌ అడిక్షన్‌” భావిస్తారు. కానీ సైకాలజీ నిపుణుల ప్రకారం.. కాదంట!. 

ఉదయం లేవగానే ఫోన్‌ చూడాలనే కోరిక వెనుక కేవలం వ్యసనం మాత్రమే ఉండదు. అలవాటు, ఆసక్తి, అనిశ్చితిని తగ్గించుకోవాలనే మెదడు స్వభావం, కొత్త సమాచారం కోసం ఎదురుచూపు వంటి అనేక మానసిక అంశాలు పనిచేస్తాయి.

రాత్రంతా ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఆత్రుత.. మనిషి మెదడు సహజంగానే అనిశ్చితిని ఇష్టపడదు. మనం నిద్రలో ఉన్న సమయంలో ప్రపంచం ముందుకు సాగుతూనే ఉంటుంది. ఎవరైనా మెసేజ్‌ పంపి ఉండొచ్చు.. ముఖ్యమైన వార్త వచ్చి ఉండొచ్చు.. ఆఫీసు నుంచి మెయిల్‌ వచ్చి ఉండొచ్చు.. మరుసటి రోజు ప్లాన్‌ మారి ఉండొచ్చు. లేవగానే ఫోన్‌ చూడటం ద్వారా మన మెదడు ‘‘ఏమైనా ముఖ్యమైన విషయం జరిగిందా?’’ అనే సందేహానికి సమాధానం వెతుకుతుంది.

ఉదాహరణకు.. ముఖ్యమైన ఇంటర్వ్యూ లేదా పరీక్ష ఉన్న రోజు లేవగానే ఫోన్‌ చెక్‌ చేయాలనే కోరిక మరింత ఎక్కువగా ఉంటుంది. కారణం.. ఆ రోజు గురించి ఏదైనా కొత్త సమాచారం వచ్చిందేమో తెలుసుకోవాలనే మెదడు ప్రయత్నం.

అలవాటు ఎలా బలపడుతుంది?
సైకాలజీలో దీనిని హ్యాబిట్‌ లూప్‌ (Habit Loop) అంటారు. ఒకే పని ఒకే సందర్భంలో పదేపదే చేయడం వల్ల అది క్రమంగా ఆటోమేటిక్‌గా మారుతుంది.
ఇక్కడ:

  • సంకేతం (Cue): ఉదయం నిద్ర లేవడం

  • చర్య (Routine): ఫోన్‌ చెక్‌ చేయడం

  • బహుమతి (Reward): కొత్త మెసేజ్‌, నోటిఫికేషన్‌, ఆసక్తికరమైన సమాచారం తెలుసుకోవడం.. ఈ మూడు కలిసి ఒక అలవాటుగా మారతాయి.

కొంతకాలానికి ఫోన్‌లో ఏదైనా ఆసక్తికరమైన విషయం ఉంటుందని మెదడు ముందుగానే ఊహిస్తుంది. దీంతో ఉదయం లేవగానే ఫోన్‌ చూడాలనే అలవాటు మరింత బలపడుతుంది.

ఏదో ఒకసారి వచ్చే ‘రివార్డ్‌’ మరింత ఆకర్షిస్తుంది.. ఫోన్‌ చెక్‌ చేసిన ప్రతిసారీ ఆసక్తికరమైన విషయం కనిపించకపోయినా.. అప్పుడప్పుడు వచ్చే మంచి అనుభవం ఆ అలవాటును కొనసాగిస్తుంది. ఒక రోజు పాత స్నేహితుడి నుంచి మెసేజ్‌ రావచ్చు. మరో రోజు ముఖ్యమైన ఈమెయిల్‌ ఉండొచ్చు. ఇంకో రోజు ఆసక్తికరమైన వీడియో కనిపించొచ్చు. ఇలా ఎప్పుడు ఏ కొత్త విషయం కనిపిస్తుందో తెలియకపోవడం వల్లే మెదడు మళ్లీ మళ్లీ ఫోన్‌ వైపు ఆకర్షితమవుతుంది. సైకాలజీలో దీనిని వేరియబుల్‌ రివార్డ్‌ (Variable Reward) అంటారు.

ప్రపంచంతో మళ్లీ కనెక్ట్‌ అయ్యేందుకు.. నిద్రలో ఉన్నప్పుడు మనిషి కొంత సమయం ప్రపంచానికి దూరంగా ఉంటాడు. లేవగానే ఫోన్‌ చూడటం ద్వారా చాలామంది తమ చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం సమయం ఎంత?, వాతావరణం ఎలా ఉంది?, ఎవరైనా కాల్‌ చేశారా?, ఈరోజు ఏ పనులు ఉన్నాయి?.. ఇలా రోజును ప్రారంభించేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఫోన్‌ ఒక సాధనంగా మారింది.

అయితే ఇది ఆరోగ్యకరమైన అలవాటేనా?
ఉదయం ఫోన్‌ చూడటం అనేది సాధారణ అలవాటే అయినప్పటికీ.. అది ఎంతసేపు కొనసాగుతుందన్నదే ముఖ్యం. లేవగానే రెండు నిమిషాలు ముఖ్యమైన విషయాలు చూసి పక్కన పెట్టడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ అదే అలవాటు 45 నిమిషాల పాటు సోషల్‌ మీడియా స్క్రోలింగ్‌గా మారితే.. దృష్టి, ఉత్పాదకత, మానసిక స్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

ఫోన్‌ చూడటం అంటే అడిక్షన్‌ కాదు!
లేవగానే ఫోన్‌ కోసం వెతకడం మాత్రమే చూసి దాన్ని వ్యసనంగా పరిగణించలేమని నిపుణులు చెబుతున్నారు. నిజమైన మొబైల్‌ అడిక్షన్‌ అంటే నియంత్రణ కోల్పోవడం, అవసరం లేకున్నా పదేపదే ఉపయోగించడం, దాని వల్ల రోజువారీ జీవితంపై ప్రతికూల ప్రభావం పడటం వంటి లక్షణాలు ఉండాలి. అందుకే.. ఉదయం ఫోన్‌ వైపు చేయి వెళ్లడం వెనుక కేవలం అలవాటు మాత్రమే కాదు.. మెదడు కొత్త సమాచారం కోసం చేసే సహజ ప్రయత్నం కూడా ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement