అక్కాచెల్లెళ్ల అపురూప సాయం | Assam influencers Nilakshi Sharma and Krishnakshi stepped affected floods | Sakshi
Sakshi News home page

అక్కాచెల్లెళ్ల అపురూప సాయం

Jul 31 2026 6:26 AM | Updated on Jul 31 2026 6:26 AM

Assam influencers Nilakshi Sharma and Krishnakshi stepped affected floods

అసోంలో బ్రహ్మపుత్ర ఉగ్రరూపం దాల్చింది. నిన్న మొన్నటి వరకు తేయాకు తోటలతో కళకళలాడిన జోర్హాట్, శివసాగర్‌ జిల్లాలు కన్నీటి సముద్రాలయ్యాయి. ఏడు లక్షల మంది  సర్వస్వం కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి భయానక విపత్తువేళ స్వయంగా పడవలు కట్టుకుని వరదలోకి దూకారు అసోమీ అక్కాచెలెళ్లు నిలాక్షి శర్మ, కృష్ణాక్షి శర్మ. ఇన్‌ఫ్లూయెన్సర్లయిన వీరిరువురూ తమ సోషల్‌ మీడియా పవర్‌తో వందలాదిప్రాణాలను కాపాడారు.


‘మేము కేవలం ఒక చిన్న వీడియోతో ఈ సహాయక ప్రయాణాన్ని మొదలుపెట్టాం. కానీ అసోం నలుమూలల నుండి ప్రజలు చూపించిన నమ్మకం, మా ఒక్క పిలుపుతో ఏకమైన వందలాది స్వచ్ఛంద హృదయాలు మమ్మల్ని అబ్బురపరిచేలా చేశాయి. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి రావడం చూశాక ఇంతటి భారీ స్థాయి రిలీఫ్‌ వర్క్‌ను నడిపించే కొండంత శక్తి మాకు వచ్చింది’ అంటుంది కృష్ణాక్షి శర్మ. 

‘అసోంలో వరదలు రావడం కొత్త కాదు, కానీ ఈసారి ప్రజలు అనుభవిస్తున్న నరకం వర్ణనాతీతం. ఆకలితో ఉన్న చిన్నపిల్లల ఏడుపులు, నిస్సహాయంగా రోడ్లపై నిల్చున్న తల్లులను చూశాక ఇంట్లో కూర్చోలేకపోయాం. మా వాలంటీర్లతో ప్రతి మారుమూల గ్రామానికి వెళ్తున్నాం. ఇది మన అసోం... ఇది మన బాధ్యత’ అంది నిలాక్షి శర్మ. 

వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు, హెలికాప్టర్లు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగడం సహజం. కానీ మారుమూల గ్రామాల్లో, కమ్యూనికేషన్‌ పూర్తిగా కట్‌ అయిపోయినప్రాంతాల్లో ఆకలితో అలమటించే పసిపిల్లల ఏడుపులు, వృద్ధుల ఆవేదనలు వీరి దృష్టికి త్వరగా చేరవు. సరిగ్గా అక్కడే నిలాక్షి, కృష్ణాక్షి లాంటి మనుషుల అవసరం కనిపిస్తుంది. గౌహతి కి చెందిన ఈ అక్కాచెల్లెళ్లు ఈ వరద సమయంలో  చొరవ చూపి అస్సాం ప్రేమకు పాత్రులయ్యారు.

ఇన్‌ఫ్లూయెన్సర్లు కాదు... నిజమైన సైనికులు!
గౌహతిలో నివసించే నిలాక్షి, కృష్ణాక్షిలు అక్కచెల్లెళ్లే కాదు... అస్సాంలో పాపులర్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌ కూడా. నిలాక్షి బ్యాంకర్‌గా పని చేసి మోటివేషనల్‌ స్పీకర్‌గా మారితే, కృష్ణాక్షి డిజిటల్‌ మార్కెటింగ్‌ చదివి పాడ్‌కాస్టింగ్‌లో స్థిరపడ్డారు. జూలై మూడో వారంలో వరద తీవ్రత పెరిగినప్పుడు వీరు ఇది రీల్స్‌ చేసే సమయం కాదని, రియల్‌గా రంగంలో దిగాలని భావించి అస్సాం దిగ్గజ గాయకుడు జుబీన్‌ గార్గ్‌ స్ఫూర్తితో సొంత సహాయక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గౌహతిలోని చిన్న హాల్‌ను గోడౌన్‌ గా మార్చి, రాత్రింబగళ్లు నిద్ర లేకుండా సహాయక సామాగ్రిని ప్యాక్‌ చేశారు. వీరికి కొందరు స్థానిక యువ వాలంటీర్లు తోడయ్యారు. ప్రభుత్వం చేరుకోలేని, రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయిన మారుమూల గిరిజన పల్లెలకు స్వయంగా నాటు పడవల్లో ప్రయాణిస్తూ,ప్రాణాలకు తెగించి క్షేత్రస్థాయికి చేరి సాయం అందించారు. వీరు పెట్టిన అన్నం ముద్దప్రాణాలెన్నో కాపాడింది.

కన్నీళ్లు తుడిచిన వేళ... 
వీరి ప్రయత్నం కేవలం కొన్ని ఫుడ్‌ ప్యాకెట్లకు పరిమితం కాలేదు. శివసాగర్, జోర్హాట్‌ జిల్లాల్లోని సుమారు 15 కంటే ఎక్కువ గ్రామాల్లోని వందలాది కుటుంబాలకు వీరుప్రాణాధారమయ్యారు. వరద నీరు తగ్గుముఖం పడుతున్న తరుణంలో వచ్చే అంటువ్యాధులను అరికట్టడానికి మెడికల్‌ క్యాంపులపై దృష్టి పెట్టారు. తాగడానికి  నీరు లేక ఇబ్బంది పడుతున్న తల్లులకు వాటర్‌ ప్యూరిఫైయర్‌ టాబ్లెట్లు అందించారు. వీరు చేసిన పని వల్ల కేవలం ఆకలి తీరడమే కాదు, ‘మా కోసం ఎవరో ఒకరు ఉన్నారు’ అనే కొండంత నమ్మకం ఆ అస్సామీ గ్రామస్తుల గుండెల్లో నిండింది.
అసోం వరదలు ప్రతి ఏటా వచ్చే ఒక వార్తా హెడ్‌లైన్‌ మాత్రమే కావచ్చు. కానీ అక్కడ సర్వస్వం కోల్పోయిన వారికి అది జీవనపోరాటం. ఇలాంటి చీకటి సమయంలో నిలాక్షి, కృష్ణాక్షి లాంటి మానవతామూర్తులు ఆశాదీపాలు.
తెరపై కనిపించే సెలబ్రిటీల కంటే బురద నీటిలో నడుస్తూ తోటివారి కన్నీళ్లు తుడిచే ఇలాంటి సేవామూర్తులే నిజమైన సూపర్‌ హీరోలు!
 

డిజిటల్‌ పవర్‌తో విరాళాల సేకరణ
నిలాక్షి, కృష్ణాక్షిలు తమ స్వంత డబ్బు ఖర్చు చేయడంతో ఆగకుండా, తమకున్న లక్షలాది ఫాలోవర్లను కూడా ఈ సాయంలో భాగస్వాములను చేశారు. ‘అసోంకు సాయం చేయండి’ అని సోషల్‌ మీడియా ద్వారా పారదర్శకమైన లైవ్‌ అప్పీల్స్‌ చేస్తూ వీరు చేసిన చిన్న వీడియోకి అనూహ్యమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఆ డబ్బుతో పాటు ప్రజల నుండి నేరుగా బియ్యం, పప్పు, తాగునీరు, మందులు, ముఖ్యంగా చిన్నపిల్లలకు పాలు, మహిళల కోసం శానిటరీ ప్యాడ్‌లను సేకరించారు. ప్రతి పైసాకు సంబంధించిన లెక్కలను, పంపిణీ చేస్తున్న దృశ్యాలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ పారదర్శకతకు నిదర్శనంగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement