breaking news
brahmaputra floods
-
అక్కాచెల్లెళ్ల అపురూప సాయం
అసోంలో బ్రహ్మపుత్ర ఉగ్రరూపం దాల్చింది. నిన్న మొన్నటి వరకు తేయాకు తోటలతో కళకళలాడిన జోర్హాట్, శివసాగర్ జిల్లాలు కన్నీటి సముద్రాలయ్యాయి. ఏడు లక్షల మంది సర్వస్వం కోల్పోయి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి భయానక విపత్తువేళ స్వయంగా పడవలు కట్టుకుని వరదలోకి దూకారు అసోమీ అక్కాచెలెళ్లు నిలాక్షి శర్మ, కృష్ణాక్షి శర్మ. ఇన్ఫ్లూయెన్సర్లయిన వీరిరువురూ తమ సోషల్ మీడియా పవర్‌తో వందలాదిప్రాణాలను కాపాడారు.‘మేము కేవలం ఒక చిన్న వీడియోతో ఈ సహాయక ప్రయాణాన్ని మొదలుపెట్టాం. కానీ అసోం నలుమూలల నుండి ప్రజలు చూపించిన నమ్మకం, మా ఒక్క పిలుపుతో ఏకమైన వందలాది స్వచ్ఛంద హృదయాలు మమ్మల్ని అబ్బురపరిచేలా చేశాయి. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి రావడం చూశాక ఇంతటి భారీ స్థాయి రిలీఫ్ వర్క్‌ను నడిపించే కొండంత శక్తి మాకు వచ్చింది’ అంటుంది కృష్ణాక్షి శర్మ. ‘అసోంలో వరదలు రావడం కొత్త కాదు, కానీ ఈసారి ప్రజలు అనుభవిస్తున్న నరకం వర్ణనాతీతం. ఆకలితో ఉన్న చిన్నపిల్లల ఏడుపులు, నిస్సహాయంగా రోడ్లపై నిల్చున్న తల్లులను చూశాక ఇంట్లో కూర్చోలేకపోయాం. మా వాలంటీర్లతో ప్రతి మారుమూల గ్రామానికి వెళ్తున్నాం. ఇది మన అసోం... ఇది మన బాధ్యత’ అంది నిలాక్షి శర్మ. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు, హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగడం సహజం. కానీ మారుమూల గ్రామాల్లో, కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోయినప్రాంతాల్లో ఆకలితో అలమటించే పసిపిల్లల ఏడుపులు, వృద్ధుల ఆవేదనలు వీరి దృష్టికి త్వరగా చేరవు. సరిగ్గా అక్కడే నిలాక్షి, కృష్ణాక్షి లాంటి మనుషుల అవసరం కనిపిస్తుంది. గౌహతి కి చెందిన ఈ అక్కాచెల్లెళ్లు ఈ వరద సమయంలో చొరవ చూపి అస్సాం ప్రేమకు పాత్రులయ్యారు.ఇన్ఫ్లూయెన్సర్లు కాదు... నిజమైన సైనికులు!గౌహతిలో నివసించే నిలాక్షి, కృష్ణాక్షిలు అక్కచెల్లెళ్లే కాదు... అస్సాంలో పాపులర్ కంటెంట్ క్రియేటర్స్ కూడా. నిలాక్షి బ్యాంకర్‌గా పని చేసి మోటివేషనల్ స్పీకర్‌గా మారితే, కృష్ణాక్షి డిజిటల్ మార్కెటింగ్ చదివి పాడ్‌కాస్టింగ్‌లో స్థిరపడ్డారు. జూలై మూడో వారంలో వరద తీవ్రత పెరిగినప్పుడు వీరు ఇది రీల్స్ చేసే సమయం కాదని, రియల్‌గా రంగంలో దిగాలని భావించి అస్సాం దిగ్గజ గాయకుడు జుబీన్ గార్గ్ స్ఫూర్తితో సొంత సహాయక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గౌహతిలోని చిన్న హాల్‌ను గోడౌన్ గా మార్చి, రాత్రింబగళ్లు నిద్ర లేకుండా సహాయక సామాగ్రిని ప్యాక్ చేశారు. వీరికి కొందరు స్థానిక యువ వాలంటీర్లు తోడయ్యారు. ప్రభుత్వం చేరుకోలేని, రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయిన మారుమూల గిరిజన పల్లెలకు స్వయంగా నాటు పడవల్లో ప్రయాణిస్తూ,ప్రాణాలకు తెగించి క్షేత్రస్థాయికి చేరి సాయం అందించారు. వీరు పెట్టిన అన్నం ముద్దప్రాణాలెన్నో కాపాడింది.కన్నీళ్లు తుడిచిన వేళ... వీరి ప్రయత్నం కేవలం కొన్ని ఫుడ్ ప్యాకెట్లకు పరిమితం కాలేదు. శివసాగర్, జోర్హాట్ జిల్లాల్లోని సుమారు 15 కంటే ఎక్కువ గ్రామాల్లోని వందలాది కుటుంబాలకు వీరుప్రాణాధారమయ్యారు. వరద నీరు తగ్గుముఖం పడుతున్న తరుణంలో వచ్చే అంటువ్యాధులను అరికట్టడానికి మెడికల్ క్యాంపులపై దృష్టి పెట్టారు. తాగడానికి నీరు లేక ఇబ్బంది పడుతున్న తల్లులకు వాటర్ ప్యూరిఫైయర్ టాబ్లెట్లు అందించారు. వీరు చేసిన పని వల్ల కేవలం ఆకలి తీరడమే కాదు, ‘మా కోసం ఎవరో ఒకరు ఉన్నారు’ అనే కొండంత నమ్మకం ఆ అస్సామీ గ్రామస్తుల గుండెల్లో నిండింది.అసోం వరదలు ప్రతి ఏటా వచ్చే ఒక వార్తా హెడ్లైన్ మాత్రమే కావచ్చు. కానీ అక్కడ సర్వస్వం కోల్పోయిన వారికి అది జీవనపోరాటం. ఇలాంటి చీకటి సమయంలో నిలాక్షి, కృష్ణాక్షి లాంటి మానవతామూర్తులు ఆశాదీపాలు.తెరపై కనిపించే సెలబ్రిటీల కంటే బురద నీటిలో నడుస్తూ తోటివారి కన్నీళ్లు తుడిచే ఇలాంటి సేవామూర్తులే నిజమైన సూపర్ హీరోలు! డిజిటల్ పవర్‌తో విరాళాల సేకరణనిలాక్షి, కృష్ణాక్షిలు తమ స్వంత డబ్బు ఖర్చు చేయడంతో ఆగకుండా, తమకున్న లక్షలాది ఫాలోవర్లను కూడా ఈ సాయంలో భాగస్వాములను చేశారు. ‘అసోంకు సాయం చేయండి’ అని సోషల్ మీడియా ద్వారా పారదర్శకమైన లైవ్ అప్పీల్స్ చేస్తూ వీరు చేసిన చిన్న వీడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ డబ్బుతో పాటు ప్రజల నుండి నేరుగా బియ్యం, పప్పు, తాగునీరు, మందులు, ముఖ్యంగా చిన్నపిల్లలకు పాలు, మహిళల కోసం శానిటరీ ప్యాడ్లను సేకరించారు. ప్రతి పైసాకు సంబంధించిన లెక్కలను, పంపిణీ చేస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పారదర్శకతకు నిదర్శనంగా నిలిచారు. -
అస్సాం వరదల వెనుక భయంకర నిజాలు
అస్సాం మరోసారి జల విలయాన్ని చవిచూస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాది వరదలను ఎదుర్కొనే ఈశాన్య రాష్ట్రం.. ఈసారి మాత్రం ఇటీవలి కాలంలోనే అత్యంత తీవ్ర వరద పరిస్థితుల్లో ఒకదాన్ని ఎదుర్కొంది. గ్రామాలకు గ్రామాలు నీట మునగడం, వేలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడం, భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం.. అస్సాం వరదల భీకర రూపాన్ని చూపిస్తున్నాయి.ఈసారి వరదల బారిన పడి ఇప్పటివరకు 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరు లక్షల మందికిపైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వందలాది గ్రామాలు నీట మునగగా.. వేలాది కుటుంబాలు సహాయక శిబిరాలకు తరలిపోయాయి. 37 వేల హెక్టార్లకుపైగా వ్యవసాయ భూమి నీట మునిగింది. పశుసంపద, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు గంటల తరబడి వరద నీటిలో చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే అస్సాం వరదలు కేవలం భారీ వర్షాల ఫలితమేనా? లేదంటే దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు కూడా ఈ విపత్తు తీవ్రతను పెంచుతున్నాయా?.. బ్రహ్మపుత్ర ఉగ్రరూపం వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటి? ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టినా వరదలను ఎందుకు అదుపు చేయలేకపోతున్నాయి?.. Amid Assam's devastating floods, a father was seen swimming through floodwaters while carrying his children in a large tub to safety. The viral visuals have become a powerful symbol of a parent's courage, sacrifice, and unconditional love.#AssamFloods #FloodRescue #Father pic.twitter.com/uz5ZousOSM— Apka Aashish (@ApkaAashish) July 28, 2026అస్సాం భౌగోళిక పరిస్థితులే ఆ రాష్ట్రాన్ని వరదలకు అత్యంత సున్నితంగా మార్చాయి. టిబెట్ నుంచి భారత్‌లోకి ప్రవేశించే బ్రహ్మపుత్ర.. అరుణాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతాల నుంచి భారీగా నీటిని తీసుకొస్తుంది. దీనికి అస్సాంలో 50కిపైగా ఉప నదులు కలుస్తాయి. వర్షాకాలంలో ఈ నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోతుంది.బ్రహ్మపుత్ర నది మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది భారీగా ఇసుక, మట్టిని (సిల్ట్) మోసుకొస్తుంది. దీంతో నది లోతు తగ్గి.. తక్కువ నీటిని మాత్రమే మోయగల పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా భారీ వర్షాలు కురిసినప్పుడు నది తన గట్లను దాటి ప్రవహిస్తుంది.40 శాతానికి పైగా భూభాగం..అస్సాంలో వరద సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఒక గణాంకం చాలు. రాష్ట్ర మొత్తం భూభాగంలో దాదాపు 39.58 శాతం ప్రాంతం వరద ముప్పు ప్రాంతంగా గుర్తించారు. ఇది దేశ సగటు వరద ముప్పు ప్రాంతంతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ప్రతి ఏడాది సగటున లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి వరదల ప్రభావానికి గురవుతోంది. అంటే అస్సాంలో వరదలు కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు.. అక్కడి భౌగోళిక వాస్తవం కూడా.ఈసారి ఎందుకు ఇంత భయంకరంగా?ఈ ఏడాది అస్సాం, పొరుగు నాగాలాండ్ ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది. తక్కువ సమయంలో భారీగా వర్షం కురవడంతో కొండ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా వరద నీరు మైదాన ప్రాంతాలకు చేరింది. దీనికి తోడు వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం తీరు మారుతోంది. గతంలో కొన్ని రోజుల్లో కురిసే వర్షం ఇప్పుడు కొద్ది గంటల్లోనే భారీగా పడుతోంది. ఇలాంటి ఆకస్మిక వర్షాలు నదులపై ఒత్తిడిని పెంచుతున్నాయి.ప్రభుత్వం వల్ల కావట్లేదా?వరదలను పూర్తిగా ఆపడం అస్సాం లాంటి ప్రాంతంలో దాదాపు అసాధ్యం. కానీ నష్టాన్ని తగ్గించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇక్కడే ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్నాయి.👉పాతబడుతున్న కట్టలువరదలను నియంత్రించేందుకు అస్సాంలో వేల కిలోమీటర్ల మేర కట్టలు (ఎంబాంక్మెంట్లు) నిర్మించారు. రాష్ట్రంలో దాదాపు 4,473 కిలోమీటర్ల మేర కట్టలు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రతి ఏడాది భారీ ప్రవాహాలతో కొన్ని చోట్ల ఇవి బలహీనపడుతున్నాయి. కట్టలు తెగిపోవడమో, బలహీన ప్రాంతాల్లో నీరు చొచ్చుకురావడం వల్లనో ఒక్కసారిగా గ్రామాలు మునిగిపోతున్నాయి.👉తాత్కాలిక చర్యలకే పరిమితంఅస్సాం వరద నిర్వహణలో ఎక్కువగా సహాయక చర్యలు, కట్టల మరమ్మతులు, తాత్కాలిక రక్షణ పనులపైనే దృష్టి ఉందనే విమర్శలు ఉన్నాయి. దీర్ఘకాలిక పరిష్కారాలైన నది నిర్వహణ, సహజ నీటి ప్రవాహ మార్గాల పరిరక్షణ, వరద ప్రాంతాల ప్రణాళిక వంటి అంశాలు ఇంకా సవాలుగానే ఉన్నాయి.👉నదీ కోత మరో పెద్ద సమస్యఅస్సాంలో వరదలతో పాటు నదీ కోత కూడా పెద్ద ప్రమాదమే. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు ఏటా భూమిని కోతకు గురిచేస్తాయి. దీంతో ప్రజలు ఇళ్లు, వ్యవసాయ భూములను కోల్పోతున్నారు.ఆ మార్పులు పెంచుతున్న ముప్పుప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా తీవ్ర వర్షాలు, ఆకస్మిక వరదలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అస్సాం వంటి నది పరివాహక ప్రాంతాల్లో దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది. అంటే భవిష్యత్తులో సమస్య కేవలం “వరద వస్తుందా?” అన్నది కాదు.. “ఎంత తీవ్రంగా వస్తుంది?” అన్నదే కీలక ప్రశ్నగా మారుతోంది.కావాల్సింది కొత్త విధానంఅస్సాం వరద సమస్యకు కేవలం మరిన్ని కట్టలు నిర్మించడం ఒక్కటే పరిష్కారం కాదని నిపుణులు భావిస్తున్నారు. నదుల సహజ ప్రవాహాన్ని అర్థం చేసుకుని ప్రణాళికలు రూపొందించడం, ప్రమాద ప్రాంతాల్లో నిర్మాణాలను నియంత్రించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం అవసరం. ప్రస్తుతం సహాయక చర్యలతో ప్రాణాలను కాపాడటం ముఖ్యం. కానీ ప్రతి ఏడాది ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే.. వరదలను ఎదుర్కొనే విధానంలో మూలమైన మార్పులు అవసరం.అస్సాం వరదలు మరోసారి చెప్పే నిజం ఒక్కటే.. ప్రకృతిని పూర్తిగా నియంత్రించలేం.. కానీ నష్టాన్ని తగ్గించే సిద్ధతను మాత్రం పెంచుకోవచ్చు. -
Assam Floods: తగ్గని వరద.. ఒక్కరోజులోనే పది మంది మృతి
గువాహతి: బ్రహ్మపుత్ర, బరాక్ నదులు పొంగిపొర్లుతుండటంతో అస్సాంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో సంభవించిన మరో పది మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 118కి చేరుకుందని అధికారులు తెలిపారు. అస్సాంలో వరద బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వందేళ్లలో ఈ ప్రాంతంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఇదే ప్రథమంగా కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మనుషులు మునిగిపోయేంత మేర వరద నీరు ఇంకా పేరుకుపోయే ఉంది. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న చచార్ జిల్లాలోని సిల్చార్ చాలా భాగం వరద నీటిలోనే ఉంది. బాధితుల కోసం ఐఏఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లు అందజేస్తున్నాయి. రెండు కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలను కూడా రంగంలోకి దించారని అధికారులు తెలిపారు. సిల్చార్‌లో 3 లక్షల మంది నీరు, ఆహారం, అవసరమైన మందుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. #AidToCivilAdministration In response to extensive floods in Assam & Meghalaya,#IAF heptr & transport aircraft have been deployed across the region to deliver relief material & provide succour to the locals. During the floods, 13 tons of relief material has been airlifted so far. pic.twitter.com/ylOgSOTGsz — Indian Air Force (@IAF_MCC) June 24, 2022 -
ఉత్తమనటి..బ్రహ్మపుత్రిక
బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉండే ఆ గ్రామంలోని అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు రావు. వరదలు రావడం, గ్రామం కొట్టుకుపోవడం యేటా మామూలే. ఇక ఆ గ్రామానికి, మిగతా ప్రపంచానికీ రాకపోకల కోసం ఒక్క వంతెనైనా లేదు. అలాంటి గ్రామానికి రెండేళ్ల క్రితం ఒక మంచి ‘సంబంధం’ కోసం నానా కాలి బాటల్లో పడి ఒక బృందం వచ్చింది! ఇంటి పని, పొలం పనీ చేయగలదు అనిపించిన 20 ఏళ్ల శివరాణి అనే మొరటు పిల్లను చూసి మరీ ఎంపిక చేసుకుంది. ఆ వచ్చిన వాళ్లు సినిమా వాళ్లు! వారి సినిమా ‘బ్రిడ్జ్’లో నటించిన ఆ బ్రహ్మపుత్రిక ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ నటి! నదికి, నది ఒడ్డున నివాసం ఉన్నవారికి మధ్య ‘బాంధవ్యం’ ఎలా ఉంటుంది? ముంచెత్తే వరదలు సైతం విడదీయలేనంత బలంగా ఉంటుంది. అస్సామీలో వచ్చిన ‘బ్రిడ్జ్’ సినిమా కథాంశం ఈ బాంధవ్యమే. బ్రహ్మపుత్ర నదికి ఉత్తరం వైపున బలిగావ్ అనే గ్రామం ఉంది. అస్సాంలోని లఖింపూర్ జిల్లా పరిధిలోని ధకువాఖన సబ్–డివిజన్ కిందికి వస్తుంది ఆ గ్రామం. వరదలు వస్తే అసలే లేకుండా పోతుంది! బ్రహ్మపుత్రకు ఏటా వరదలు తప్పవు. బలిగావ్ గ్రామానికి ముంపు తప్పదు. వరద తగ్గుముఖం పట్టాక, సూర్యుడు మేఘాల్లోంచి పైకి వచ్చిన విధంగా ఊళ్లోంచి వెళ్లిన వాళ్లు మళ్లీ ఆ ఒడ్డున ఉదయిస్తారు. పడిపోయిన ఇళ్లను పునర్నించుకుంటారు. అంతే తప్ప ఊపిరి లాంటి ఆ ఊరిని వదిలి ఎక్కడికీ వెళ్లరు. ఊరు నదితో బాంధవ్యం కలుపుకుందనే ఆ ఒక్క కారణంతో ఆ ఊరితో పొరుగూళ్లవారెవరూ సంబంధం కలుపుకోరు! ఇంకో కారణం కూడా ఉంది. బలిగావ్కు మిగతా ప్రాంతాలను కలిపే వంతెన లేదు. అలాంటి చోటుకు పిల్లను ఎలా ఇస్తారు? అక్కడి పిల్లను ఎలా తెచ్చుకుంటారు? ఇదంతా సినిమాలో అంతర్లీనంగా ఉండే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది చిత్ర కథ కాదు. ఆ చిత్రంలో ‘జానకి’ ప్రధాన పాత్ర పోషించిన అస్సామీ యువతి శివరాణి కథ. ‘బ్రిడ్జ్’ చిత్రం 2020 లో విడుదలైంది. ఇప్పటి వరకు ఆ చిత్రానికి 28 అంతర్జాతీయ చిత్రోత్సవాలలో అవార్డులు వచ్చాయి. తాజాగా కెనడాలో జరిగిన ‘అట్టావా నాల్గవ భారత చలన చిత్రోత్సవం’లో శివరాణిని ‘ఉత్తమ నటి’ అవార్డు వరించింది. ∙∙ ‘బ్రిడ్జ్’ చిత్రీకరణ జరిగే సమయానికి శివరాణి వయసు 22. ఆ సినిమాకు కథానాయిక గా ఆమె దొరికి, సినిమా పూర్తయ్యేసరికి రెండేళ్లు పట్టింది. 89 నిముషాల ఈ చిత్రాన్ని తియ్యడానికి డైరెక్టర్ కృపాల్ కాళిత సహా టీమ్ మొత్తం దాదాపుగా ప్రతిరోజూ నీటిలోకి దిగవలసి వచ్చేది. రెండు నిముషాల సీన్ షూటింగ్‌కి ఎనిమిది గంటల సమయం పట్టిన అనుభవం కూడా వారికి ఉంది. నీళ్లలోకి దిగడం, కరెక్ట్ షాట్ కోసం గంటలు గంటలు పనిచేయడం పెద్ద కష్టమైతే కాలేదు కానీ, జానకి పాత్రకు శివరాణిని వెతికి పట్టుకోవడమే వారికి కష్టమైంది. వాళ్లకు కావలసింది చూడ్డానికి మొరటుగా, పొలం పనుల వల్ల చేతుల కాయలు కాసి ఉన్న అమ్మాయి. అలాగే ఆమెకు పొలం దున్నడం తెలిసుండాలి. పశువులు మేపగలగాలి. ఈ ‘క్వాలిటీ’లన్నిటి కోసం బలిగావ్ గ్రామం మొత్తం గాలించి 300 మంది యువతులకు ఆడిషన్ నిర్వహించి చివరికి శివరాణిని ఎంపిక చేసుకున్నారు. కథకు, కథనానికి సరిపోయేలా ఉంది శివరాణి. ఫ్రెష్‌గా కాలేజ్ నుంచి వచ్చినప్పటికీ, అప్పుడే నాగలి పట్టి పొలం దున్ని ఇంటికి వచ్చినట్లుగా ఉంది. సినిమాకు అంతవరకు చాలు. అయితే ఆమె వదనంలో లీలగా విషాదం కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులు వరదల్లో చనిపోయారు. తమ్ముడు, తను.. ఇద్దరే మిగిలారు. తమ్ముణ్ణి చదివిస్తూ, తన బి.యస్సీ పూర్తిచేసుకుని ఉన్న సమయంలో ఊళ్లోకి ఈ సినిమా టీమ్ వచ్చింది. వారి సినిమాలోని ప్రధాన పాత్రకు తను ఎంపికైన వార్త వినగానే శివరాణి ఎలాగైతే మేఘాలలో తేలిపోయిందో.. ఆ పాత్రకు ఉత్తమ నటిగా తనకు అవార్డు వచ్చిందని తెలిసి ఇప్పుడూ అంతే ఆనందంలో మునిగిపోయింది. ముంచడం, తేల్చడం బ్రహ్మపుత్ర యేటా చేస్తుండే పనే. ఈ మునగడం, తేలడం మాత్రం ఆమెకు కొత్త అనుభవం. సీమా బిస్వాస్ తర్వాత ఉత్తమ నటి అవార్డు పొందిన మరొక అస్సామీ నటి శివరాణి. 2019లో ఇదే ‘అట్టావా’ చిత్రోత్సవంలో మలయాళీ చిత్రం ‘ఇదం’కి ఉత్తమ నటి అవార్డు పొందారు సీమ. ఈ ఏడాది అదే చిత్రోత్సవంలో ‘బ్రిడ్జ్’తో శివరాణి ఉత్తమ నటి అయింది. 56 ఏళ్ల విలక్షణ నటితో తనకు పోలిక రావడం కూడా శివరాణిని ఆనంద డోలికల్లో విహరింపజేస్తోంది. తండ్రే ఆమెకు నాగలితో పొలం దున్నడం నేర్పించాడు. ఇప్పుడు ఆయన ఉండి ఉంటే సినిమాలో పొలం దున్నుతూ కనిపిస్తున్న తనను చూసి, ఆయనతో పాటు తల్లీ సంతోషించే ఉండేవారని శివరాణి అంటోంది. ప్రస్తుతం ఆమె తన గ్రామానికి దగ్గరగా ఉండే ఉత్తర లక్ష్మీపూర్‌లోని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్‌లో సూపర్వైజర్గా పని చేస్తోంది. -
డోక్లాం తర్వాత మరో వివాదం?
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య రెండు నెలలకుపైగా డోక్లాం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. భూటాన్‌కు మద్దతుగా భారత్ నిలవటం.. చైనా దుందుడుకు చేష్టలు.. ప్రతిగా భారత్ దళాలు ముందుకు దూసుకుపోవటం... ఇలా దాదాపు ట్రై జంక్షన్ వద్ద పరిస్థితులు యుద్ధ వాతావరణాన్నే తలపించాయి. చివరకు అంతర్జాతీయ సమాజం చొరవతో దౌత్యం ద్వారానే సమస్యను భారత్ సామరస్యంగా పరిష్కరించగలిగింది. అయితే రానున్న రోజుల్లో మరో సమస్య ద్వారా ఇరు దేశాల మధ్య వివాదం రాజుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే నదుల సమస్య. ఎగువన ఉన్న బ్రహ్మపుత్ర, సట్లేజ్ నదులు చైనా గుండానే మన దేశంలో ప్రవహిస్తున్నాయి. అయితే ఆయా నదులకు వరదలు వచ్చే సమయంలో అప్రమత్తత చేయాల్సిన బాధ్యత చైనాదే. ఈ మేరకు ఇరు దేశాల మధ్య దశాబ్దాల క్రితమే కీలక ఒప్పందం కూడా జరిగింది. మే 15 నుంచి అక్టోబర్ 15 మధ్య ముఖ్యంగా వర్షకాల సమయంలో బీజింగ్ వాతావరణ శాఖ ఇచ్చే సమాచారమే మనకు ముఖ్యం. కానీ, డోక్లాం వివాద నేపథ్యంలో చైనా గత కొన్ని నెలలుగా ఎలాంటి సమాచారం ఇవ్వటంలేదు. ఈ ఏడాది సరిగ్గా అదే సమయంలో డోక్లాం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో చైనా ఆ పని చేయలేదు. దీంతో బ్రహ్మపుత్ర నదికి సంభవించిన వరదల్లో 160 మంది అస్సాంలో మృతి చెందగా. రాష్ట్రంలోని 29 జిల్లాలు అతలాకుతలం అయి భారీగా నష్టం సంభవించింది. మరోవైపు సట్లేజ్ నదికి వచ్చిన వరదల్లో పంజాబ్‌లో 10 వేల ఎకరాల పంట భూమి నాశనం అయ్యింది. చైనా చెప్పేది నమ్మొచ్చా? దీనిపై బీజింగ్ వర్గాలు స్పందించాయి. హైడ్రోలాజికల్ డేటాను అందించకపోవటానికి కారణాలు వివరిస్తున్నాయి. టిబెట్ ప్రాంతంలో నెలకొల్పిన వరద గుర్తింపు కేంద్రాలు వరదల దాటికి నాశనం కావటంతోనే న్యూఢిల్లీ కేంద్రానికి సరైన సమాచారం అందించలేకపోయామని.. పునరుద్ధరణ పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయో ఖచ్ఛితంగా చెప్పలేమని గెంగ్ షువాంగ్ అనే అధికారి తెలిపారు. అయితే మనతోపాటే ఒప్పందం చేసుకున్న బంగ్లాదేశ్‌కు మాత్రం చైనా పక్కా సమాచారం అందించటంతో .. డ్రాగన్ దేశం కావాలనే చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ అంశంపై వివాదం తలెత్తే అవకాశం లేకపోలేదన్నది విశ్లేషకుల మాట. -
అసోంలో కొట్టుకుపోయి.. బంగ్లాదేశ్‌లో మృతి
అసోంలో బ్రహ్మపుత్రా నదికి భారీగా వరదలు రావడంతో అందులో సుమారు 50 రోజుల క్రితం కొట్టుకుపోయింది.. చివరకు బంగ్లాదేశ్‌లో తేలి, అక్కడ చనిపోయింది. అవును.. మన దేశానికి చెందిన ఏనుగు బంగ్లాదేశ్‌లో చనిపోయింది. 'బంగబహదూర్' అనే పేరున్న ఈ ఏనుగును ఢాకా సమీపంలోని సఫారీ పార్కుకు తరలించేందుకు వన్యప్రాణి అధికారులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాన్ని కాపాడేందుకు తాము చాలా ప్రయత్నించినా అది బతకలేదని బంగ్లాదేశ్ అటవీ శాఖాధికారులు చెప్పారు. అయితే ఆ ఏనుగు మృతికి సరైన కారణం తెలుసుకునేందుకు దానికి అటాప్సీ నిర్వహించే అవకాశం ఉంది. ఆ ఏనుగు బాగా నీరసంగా ఉందని.. అసోంలోని ధుబ్రి జిల్లాలో బ్రహ్మపుత్రా నది వరదల్లో కొట్టుకుపోయిందని చెబుతున్నారు. ఏనుగు చనిపోయిన విషయం తెలిసి ఇటు అసోంతో పాటు అటు బంగ్లాదేశ్‌లో కూడా పలువురు గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈనెల 11వ తేదీన బంగ్లాదేశ్‌లో దానికి అటవీ శాఖాధికారులు మత్తుమందు ఇచ్చారు. ఒక కొలనులో ఉన్న ఆ ఏనుగును తాళ్లు, చైన్లతో బయటకు లాగి మునిగిపోకుండా చూసేందుకు ప్రయత్నించారు. ఆదివారం వరకు అది బాగానే ఉందని, కానీ చివరకు చనిపోయిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఏనుగులు అంత వేడిని భరించలేవని.. దానికి తాము సాధారణంగా ఇచ్చే ఆహారమే ఇచ్చి బతికించేందుకు ప్రయత్నించినా అది బతకలేదని మరో అధికారి చెప్పారు.


