డోక్లాం తర్వాత మరో వివాదం?

China Not Alert India during Floods

సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య రెండు నెలలకుపైగా డోక్లాం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. భూటాన్‌కు మద్దతుగా భారత్‌ నిలవటం.. చైనా దుందుడుకు చేష్టలు.. ప్రతిగా భారత్‌ దళాలు ముందుకు దూసుకుపోవటం... ఇలా దాదాపు ట్రై జంక్షన్‌ వద్ద పరిస్థితులు యుద్ధ వాతావరణాన్నే తలపించాయి. చివరకు అంతర్జాతీయ సమాజం చొరవతో దౌత్యం ద్వారానే సమస్యను భారత్‌ సామరస్యంగా పరిష్కరించగలిగింది. అయితే రానున్న రోజుల్లో మరో సమస్య ద్వారా ఇరు దేశాల మధ్య వివాదం రాజుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 

అదే నదుల సమస్య. ఎగువన ఉన్న బ్రహ్మపుత్ర, సట్లేజ్‌ నదులు చైనా గుండానే మన దేశంలో ప్రవహిస్తున్నాయి. అయితే ఆయా నదులకు వరదలు వచ్చే సమయంలో అప్రమత్తత చేయాల్సిన బాధ్యత చైనాదే. ఈ మేరకు ఇరు దేశాల మధ్య దశాబ్దాల క్రితమే కీలక ఒప్పందం కూడా జరిగింది. మే 15 నుంచి అక్టోబర్ 15 మధ్య ముఖ్యంగా వర్షకాల సమయంలో బీజింగ్‌ వాతావరణ శాఖ ఇచ్చే సమాచారమే మనకు ముఖ్యం.  కానీ, డోక్లాం వివాద నేపథ్యంలో చైనా గత కొన్ని నెలలుగా ఎలాంటి సమాచారం ఇవ్వటంలేదు. 

ఈ ఏడాది సరిగ్గా అదే సమయంలో డోక్లాం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో చైనా ఆ పని చేయలేదు. దీంతో బ్రహ్మపుత్ర నదికి సంభవించిన వరదల్లో 160 మంది అస్సాంలో మృతి చెందగా. రాష్ట్రంలోని 29 జిల్లాలు అతలాకుతలం అయి భారీగా నష్టం సంభవించింది. మరోవైపు సట్లేజ్‌ నదికి వచ్చిన వరదల్లో పంజాబ్‌లో 10 వేల ఎకరాల పంట భూమి నాశనం అయ్యింది. 

చైనా చెప్పేది నమ్మొచ్చా?

దీనిపై బీజింగ్ వర్గాలు స్పందించాయి. హైడ్రోలాజికల్‌ డేటాను అందించకపోవటానికి కారణాలు వివరిస్తున్నాయి. టిబెట్‌ ప్రాంతంలో నెలకొల్పిన వరద గుర్తింపు కేంద్రాలు వరదల దాటికి నాశనం కావటంతోనే న్యూఢిల్లీ కేంద్రానికి సరైన సమాచారం అందించలేకపోయామని.. పునరుద్ధరణ పనులు ఎప్పటి వరకు పూర్తవుతాయో ఖచ్ఛితంగా చెప్పలేమని గెంగ్‌ షువాంగ్ అనే అధికారి తెలిపారు. అయితే మనతోపాటే ఒ‍ప్పందం చేసుకున్న బంగ్లాదేశ్‌కు మాత్రం చైనా పక్కా సమాచారం అందించటంతో .. డ్రాగన్ దేశం కావాలనే చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ అంశంపై వివాదం తలెత్తే అవకాశం లేకపోలేదన్నది విశ్లేషకుల మాట.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top