‘రాకా’ సినిమా చిత్రీకరణలో రష్మికా మందన్నా పాల్గొనే సమయం ఆసన్నమైందని తెలిసింది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఇతర ప్రధాన పాత్రల్లో రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా మేజర్ షూటింగ్ ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఏర్పాటు చేసిన సెట్స్‌లో జరుగుతోంది.
కాగా, ‘రాకా’ చిత్రానికి సంబంధించిన ఓ కీలక యాక్షన్ షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొనడానికి ఈ నెల చివర్లో ముంబైకి వెళ్తున్నారట రష్మికా మందన్నా. నిజానికి ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను ఈపాటికే చిత్రీకరించాల్సింది. కానీ ‘మైసా’ చిత్రీకరణ సమయంలో రష్మిక గాయపడ్డారు. దీంతో ఈ చిత్రీకరణ వాయిదా పడింది. అలాగే ‘రాకా’ చిత్రంలో రష్మిక పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది.
సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ వచ్చే ఏడాది చివర్లో విడుదల కానుందట. ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న మిలన్ ఫ్యాషన్ వీక్‌లో సందడి చేస్తున్నారు రష్మిక. ఆమె భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత ‘రాకా’ చిత్రీకరణలో పాల్గొంటారని ఊహించవచ్చు. ఇక విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా అక్టోబరు 16న, రష్మిక టైటిల్ రోల్ చేసిన ‘మైసా’ మూవీ నవంబరు 27న రిలీజ్ కానున్నాయి.


