బోఫోర్స్‌ కేసు.. చివరి తలుపు కూడా మూసేసింది! | Bofors Case Finally Ends: SC Shuts Door on Last Legal Challenge | Sakshi
Sakshi News home page

బోఫోర్స్‌ కేసు.. చివరి తలుపు కూడా మూసేసింది!

Aug 7 2026 7:43 AM | Updated on Aug 7 2026 10:44 AM

Bofors Case Finally Ends: SC Shuts Door on Last Legal Challenge

దేశ రాజకీయాలను దశాబ్దాల పాటు కుదిపేసిన సంచలన బోఫోర్స్‌ కేసుకు ఎట్టకేలకు న్యాయపరంగా ముగింపు పడింది. ఒకప్పుడు అధికార పీఠాలను కదిలించిన ఈ వివాదంలో మిగిలిన చివరి న్యాయపోరాటానికి సుప్రీంకోర్టు తెరదించింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన ఈ కేసులో ఇకపై కొత్త విచారణకు అవకాశం లేకుండా పోయింది. రాజకీయ ప్రకంపనల నుంచి సుదీర్ఘ న్యాయ పోరాటం వరకు సాగిన బోఫోర్స్‌ అధ్యాయానికి తాజా తీర్పుతో ముగింపు లభించింది.

2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ కే వినోద్‌ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం.. న్యాయవాది అజయ్‌ కె. అగర్వాల్‌ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించేందుకు నిరాకరించింది.ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు కేసును కొట్టివేయడం, దానిపై సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌ కూడా తిరస్కరణకు గురికావడంతో మళ్లీ విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో హిందూజా సోదరులు, స్వీడన్‌ ఆయుధ సంస్థ ఏబీ బోఫోర్స్‌పై ఉన్న కేసును తిరిగి తెరవడానికి ఇక మార్గం లేకుండా పోయింది.

“ఇంకా ఏం మిగిలింది?”.. సుప్రీం ప్రశ్న
విచారణ సందర్భంగా పిటిషన్‌లో ఉన్న హిందూజా సోదరులు శ్రీచంద్‌ పీ. హిందూజా, గోపీచంద్‌ పీ. హిందూజాలు మరణించిన నేపథ్యంలో వారి పేర్లు తొలగించేందుకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని పిటిషనర్‌ కోరారు. అయితే సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. ఇప్పటికే 2005లో ఢిల్లీ హైకోర్టు అన్ని క్రిమినల్‌ కేసులను కొట్టివేసిందని, 2018లో సీబీఐ అప్పీల్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించిందని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో దశాబ్దాల నాటి వివాదాన్ని కొనసాగించడంలో అర్థం లేదని స్పష్టం చేసింది.

అసలు బోఫోర్స్‌ వివాదం ఏంటి?
1986లో భారత్‌–స్వీడన్‌ ఆయుధ సంస్థ ఏబీ బోఫోర్స్‌ మధ్య రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. భారత సైన్యం కోసం 400 హోవిట్జర్‌ తుపాకుల కొనుగోలుకు ఈ ఒప్పందం జరిగింది. 1987లో స్వీడిష్‌ రేడియో ఈ ఒప్పందంలో అక్రమ కమీషన్లు చెల్లించారంటూ ఆరోపణలు చేయడంతో దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. ఆయుధ ఒప్పందంలో మధ్యవర్తులకు భారీగా డబ్బులు చెల్లించారన్న ఆరోపణలు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి.

భారత రాజకీయాల్లో కల్లోలం
బోఫోర్స్‌ ఆరోపణలు అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పెద్ద రాజకీయ సవాలుగా మారాయి. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని తీవ్రంగా ప్రస్తావించాయి. 1989 లోక్‌సభ ఎన్నికల్లోనూ బోఫోర్స్‌ ప్రధాన ప్రచార అంశాల్లో ఒకటిగా నిలిచింది. ఈ వివాదం కారణంగా కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయంగా భారీ నష్టం జరిగిందని అప్పట్లో విశ్లేషణలు వెలువడ్డాయి. 

ఈ కేసులో ఇటాలియన్‌ వ్యాపారవేత్త ఒట్టావియో క్వత్రోచ్చి పేరు కూడా ప్రధానంగా వినిపించింది. ఆయుధ ఒప్పందంలో మధ్యవర్తిత్వం, కమీషన్ల ఆరోపణల నేపథ్యంలో ఆయనపై దర్యాప్తు సాగింది. అయితే ఆయనను భారత్‌కు తీసుకురావడంలో దర్యాప్తు సంస్థలు చివరకు విజయం సాధించలేకపోయాయి.

14 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు
2005లో ఢిల్లీ హైకోర్టు సీబీఐ ఆధారాలు బలంగా లేవని పేర్కొంటూ హిందూజా సోదరులు, ఏబీ బోఫోర్స్‌పై ఉన్న అభియోగాలను కొట్టివేసింది. సీబీఐ దర్యాప్తు తీరుపైనా కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ దర్యాప్తుకు భారీగా ప్రజాధనం ఖర్చయిందని పేర్కొంది. ఆ తర్వాత సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించినా.. 4,522 రోజుల ఆలస్యంపై 2018లో ఆ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది.

తాజా తీర్పుతో బోఫోర్స్‌ కేసులో మిగిలిన చివరి న్యాయ మార్గం కూడా మూసుకుపోయింది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగిన ఈ వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో అధికారికంగా తెరపడింది. అయితే భారత రాజకీయ చరిత్రలో మాత్రం బోఫోర్స్‌ వివాదం ఎప్పటికీ ఒక కీలక అధ్యాయంగానే మిగిలిపోనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement