
2030కల్లా జరిగే వీలు...
జీఎస్‌టీ సంస్కరణల ఎఫెక్ట్
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వస్తు, సేవల పన్ను(GST) సంస్కరణలు పునరుత్పాదక ఇంధన(renewable energy) రంగంలో భారీ పొదుపునకు తెరతీయనున్నట్లు మంత్రి ప్రహ్లాద్ జోషీ పేర్కొన్నారు. దీంతో 2030కల్లా రెనెవబుల్ ఎనర్జీ రంగంలో రూ.1.5 లక్షల కోట్లవరకూ ఆదాకానున్నట్లు అభిప్రాయపడ్డారు. వినియోగదారులకు ఇది నవరాత్రి కానుకగా జీఎస్‌టీ సంస్కరణల అమలు తొలి రోజు నూతన, పునరుత్పాదక ఇంధన కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోకూడిన జీఎస్‌టీ కౌన్సిల్ పన్ను రేట్ల తగ్గింపునకు నిర్ణయించడంతో 2030కల్లా 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్న భారత్ భారీ లక్ష్యానికి మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు. సీఐఐ ఇక్కడ నిర్వహించిన 6వ అంతర్జాతీయ ఇంధన సదస్సు సందర్భంగా విలేకరులతో మంత్రి పలు అంశాలపై మాట్లాడారు.
చౌకగా రూఫ్‌టాప్ సోలార్
ప్రధానంగా నవరాత్రి తొలిరోజు రెనెవబుల్స్ పరికరాలపై జీఎస్‌టీ రేట్లు తగ్గించిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు జోషీ చెప్పారు. రెనెవబుల్ పరికరాలపై జీఎస్‌టీ 18 శాతం నుంచి 5 శాతానికి దిగివచి్చనట్లు వెల్లడించారు. దీంతో ఇన్వెస్టర్లకు 2030కల్లా రూ. లక్ష కోట్ల నుంచి 1.5 లక్షల కోట్లవరకూ ఆదాకానున్నట్లు తెలియజేశారు. 2030కల్లా భారత్ 300 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జత చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు ప్రస్తావించారు. దీనిలో భాగంగా 2–3 శాతం వ్యయాలు ఆదా అయినప్పటికీ రూ. 1–1.5 లక్షల కోట్లమేర పెట్టుబడులలో పొదుపునకు వీలుంటుందని వివరించారు.
పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా 3 కేడబ్ల్యూ సిస్టమ్ రూఫ్‌టాప్ సోలార్ రూ. 9,000–10,500మేర చౌక కానున్నట్లు వెల్లడించారు. పీఎం కుసుమ్‌లో భాగంగా 10 లక్షల సోలార్ పంప్‌ల ద్వారా రైతులకు రూ. 1,750 కోట్లమేర ఆదాకానున్నట్లు అంచనా వేశారు.
ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లే ఇప్పుడు దిక్కు