
గ్రీన్ ఎనర్జీ పాలసీ కింద ప్రభుత్వం అనుమతించింది
45.60 ఎకరాలను ప్రభుత్వం నిర్ధారించిన రేటుకు ఇచ్చింది
కానీ గడ్డి పెంచుకోవడానికి 800 ఎకరాలు ఇవ్వలేదు
మంత్రి కొలుసు పార్థసారథి వివరణ
గడ్డి పెంచుకోవడానికి 800 ఎకరాలు లీజుకు ఇచ్చినట్లు జీవోలో పేర్కొన్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి: తమ కంపెనీ నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నూజివీడు నియోజకవర్గంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి గ్రీన్ ఎనర్జీ పాలసీ కింద ప్రభుత్వం భూములు కేటాయించి, అనుమతించిందని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. “కొలుసుకు భూ గొలుసు’ శీర్షికన మంగళవారం “సాక్షి’లో వచ్చిన వార్తపై ఆయన వివరణ ఇచ్చారు. గ్రీన్ ఎనర్జీ పాలసీ కింద ప్రభుత్వం తమ కంపెనీకి కంప్రెస్ట్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు 45.60 ఎకరాలను నిర్ధారించిన రేటుకు ఇచ్చిందని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ పాలసీలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు స్థాపించడానికి అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయని, అర్హతలున్న వారికి షరతులకు లోబడి ప్రభుత్వం అనుమతి ఇస్తుందని పేర్కొన్నారు. నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కూడా అలాగే వచ్చిందని తెలిపారు. కంపెనీకి ఇచ్చింది 45.60 ఎకరాలు.. అది కూడా ప్రభుత్వం నిర్ధారించిన రేటుకేనని పేర్కొన్నారు. క్లీన్ ఎనర్జీ పాలసీ కింద కంపెనీ ఏర్పాటుకు నేపియర్ గడ్డి పెంచుకోవడానికి కూడా భూమి లీజుకు ఇచ్చే అవకాశం ఉన్నా కంపెనీకి ఇవ్వలేదని తెలిపారు.
జీవోలో ఇచ్చినట్లు ఉన్నా 800 ఎకరాలు ఇవ్వలేదన్న మంత్రి
ప్లాంటుకు సమీపంలోనే అందుబాటులో ఉన్న 800 ఎకరాల రెవెన్యూ భూమిని నేపియర్ గడ్డి సాగుకోసం కేటాయించినట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఎకరానికి సంవత్సరానికి రూ.15 వేల లీజు ప్రాతిపదికన గ్రీన్ ఎనర్జీ పాలసీ ప్రకారం 25 సంవత్సరాల కాలపరిమితికి ఇచ్చినట్లు జీవోలో స్పష్టం చేసింది. నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాటాదారులతో సంప్రదించిన తరువాతనే ప్రభుత్వం ఈ కింది విధంగా ఉత్తర్వులు జారీచేసినట్లు జీవోలో పేర్కొనడం కొసమెరుపు.
వాటాదారులను సంప్రదించిన తరువాతనే కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటునకు మొదటిదశలో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో 45.60 ఎకరాలను ఎకరం రూ.5 లక్షల చొప్పున కేటాయించినట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. అలాగే ప్లాంట్ సమీపంలో అందుబాటులో ఉన్న 800 ఎకరాల రెవెన్యూ భూమిని నేపియర్ గడ్డి సాగుకోసం లీజుకు కేటాయించినట్లు జీవోలో తెలిపింది. జీవోలో స్పష్టంగా ఉన్నా.. మంత్రి కొలుసు మాత్రం గడ్డిసాగుకు భూమి కేటాయించలేదంటూ అవాస్తవాలను పేర్కొనడం గమనార్హం.