
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రికి డిప్యూటీ సీఎం భట్టి వినతి
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఎనర్జీ కారిడార్ మూడో దశ పథకం కింద రాష్ట్ర ట్రాన్స్‌కో చేసిన ప్రతిపాదనలకు అనుమతినివ్వాలని.. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని గురువారం కలిశారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 13.5 గిగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ పవర్ జోన్‌ను గుర్తించిందని తెలిపారు.
సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా జాతీయ కారిడార్‌కు అందించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఇందుకోసం ట్రాన్స్‌కో రూ.6895 కోట్లతో ఎనిమిది ట్రాన్స్‌మిషన్ పథకాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. కేంద్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అనుమతించాల్సి ఉందన్నారు. అనుమతులు త్వరగా వచ్చేలా చూడాలని ‘భట్టి’ కోరారు.